స్వతంత్ర భారతదేశ చరిత్రలో నవంబర్ 26 అత్యంత ప్రాధాన్యత కలిగిన రోజు. మరీ ముఖ్యంగా ఆధునిక, లౌకిక, ప్రజాస్వామ్య, భారతదేశ నిర్మాణంలో ఈ రోజుకు చాలా ప్రాధాన్యత ఉంది. కారణం 1949 నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చింది 1947 ఆగస్టు 15. ఆ రోజుతో తెల్లవాడి పాలన, అంటే సామ్రాజ్యవాదుల పాలన అంతమై, అధికారం భారత పాలక వర్గాల చేతుల్లోకి బదలాయించబడింది. ఈ నూతన పాలక వర్గాలు రాజ్యాంగ సభ నూతన భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. రాజ్యాంగం ఏర్పడిన తర్వాత చర్చ మొత్తం సహజంగానే రాజ్యాంగం చుట్టే తిరుగుతుంది. అనేకసార్లు పాలకవర్గాలు తమ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూనే ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాజ్యాంగసభలో ముసాయిదాని ప్రవేశపెడుతూ ”రాజ్యాంగం ఎంత ఉన్నతమైనదైనా దాన్ని అమలు చేసేవారు ఉన్నతులు కాకపోతే అది ఒక చెడ్డ రాజ్యాంగంగానే నిరూపించబడుతుంది” అని చేసిన హెచ్చరిక ఆధారంగానే భారత రాజ్యాంగం అమలు చరిత్రని విశ్లేషించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు భారత రాజ్యాంగ ముఖ్యలక్షణాల గురించి ప్రత్యేక కథనం.
భారత రాజ్యాంగ పరిషత్ భారత రాజ్యాంగాన్ని రూపొందించింది. 1949 నవంబర్ 26న ఆమోదం పొందిన భారత రాజ్యాంగం 1950 జనవరి 26 నుండి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ నిర్మాణంలో రాజ్యాంగ నిర్మాతలు ఆధునిక ప్రపంచంలోని తాత్విక పునాదులను అనుసరించారు. ఉదారవాదం, ప్రజాస్వామ్య సామ్యవాదం, లౌకికవాదం, గాంధీవాదం మొదలైన మూల సూత్రాలను రాజ్యాంగంలో పొందుపర్చారు. సమన్యాయ పాలన, ప్రాథమిక స్వేచ్ఛలు ప్రజలకు ఉండాలని భావించారు. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగాలని ప్రతిపాదించారు. వీటన్నింటి ఆధారంగా రాజ్యాంగ మౌలిక లక్షణాలు రూపొందాయి.
లిఖితంగా.. విపులంగా..
ప్రపంచంలో భారత రాజ్యాంగం అతి పెద్ద లిఖిత రాజ్యాంగం. రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ రచనకు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు తీసుకుంది. భారతదేశంలోని భిన్నత్వం, అన్ని తరగతుల ప్రయోజనాలు రక్షించాలనే దృక్పథం రాజ్యాంగంలో కనిపిస్తుంది. దళితులు, గిరిజనులు, ఇతర వెనుకబడిన తరగతుల ప్రయోజనాల పరిరక్షణకు రాజ్యాంగంలో అనేక నిబంధనలను పొందుపర్చారు. అనేక విధులను నిర్వహించడానికి రాజ్యాంగ సంస్థలను ఏర్పాటు చేశారు. రాజ్యాంగం రచించినప్పుడు రాజ్యాంగంలో 395 నిబంధనలు, 22 భాగాలు, 8 షెడ్యూళ్లు ఉన్నాయి. గత ఏడు దశాబ్దాలుగా జరిగిన మార్పుల్లో ప్రస్తుతం రాజ్యాంగంలో 468 నిబంధనలు, 25 భాగాలు, 12 షెడ్యూళ్లు కలవు. 1951లో మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా 9వ షెడ్యూల్, 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పదో షెడ్యూల్, 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్, 1992లో 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 12వ షెడ్యూల్ చేర్చారు. వీటన్నింటి వల్ల భారత రాజ్యాంగం పరిమాణంలో పెద్దదిగా రూపొందింది.
రాజ్యాంగం డ్రాఫ్టింగ్ కమిటీ, 1947 ఆగస్టు 29 – (కూర్చున్నవారు) ఎన్ మాధవరావు, మహ్మద్ సాదుల్లా, బీఆర్ అంబేద్కర్, అల్లాడి క్రిష్ణస్వామి, బీఎన్ రావు. (నిల్చున్నవారు) ఎన్ గోపాలస్వామి, బీఎల్ మిట్టర్, డీపీ ఖైతాన్
మౌలిక స్వరూపం..
