ఏప్రిల్ 1వ తేదీ నుండి పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను 15 శాతం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులీయడం దారుణం. తాజాగా కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరతోపాటు అన్ని నిత్యావసరాల ధరల పెరుగుదలతో జనం సతమతమవుతున్నారు. దేశంలో దాదాపు 80 శాతం మందికి కొనుగోలు శక్తి లేదని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. ఇటువంటి నేపథ్యంలో ప్రజలపై మరింతగా భారాన్ని పెంచడం సరి కాదు. అంతేగాక ఇప్పుడున్న ఆస్తి పన్ను విధానామే అన్యాయమైనది. ఆస్తి విలువ ప్రాతిపదికగా పన్ను నిర్ధారించే విధానమే సరి కాదు. అదనంగా అప్పులు చేసుకోవడానికి అనుమతించాలంటే పట్టణ సంస్కరణలు, విద్యుత్ సంస్కరణలు చేపట్టి ప్రజలపై భారాలు వేయాలని కేంద్రంలోని బిజెపి సర్కారు జారీ చేసిన హుకుం ప్రకారం వైసిపి ప్రభుత్వం ఈ విధానాన్ని తెచ్చింది. ఆస్తి విలువ ఆధారిత పన్ను ప్రవేశ పెడుతూ గత ప్రభుత్వం 44/2020 చట్టం, జీవో నెంబర్ 198 తీసుకొచ్చింది. విద్యుత్ చార్జీల పెంపు, భూమి హక్కుల గందరగోళం వంటి చర్యలతోపాటు నిర్హేతుకమైన విధానంతో తమ నెత్తిన పెను భారాన్ని వేసిందని ఆ ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిన సంగతి అందరికీ తెలుసు. ఆ వాతావరణంలోనే టిడిపి-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ప్రజాగళం 6వ పేజీలో ‘చెత్త పన్ను రద్దు, ఇంటి పన్ను సమీక్ష’ అని హామీనిచ్చారు. టిడిపి కూటమి అధికారానికొచ్చిన ఆరు నెలలు దాటాక చెత్త పన్ను రద్దు చేశారు కానీ ఇంటి పన్ను ఊసెత్తలేదు. కానీ ఇటీవల గుట్టు చప్పుడు కాకుండా 15 శాతం పన్ను పెంచుతూ ఉత్తర్వులిచ్చారు. ఎన్నికల హామీ ప్రకారం ఇంటిపన్ను తగ్గిస్తారని జనం భావిస్తే ఏలినవారు మరింత వడ్డించడం దారుణం.
రాష్ట్రంలో 124 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఏడాదికి రూ.1200 కోట్లగా ఉన్న ఆస్తిపన్ను డిమాండ్ ఇప్పుడు రూ.2150 కోట్లకు చేరింది. ఈ సంవత్సరం రూ.320 కోట్ల అదనపు భారం పడినందున అది దాదాపు రూ.2500 కోట్లకు చేరువయింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సంఘం కేటాయింపుల ద్వారాను, ఇతర రూపాల్లో స్థానిక సంస్థలకు నిధులిచ్చి అభివృద్ధి చేపట్టాల్సింది పోయి ప్రజలపై పన్నులు పెంచి పీల్చి పిప్పిచేయడం అన్యాయం. పన్నుల పెంపు భారం ప్రభావం ప్రత్యక్షంగా ఇంటి యజమానులపై పడడమేగాక, పరోక్షంగా అద్దెదారులపై కూడా పడుతుంది. సొంతిల్లు ఉన్నవారికి పన్ను పోటు ఒకటైతే అద్దెకున్న వారికి దాంతోపాటు సొంతిల్లు లేదే అన్న బాధ కూడా అదనం. గృహస్తుల సంగతి అలా వుండగా చిన్న, మధ్యతరగతి వ్యాపారులు, పరిశ్రమలదారులపైనా భారం పడుతుంది. అది కూడా మళ్లీ పరోక్షంగా పడేది ప్రజలపైనే! అంతేగాక పులి మీద పుట్రలా పన్ను చెల్లింపు ఒక నెల ఆలస్యమైనా 24 శాతం వడ్డీ వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులీయడం అమానుషం. కనీసం మే ఆఖరు వరకయినా జరిమానా లేకుండా ఆస్తిపన్ను బకాయిలు చెల్లించే అవకాశం కల్పించాలని జనం కోరుతున్నది సబబైనది.
వైసిపి పాలనలో జరిగిన విధ్వంసాన్ని సరి చేస్తామని అధికారానికి వచ్చిన టిడిపి కూటమి అవే విధానాలను అనుసరించడం శోచనీయం. ఆ పార్టీని, దాని నాయకుడ్ని విమర్శించి విధానాలు మాత్రం వారివే అనుసరిస్తే ప్రజలు అర్ధం చేసుకోలేనంత అమాయకులు కారు. తమ మేనిఫెస్టోలో పేర్కొనడమేగాక ఎన్నికల సభల్లో నాయకులిచ్చిన హామీ మేరకు ఆస్తి పన్నును టిడిపి కూటమి ప్రభుత్వం తగ్గించాలని ప్రజలు కోరడం న్యాయమైనది. అలా చేయకుండా మరో 15 శాతం పన్ను పెంచడం పుండు మీద కారం చల్లడం వంటిది. ఈ నేపథ్యంలో పెంచిన ఆస్తి పన్నుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా గృహ యజమానులు, పౌర సంఘాలు, ప్రజా సంఘాలు ఆందోళనలకు సిద్ధం కావడాన్ని ఎవరూ తప్పుబట్టలేరు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆస్తి (ఇంటి) పన్ను తగ్గించాలి, ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని రద్దు చేయాలి. ఇప్పటికే ఒకవైపు ఆదాయాలు తరిగి మరోవైపున ధరల పెరుగుదలతో బాధలు పడుతున్న ప్రజలకు కనీస ఉపశమనం కలిగించాలి.
