15న చలో ఎస్‌పిడి ఆఫీస్
సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల దీక్షలో వక్తలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ఈ నెల 15వ తేదీన చలో ఎస్‌పిడి (సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్) ఆఫీస్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఎపి సమగ్ర శిక్షా కాంట్రాక్ట్ అండ్ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ వెల్లడించింది. గత ప్రభుత్వంలో జరిగిన సమ్మె ఒప్పందాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ధర్నాచౌక్‌లో మంగళవారం ఫెడరేషన్ ఆధ్వర్యాన నిరసన దీక్ష జరిగింది. ఉద్యోగ భద్రత, వేతనాలు, సౌకర్యాలను మెరుగుపరిచేలా హెచ్‌ఆర్ పాలసీ అమలు, ఎంటిఎస్, వేతన పెంపు, పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు, ఇపిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ సెలవులు, హెల్త్‌కార్డులు, ఔట్‌సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతిలోకి మార్చడం, సమగ్ర శిక్ష ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేసింది. క్లస్టర్ విధానంతో సిఆర్‌పిల భవితవ్యం ప్రశ్నార్ధకంగా మారిందని, దీనిపై ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయాలని డిమాండ్ చేసింది. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 15న చలో ఎస్‌పిడి నిర్వహిస్తామని హెచ్చరించింది. దీక్షా శిబిరాన్ని పిడిఎఫ్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు సందర్శించి మద్దతు తెలిపారు. న్యాయమైన సమస్యలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఉద్యోగుల కనీస వేతనానికి నష్టం చేసే జివో 2ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఎపి ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ వర్కర్స్ జెఎసి చైర్మన్ ఎవి నాగేశ్వరరావు దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరంలో సమగ్ర శిక్షా ఎంప్లాయీస్ ఫెడరేషన్ జెఎసి చైర్మన్ బి కాంతారావు, ప్రధాన కార్యదర్శి యు కల్యాణి, ఆర్గనైజేషన్ సెక్రటరీ జాన్‌మోడీ, వైస్ ఛైర్మన్ వాసా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