భారత రాజ్యాంగంలో మౌలిక స్వరూపం గురించి పేర్కొనలేదు. కానీ 1973లో కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో సుప్రీం కోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని వివరించి, దాన్ని కాపాడుకోవాలని చెప్పింది. వివిధ కేసుల్లో జస్టిస్ సిక్రి, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ హెగ్డే మొదలైనవారి తీర్పులను పరిశీలిస్తే రాజ్యాంగ మౌలిక స్వరూప లక్షణాలు తెలుస్తాయి. రాజ్యాంగ ఆధిక్యత, ప్రజాస్వామ్య, సమాఖ్య విధానం, లౌకిక విధానం, సమన్యాయం, సార్వభౌమాధికారం మొదలైనవాటిని మౌలిక లక్షణాలుగా పేర్కొన్నారు. మినర్వామిల్స్ కేస్ (1980), వామన్రావ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1981) కేసుల్లో కూడా సుప్రీం కోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూప ప్రాధాన్యతను తెలిపింది.
పీఠిక..
భారత రాజ్యాంగ లక్ష్యాలను పీఠికలో పొందుపర్చారు. పీఠికలోని ‘భారతదేశ ప్రజలమైన మేము’ అను వాక్యాన్ని ఐక్యరాజ్య సమితి రాజ్యాంగమైన చాప్టర్ నుండి గ్రహించారు. రాజ్యాంగం రచించినప్పుడు పీఠిక ‘సర్వసత్తాక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా’ పేర్కొన్నారు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను నూతనంగా చేర్చారు. దీనితో పీఠిక ‘సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యముగా’ రూపొందింది. ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం చేకూరాలని పీఠిక చెప్పింది. ప్రజలకు స్వేచ్ఛ కల్పించడానికి రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులను చేర్చారు. ప్రజలకు సమానత్వం కల్పించడానికి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపర్చారు. భారతదేశంలో రాజ్యాధినేత ఎన్నుకోబడడంతో దేశం గణతంత్ర రాజ్యంగా రూపొందింది. పౌరులకు మత స్వేచ్ఛను కల్పించడంతో లౌకిక రాజ్యంగా ఉంది. భారతదేశంలో అధికారానికి మూలాధారం ప్రజలు అని పీఠిక తెలిపింది.
పార్లమెంటరీ ప్రభుత్వం..
భారత రాజ్యాంగం దేశంలో పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని ప్రవేశపెట్టింది. ప్రధానమంత్రి నాయకత్వాన గల మంత్రి మండలి నిజమైన అధికారాలను కలిగి ఉంటుంది. రాజ్యాధినేత అయిన రాష్ట్రపతి నామమాత్ర అధికారాలను కలిగి ఉంటాడు. కేంద్రంలోను, రాష్ట్రంలోను పార్లమెంటరీ తరహా ప్రభుత్వం కొనసాగుతుంది. సమిష్టి బాధ్యత, కార్యనిర్వాహక వర్గం, శాసన నిర్మాణ శాఖకు బాధ్యత వహించడం పార్లమెంటరీ విధానం యొక్క ముఖ్య లక్షణాలు. అయితే బ్రిటిష్ తరహా పార్లమెంటరీ ప్రభుత్వాన్ని భారతదేశం స్వీకరించలేదు. బ్రిటన్లో ఇప్పటికీ వారసత్వ రాజరికం కొనసాగుతోంది. కానీ భారతదేశం తనకుతాను గణతంత్ర రాజ్యంగాన్ని ప్రకటించుకుంది.
స్వతంత్ర న్యాయవ్యవస్థ..
భారత రాజ్యాంగం దేశంలో స్వతంత్ర న్యాయవ్యవస్థను ఏర్పాటు చేసింది. న్యాయవ్యవస్థ ఏకీకృత న్యాయ వ్యవస్థగా ఉంటుంది. రాజ్యాంగంలో చెప్పనప్పటికీ న్యాయవ్యవస్థ న్యాయ సమీక్ష అధికారాన్ని కలిగి ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థ క్రియాశీలత కొనసాగుతోంది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ప్రధాన న్యాయమూర్తితో సహా 31 మంది న్యాయమూర్తులు కొనసాగుతున్నారు. దేశంలో వివిధ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు 24 హైకోర్టులు ఏర్పడి పనిచేస్తున్నాయి. న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం వ్యవస్థ ఏర్పడింది. ఇటీవల జాతీయ న్యాయమూర్తుల నియామక కమిషన్‌ను 99వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పాటు చేసినప్పటికీ సుప్రీం కోర్టు ఆ సవరణను కొట్టివేసింది. దేశంలో పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడడంలో న్యాయవ్యవస్థ క్రియాశీలక పాత్ర వహిస్తోంది. ఇటీవల కాలంలో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం ప్రాధాన్యత పొందింది.
సమాఖ్య ఏక కేంద్ర లక్షణాలు..
రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని సమాఖ్య, ఏకకేంద్ర లక్షణాల సమ్మేళనంగా రూపొందించారు. సమాఖ్య లక్షణాలైన లిఖిత రాజ్యాంగం, అధికార విభజన, ద్విసభా విధానం, స్వతంత్ర న్యాయశాఖ మొదలైనవి భారత రాజ్యాంగంలో ఉన్నప్పటికీ ఇది పూర్తి సమాఖ్య కాదు. సమాఖ్యను అధిగమించే ఏకకేంద్ర లక్షణాలు బలంగా ఉన్నాయి. అందువల్లే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశాన్ని ఏకకేంద్ర స్ఫూర్తితో పనిచేస్తున్న సమాఖ్య రాజ్యంగా వర్ణించాడు. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు కె.సి.వేర్ భారతదేశాన్ని ‘అర్ధ సమాఖ్య’ అని వర్ణించాడు. ఏకకేంద్ర లక్షణాలైన ఒకే పౌరసత్వం, ఏకీకృత న్యాయవ్యవస్థ, అఖిల భారత సర్వీసుల పాత్ర, కేంద్ర ఆధిక్యత మొదలైనవి కూడా రాజ్యాంగంలో ఉన్నాయి.
ప్రాథమిక హక్కులు..
రాజ్యాంగం మూడో భాగంలో 12 నుండి 35 వరకు గల నిబంధనల్లో ప్రాథమిక హక్కులను పొందుపర్చారు. భారత పౌరులకు స్వేచ్ఛను కల్పించడానికి ఈ హక్కులు దోహదపడతాయి. సుప్రీం కోర్టు 32వ నిబంధనల ద్వారా, హైకోర్టు 226వ నిబంధన ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటానికి ఐదు రకాల రిట్లు జారీ చేస్తాయి. ఆస్తి హక్కు వివాదం కావడంతో 1978లో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల నుండి తొలగించారు. ప్రస్తుతం ఆస్తి హక్కు ఒక చట్టబద్ధమైన హక్కు మాత్రమే. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 21-ఎ నిబంధన చేర్చి, ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా పొందుపర్చారు. అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో ప్రాథమిక హక్కులు తాత్కాలికంగా సస్పెండ్ అవుతాయి.
ప్రాథమిక విధులు..
రాజ్యాంగ రచనా సమయంలో ప్రాథమిక విధులు రాజ్యాంగంలో లేవు. స్వర్ణసింగ్ కమిటీ సిఫార్సుల ఆధారంగా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 ప్రాథమిక విధులను రాజ్యాంగం 4-ఎ భాగంలో, 51-ఎ నిబంధనలో చేర్చారు. తర్వాత 86వ రాజ్యాంగ సవరణ ద్వారా మరోక ప్రాథమిక విధిని జత చేశారు. ఇప్పుడు రాజ్యాంగంలో 11 ప్రాథమిక విధులున్నాయి. రాజ్యాంగాన్ని, జాతీయ పతాకాన్ని, జాతీయ గీతాన్ని గౌరవించడం, హింసను విడనాడడం, ప్రభుత్వ ఆస్తులను కాపాడడం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవడం వంటి అంశాలు ప్రాథమిక విధుల్లో ఉన్నాయి. భారత పౌరుల్లో బాధ్యతాయుత ప్రవర్తనను పెంపొందించే ఆశయంతో ప్రాథమిక విధులను భారత రాజ్యాంగంలో చేర్చారు.
ఆదేశిక సూత్రాలు..
రాజ్యాంగం నాలుగవ భాగంలో 36 నుండి 51 వరకు గల నిబంధనల్లో ఆదేశిక సూత్రాలను పొందుపర్చారు. వీటిని ఐర్లండ్ రాజ్యాంగం నుండి గ్రహించారు. ఆదేశిక సూత్రాలు భారతదేశాన్ని ఒక సంక్షేమ రాజ్యంగా రూపొందించడానికి తోడ్పడతాయి. భారత ప్రజల ఆర్థిక, సామాజిక, జీవన ప్రమాణాలు పెంపొందించడానికి ఆదేశిక సూత్రాలను అమలు చేయాలని రాజ్యాంగం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. వీటికి న్యాయస్థానాల సంరక్షణ ఉండదు. సంపద పంపిణీ, సమాన పనికి సమాన వేతనం, కార్మికులకు సౌకర్యాలు మొదలైన అనేక అంశాలను ఆదేశిక సూత్రాల్లో పొందుపర్చారు. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు, తమ రాజకీయ సిద్ధాంతాలతో నిమిత్తం లేకుండా ఆదేశిక సూత్రాలు అమలు చేయాల్సి ఉంటుంది.
సార్వజనీన వయోజన ఓటు హక్కు..
