పట్టణ డిమాండ్‌ మందగింపు హెచ్చు ధరల దెబ్బ

  • తక్కువ ఉద్యోగాల కల్పన ఎఫెక్ట్‌
  • మీరే అసెట్‌ షేర్‌ఖాన్‌ రిపోర్ట్‌

ముంబయి : దేశ ఆర్ధిక వ్యవస్థలో మందగింపు చోటు చేసుకోంటుందని రేటింగ్‌ ఎజెన్సీలు, విత్త సంస్థలు ఇటీవల పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. 2024 అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికంలో వినిమయ ఉత్పత్తుల రంగం వృద్ధి బలహీనంగా చోటు చేసుకుందని తాజాగా ప్రముఖ స్టాక్‌ బ్రోకర్‌, ట్రేడింగ్‌ వేదిక మీరే అసెట్‌ షేర్‌ఖాన్‌ ఓ రిపోర్ట్‌లో వెల్లడించింది. గ్రామీణ డిమాండ్‌లో కొంత రికవరీ ఉన్నప్పటికీ.. పట్టణ డిమాండ్‌ మందగించిందని పేర్కొంది. దీనికి ప్రధాన కారణం అన్ని విభాగాల ఉత్పత్తుల ధరలు పెరగడమేనని విశ్లేషించింది. మీరే అసెట్‌ షేర్‌ఖాన్‌ రిపోర్ట్‌ ప్రకారం.. అధిక ద్రవ్యోల్బణం, తక్కువ ఉద్యోగావకాశాల ప్రభావంతో పట్టణ వినియోగంలో నిరంతర తగ్గుదల చోటు చేసుకుంటుంది. అదే విధంగా మెరుగైన రుతుపవన పరిస్థితులు, వ్యవసాయ ఉత్పత్తి ద్వారా గ్రామీణ వృద్ధి మెరుగ్గా ఉంది. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ, కంపెనీల ఆదాయాలు సంవత్సరానికి 6 శాతం పెరుగుతాయని అంచనా వేసింది. ఇది ప్రధానంగా ధరల పెరుగుదల వల్ల మాత్రమే వాటి ఆదాయాలు పెరుగుతున్నాయి తప్పా.. డిమాండ్‌ పెరగడం ద్వారా కాదు. అధిక ముడిసరుకు ఖర్చులు, పెరిగిన ప్రకటనల ఖర్చులు, బలహీన నిర్వహణ పరపతి. స్థూల మార్జిన్లలో ఒత్తిడి వల్ల కూడా డిమాండ్‌ తగ్గింది.

ఆర్ధిక సేవల్లోనూ స్తబ్దత

ఆర్థిక రంగం కూడా మందగమన వృద్ధిని ఎదుర్కొంటుందని మీరే అసెట్‌ షేర్‌ఖాన్‌ వెల్లడించింది. బ్యాంకింగేతర విత్త సంస్థల రుణాల జారీల్లోనూ తగ్గుదల చోటు చేసుకుంటుంది. ముఖ్యంగా అసురక్షిత వ్యక్తిగత రుణాలు, మైక్రోఫైనాన్స్‌ విభాగాలలో. వాణిజ్య వాహనాలకు డిమాండ్‌ తక్కువగా ఉఉంది. ప్యాసింజర్‌ వాహనాలు, ట్రాక్టర్లు, ఉపయోగించిన వాహనాలు కొంత రికవరీ సంకేతాలను చూపుతున్నాయి. బీమా కంపెనీలు మాత్రం వార్షిక ప్రీమియంలో సమాన వృద్ధిని నమోదు చేసే అవకాశాలున్నాయి. డాలర్‌తో రూపాయి కరెన్సీ క్షీణత కారణంగా అంతర్జాతీయ వ్యాపార ఆదాయ వృద్ధి మధ్యస్థంగా ఉంటుందని ఆ సంస్థ అంచనా వేసింది.

➡️