ఎన్నికల నియామావళిని పక్కాగా అమలు చేయండి

ఎన్నికల పరికరాలను పరిశీలిస్తున్న కలెక్టర్‌

 

ప్రజాశక్తి-పాడేరు:ఉమ్మడి విశాఖ జిల్లలో స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఈ నెల 30వ తేదీన ఎన్నిక జరగనున్న నేపధ్యంలో ఉమ్మడి విశాఖ జిల్లా ఫరిధిలో ఉన్న పాడేరు డివిజన్‌ 11 మండలాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పక్కాగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎఎస్‌ దినేష్‌ కుమార్‌ ఆదేశించారు. బుధవారం జేసి ఎంజే అభిషేక్‌ గౌడ్‌, ఎస్పి అమిత్‌ బర్దార్‌తో కలసి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆయా మండలాల ఎంపిడిఓలు ప్రవర్తనా నియమావళి నోడల్‌ అధికారులుగా, తహసిల్దార్లు మండల మేజిస్త్రేట్లుగా వ్యవహరించాలని ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. స్థానిక సంస్థల నియోజకవర్గానికి ఈ నెల ఆరవ తేదీన నోటిఫికేషన్‌ జారీ అయ్యిందని, 30వ తేదీన పోలింగ్‌ ఉంటుందని, సెప్టెంబర్‌ మూడవ తేదీన కౌంటింగ్‌ ఉంటుందని, ఆరవ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. అంతవరకూ 11 మండలాలలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్‌ స్పష్టం చేసారు. రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫ్లేక్షీలు, పోస్టర్లు తొలగించాలని, విగ్రహాలకు ముసుగులు వేయాలని, దినపత్రికలలో వచ్చిన వార్తలపై వెంటనే స్పందించాలని ఆదేశించారు. 11 మండలాలలో ఎంపిటిసిలు, జెడ్పిటిసిలు, శాసనసభ్యులు, కో ఆప్షన్‌ సభ్యులు 177 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారని, వారికోసం పాడేరులోని సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్‌ వివరించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున ఎటువంటి రాజకీయ పార్టీల ప్రతినిధులు, వారి ప్రసంగాలు లేకుండా తొమ్మిదవ తేదీన జరుగనున్న ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ స్పష్టం చేసారు. ఎస్పీ అమిత్‌ బర్దార్‌ మాట్లాడుతూ, సమస్యాత్మక ప్రాంతాలలో పోలీస్‌ పికెట్లు ఏర్పాటు చేస్తామని, రెవెన్యు, పోలీస్‌ పరస్పర సహకారంతో ఎఫ్‌.ఎస్‌.టి, ఎస్‌ఎస్‌టి బృందాలు నిఘా పెట్టాలని ఆదేశించారు. ఓటర్లను ప్రభావితం చేసే కార్యక్రమాలపై నిఘా పెట్టి తగు చర్యలు తీసుకుంటామని, కోడ్‌ ఉల్లంఘనలపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జేసి ఎం.జే అభిషేక్‌ గౌడ్‌, 11 మండలాల ఎంపిడిఓలు, తహసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

➡️