భారత రాజ్యాంగం పౌరులందరికీ సార్వజనీన ఓటు హక్కును ప్రసాదించింది. రాజ్యాంగ రచనా సమయంలో 21 సంవత్సరాలు నిండిన స్త్రీ, పురుషులందరికీ కుల, మత, వర్గ, లింగ, జాతి భేదాలు లేకుండా ఓటు హక్కు సార్వత్రికంగా ఉండాలని రాజ్యాంగ నిర్మాతలు ప్రతిపాదించారు. అయితే 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయస్సును 21 నుండి 18 ఏళ్లకు తగ్గించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ విజయం సాధించడంలో ఓటు హక్కు ముఖ్యపాత్ర పోషించింది. గత 18వ సాధారణ ఎన్నికల్లో భారత ప్రజలు తమకుగల ఓటు హక్కును విజయవంతంగా వినియోగించుకున్నారు. 16వ సాధారణ ఎన్నికల్లో 33 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కును కలిగి ఉండడం ప్రజాస్వాయ్య చరిత్రలోనే ఒక అపూర్వమైన విషయం. రాజ్యాంగ నిర్మాతలు ప్రజలందరికీ ఓటు హక్కు ఇవ్వడం ద్వారా ప్రజా సార్వభౌమాధికారం కొనసాగుతుందని విశ్వసించారు.
దృఢ, అదృఢ రాజ్యాంగం..
భారత రాజ్యాంగం దృఢ, అదృఢ రాజ్యాంగ లక్షణాలను కలిగి ఉంది. రాజ్యాంగంలో 18వ భాగంలో 368వ నిబంధనల ద్వారా రాజ్యాంగ సవరణ జరుగుతుంది. కొన్ని అంశాలను సవరించానికి అమెరికా వలె దృఢమైన పద్ధతి అనుసరిస్తారు. ఉదాహరణకు రాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాల అధికారాలు వంటి అంశాలను సవరించడానికి దృఢమైన పద్ధతితో సవరణ చేస్తారు. కొన్ని అంశాలను బ్రిటన్ వలె అదృడమైన పద్ధతిలో సవరిస్తారు. రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల పేర్లు మార్పు, దళితులు, గిరిజనుల పాలనకు సంబంధించిన అంశాలు అదృడమైన పద్ధతిలో సవరిస్తారు. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మొదలైన వాటిని సవరించడానికి దృఢ, అదృఢ పద్ధతిని అనుసరిస్తారు.
స్థానిక సంస్థలు..
రాజకీయ వికేంద్రీకరణ ద్వారా అభివృద్ధి సాధ్యమని మహాత్మాగాంధీతో సహా అనేక మంది అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ రచనా సమయంలో స్థానిక సంస్థల గురించి కేవలం ఆదేశిక సూత్రాల్లో మాత్రమే పేర్కొన్నారు. బల్వంతరారు మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ మొదలైన వాటి సిఫార్సుల ద్వారా దేశంలో పంచాయతీ రాజ్ సంస్థలను ఏర్పాటు చేశారు. 1992లో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీరాజ్ సంస్థలకు, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా మున్సిపల్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించారు. రాజ్యాంగంలో 11వ షెడ్యూల్ ద్వారా గ్రామ పంచాయతీలకు 29 అంశాలపై, 12వ షెడ్యూల్ ద్వారా మున్సిపల్ సంస్థలకు 18 అంశాలపై అధికారాలు కల్పించారు.
అణచివేతకు గురైన వర్గాలు..
భారత సమాజంలో చారిత్రకంగా అణచివేతకు గురైన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనకబడిన తరగతుల అభ్యున్నతి కోసం రాజ్యాంగంలో అనేక రక్షణలు, రిజర్వేషన్లు కల్పించారు. రాజ్యాంగం 16వ భాగంలో ఈ వర్గాల కోసం కొన్ని ప్రత్యేక నిబంధనలు చేర్చారు. రాజ్యాంగం 5, 6 షెడ్యూళ్లలో గిరిజనుల కోసం, వారి అభ్యున్నతి కోసం ప్రత్యేక నిబంధనలు చేర్చారు. మండల కమిషన్ నివేదిక అమలులో భాగంగా వెనకబడిన తరగతులకు జాతీయ స్థాయిలో 21 శాతం రిజర్వేషన్లు కల్పించారు. ఈ వర్గాల రక్షణ కోసం జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్, జాతీయ బిసి కమిషన్, జాతీయ మహిళా కమిషన్, జాతీయ మైనార్టీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదలైన వాటిని ఏర్పాటు చేశారు. వీటిల్లో కొన్ని కమిషన్లకు రాజ్యాంగ పరమైన హోదా కల్పించారు.
– కె.ఎస్.లక్ష్మణరావు, ఎంఎల్‌సి
8309965083