- సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సెంబ్‌కార్బ్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ (సెయిల్) సంస్థతో విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఒప్పంద ప్రతిపాదనల్లో ఉన్న అవకతవకలను సరిదిద్దాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్ బాబూరావు డిమాండ్ చేశారు. సెయిల్ నుంచి 660 మెగావాట్లను 12 ఏళ్ల పాటు విద్యుత్ పంపిణీ సంస్థలు తీసుకునే ఒప్పందంపై విద్యుత్ నియంత్రణ మండలి బుధవారం విచారణ జరిపింది. వర్చువల్‌గా పాల్గొన్న బాబూరావు మాట్లాడుతూ సెయిల్ మూల వ్యయాన్ని రూ.2200 కోట్లు అధికంగా చూపించి లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఒక మెగావాట్‌కు సగటు వ్యయం రూ.5.37 కోట్లు ఉండగా, రూ.7.3 కోట్లు చూపడం పూర్తిగా మోసపూరితమని పేర్కొన్నారు. దీనిద్వారా థర్మల్ విద్యుత్ యూనిట్‌కు అధిక ధరలు నిర్ణయించి వినియోగదారులపై భారాలు మోపడానికి కుట్ర పన్నారని విమర్శించారు. కొందరు అవినీతి ఉన్నతాధికారులు, పాలక పార్టీల నేతలు, కార్పొరేట్ కంపెనీలు కూడగట్టుకొని విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025-26 నుంచి సరఫరా ప్రతిపాదన ఉండగా 2024-25 నుంచే ఫిక్స్‌డ్ చార్జీలు రూ.1029కోట్లు చెల్లించాలని కోరుతూ కంపెనీ మరో మోసానికి పాల్పడుతోందన్నారు. 2024-25 సంవత్సరం పన్నుల ఖర్చులను కలిపి అంచనాలు రూపొందించడం తీవ్ర అభ్యంతరకరమని పేర్కొన్నారు. సెంట్రల్ ట్రాన్స్‌మిషన్ సంస్థ ద్వారా సరఫరా వ్యయం, నష్టాలు ఎక్కువగా ఉన్నందున ఈ భారాలు వినియోగదారులపైనే పడతాయని తెలిపారు. వివిధ రూపాల్లో వేలాది కోట్లు అదనపు వ్యయం చూపించి యూనిట్‌కు అధిక ధరలు నిర్ణయించడానికి ఎపిఇఆర్‌సిని తప్పుదారి పట్టించే ప్రయత్నాలు చేయటం గర్హనీయమని పేర్కొన్నారు. ఒప్పంద ప్రతిపాదనలో ఉన్న లోపాలను సరిదిద్దాలని, లేదంటే తిరస్కరించాలని కోరారు. మైనింగ్ మాఫియా అక్రమాలపై విచారణ జరిగినట్లే విద్యుత్ మాఫియాపై విచారణ జరిపి అవకతవకలు పాల్పడిన వారిని జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. యాక్సిస్ సంస్థ అడ్డగోలు ప్రతిపాదనలకు ప్రభుత్వ ఒత్తిళ్లకు లొంగి విద్యుత్ నియంత్రణ మండలి యూనిట్‌కు రూ.4.60 ధర నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేయడం తీవ్ర అభ్యంతరకరమని తెలిపారు.