ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Apr 16,2025 22:46
నాయకులు, ప్రజలు డిమాండ్‌ చేశారు.

ప్రజాశక్తి – తాళ్లరేవు

గ్రామాల్లో నెలకున్న సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరంగి, తాళ్ళరేవు, గాడిమొగ పంచాయతీలలో జరిగిన గ్రామసభల్లో పలువురు నాయకులు, ప్రజలు డిమాండ్‌ చేశారు. బుధవారం కోరంగి పంచాయతీ ఆవరణలో జరిగిన గ్రామ సభకు సర్పంచ్‌ పెయ్యల మంగేష్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలు సమస్యలను ప్రజాసంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ టేకుమూడి ఈశ్వరరావు, వార్డు సభ్యులు సంగాడి శ్రీను, స్థానికులు రేవు వాసు సర్పంచ్‌ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వం వచ్చి ఏడాది కావస్తున్నా నేటికీ వేట నిషేధ పరిహారం ఇవ్వలేదని, మత్స్యకారులు ఏమి తిని బ్రతకాలని మత్స్య శాఖ అధికారులను నిలదీశారు. బొడ్డు చిన వెంకటాయపాలెం తాగునీటి చెరువు వ్యర్థాలతో కలుషితం అవుతుందని, దీనిపై చర్యలు తీసుకోవాలని టిడిపి నాయకులు వాడ్రేవు వీరబాబు కోరారు. కోరంగిలోని కమ్యూనిటీ భవనానికి మల్లాడి సత్యలింగం నాయకర్‌ పేరు పెట్టాలని అగ్నికుల క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వైదాడి నూకరాజు సర్పంచ్‌కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్‌పిటిసి పొన్నమండ రామలక్ష్మి, ఎంపిటిసి పోతుల రత్నకుమారి, ఉప సర్పంచ్‌ భైరవమూర్తి, మాజీ సర్పంచ్‌ బర్రే లక్ష్మీనరసింహరాజు, తదితరులు పాల్గొన్నారు.

➡️