- ‘ప్రార్థనా స్థలాల చట్టం లేకుంటే మత సామరస్యానికి విఘాతం
- సుప్రీంకోర్టుకు తెలిపిన జ్ఞానవాపి మసీదు కమిటీ
న్యూఢిల్లీ : 1991వ సంవత్సరం నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ హిందూత్వ వాదులు దాఖలు చేసిన పిటిషన్లను కొట్టివేయాల్సిందిగా జ్ఞానవాపి మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి, వాటి స్థానంలో ముస్లిం ప్రార్థనా మందిరాలను నిర్మించారని హిందూత్వ వాదులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే 1991వ సంవత్సరం నాటి చట్టం తమ వాదనలను నీరుకార్చేదిగా ఉండడంతో దానిని రద్దు చేయాలని వారు అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. ఈ నేపథ్యంలో అంజుమన్ ఇంతెజామియా మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు ఓ దరఖాస్తును సమర్పించింది. నాటి చట్టాన్ని రద్దు చేస్తే దేశంలో ఇలాంటి వివాదాలే అనేకం చెలరేగుతాయని, మత సామరస్యం దెబ్బతింటుందని అందులో ఆందోళన వ్యక్తం చేసింది. రామ మందిర వివాదం ఉధృతంగా సాగిన సమయంలో అప్పటి పీవీ నరసింహారావు ప్రభుత్వం ఈ చట్టాన్ని రూపొందించింది. అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలం మినహా దేశంలోని ఏ ప్రార్థనా స్థలాన్ని అయినా ఇతరులకు బదిలీ చేయడాన్ని ఈ చట్టం నిషేధిస్తోంది. ఇప్పటికే 14 ముస్లిం ప్రార్థనా స్థలాలపై కన్నేసిన హిందూత్వ వాదులు వాటిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వీరు కోరుతున్న విధంగా చట్టాన్ని రద్దు చేసినట్లయితే ఇలాంటి వ్యక్తులే మరి కొందరు బయలుదేరి ముస్లిం స్థలాలపై పిటిషన్లు దాఖలు చేసే అవకాశమున్నదని, ఇది తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని మసీదు కమిటీ సుప్రీంకోర్టుకు విన్నవించింది. బాబ్రీ మసీదు విధ్వంసం జరిగిన రోజును పురస్కరించుకొని సుప్రీంకోర్టుకు తాను సమర్పించిన దరఖాస్తును మసీదు కమిటీ ప్రజల ముందు ఉంచింది. బాబ్రీ మసీదు స్థలాన్ని సుప్రీంకోర్టు 2019లో హిందువులకు బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో పలు ముస్లిం ప్రార్థనా స్థలాలపై దృష్టి సారించిన హిందూత్వ వాదులు సుప్రీంకోర్టులో ఇదే రకమైన పిటిషన్లను దాఖలు చేయడం మొదలు పెట్టారు. జ్ఞానవాపి సహా పలు ముస్లిం ప్రార్థనా స్థలాలు తమవేనని వాదించారు. జ్ఞానవాపి వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుడి దేవాలయం పక్కనే ఉంది. ఓ స్థానిక కోర్టు ఆదేశాల మేరకు 2022లో జ్ఞానవాపిలో సర్వే నిర్వహించిన అధికారులు అక్కడ శివలింగం ఉన్నదని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయని తేల్చారు. దీంతో ఈ స్థలంపై వివాదం చెలరేగింది. ప్రస్తుతం ఈ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. మధురలోని షాహీ ఈద్గా మసీదు స్థలంలో సర్వే నిర్వహించాలని అలహాబాద్ హైకోర్టు గత సంవత్సరం డిసెంబరులో ఆదేశించింది. అది శ్రీకృష్ణుడి జన్మస్థలమని, దానిని తమకు అప్పగించాలని కొందరు హిందూత్వ వాదులు కోర్టును కోరారు. కాగా మధురలో సర్వేపై సుప్రీంకోర్టు జనవరిలో స్టే విధించింది. అయితే హైకోర్టులో విచారణ కొనసాగేందుకు అనుమతించింది.
1991వ సంవత్సరపు చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం ఏ ప్రార్థనా స్థలాన్నీ ఇతరులకు బదిలీ చేయకూడదు. 1947 ఆగస్ట్ 15వ తేదీన ప్రార్థనా స్థలం ఏ మతానికి చెంది ఉన్నదో దాని స్వభావాన్ని అలాగే పరిరక్షించాలని చట్టంలోని సెక్షన్ 4 చెబుతోంది. కాగా న్యాయవాది ఫుజాయిల్ అహ్మద్ అయ్యుబి ద్వారా సుప్రీంకోర్టుకు దరఖాస్తును అందజేసిన మసీదు కమిటీ గత నెల 24న ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో జరిగిన హింసాకాండను అందులో ప్రస్తావించింది. సంభాల్‌లోని దేవాలయాన్ని కూల్చివేసి జామా మసీదును నిర్మించారంటూ వచ్చిన పిటిషన్లను పురస్కరించుకొని స్థానిక కోర్టు సర్వేకు ఆదేశించిందని, సర్వే జరుగుతున్న సమయంలో పోలీసులతో స్థానికులు ఘర్షణ పడ్డారని, ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని వివరించింది. చట్టాన్ని కొట్టివేస్తే దేశంలోని ప్రతి చోటా ఇలాంటి వివాదాలే తలెత్తుతాయని, అంతిమంగా మత సామరస్యం దెబ్బతింటుందని తెలిపింది. వారణాసి, మధురతో పాటు అనేక ప్రాంతాలలో నెలకొన్న వివాదాలు సహా పలు అంశాలపై గతంలో పార్లమెంట్ చర్చించిందని, ఆ తర్వాతే చట్టాన్ని ఆమోదించిందని చెప్పింది. జ్ఞానవాపి, షాహీ ఈద్గా, సంభాల్ మసీదుతో పాటు ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ రాష్ట్రాలలోని అనేక ముస్లిం ప్రార్థనా మందిరాలపై, దర్గాలపై వివాదం నడుస్తోందని మసీదు కమిటీ తన దరఖాస్తులో వివరించింది.
మౌనంగా ఉన్న కేంద్రం
ప్రార్థనా స్థలాల (ప్రత్యేక నిబంధనలు) చట్టంను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం, ఇప్పటి వరకూ ఎలాంటి అఫిడవిట్‌ను దాఖలు చేయలేదు. సుప్రీంకోర్టు విచారణ తేదీని ప్రకటించిన సందర్భంగానైనా కేంద్రం కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయరంగ నిపుణులు కోరుతున్నారు.