అమిత్‌షాపై ఆరోపణలు అసంబద్ధం, నిరాధారం

  • కెనడా మంత్రి వ్యాఖ్యలను ఖండించిన భారత్‌
  • హై కమిషన్‌ అధికారికి సమన్లు

న్యూఢిల్లీ : తమ దేశంలో ఖలిస్తాన్‌ వేర్పాటువాదుల హత్య వెనుక కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ప్రమేయం ఉన్నదంటూ కెనడా చేసిన ఆరోపణలపై భారత్‌ నిరసన వ్యక్తం చేసింది. కెనడా హై కమిషన్‌కు చెందిన అధికారిని పిలిపించి తన నిరసన తెలియజేసింది. దౌత్యపరమైన నోట్‌ను అందించింది. ఈ వివరాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్‌ జైస్వాల్‌ శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కెనడా జాతీయ భద్రత స్టాండింగ్‌ కమిటీ సభ్యులను ఉద్దేశించి కెనడా డిప్యూటీ విదేశాంగ మంత్రి డేవిడ్‌ మారిసన్‌ చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్ర పదజాలంతో నిరసిస్తున్నట్లు నోట్‌లో తెలియజేసినట్లు జైస్వాల్‌ తెలిపారు. కేంద్ర హోం మంత్రిని ఉద్దేశించి చేసిన అసంబద్ధమైన, నిరాధారమైన ఆరోపణలపై ఆ నోట్‌లో తీవ్ర నిరసన వ్యక్తం చేశామని చెప్పారు. అలాగే, ఈ నోట్‌లో అమిత్‌షాపై ఆరోపణలు అసంబద్ధంగా ఉన్నాయని, వాటికి ఆధారాలేమీ లేవని భారత్‌ స్పష్టం చేసినట్లు చెప్పారు. అలాగే, కెనడాలోని భారత అధికారులపై కెనడా ప్రభుత్వం ఆడియో, వీడియో నిఘా వేయడాన్ని భారత్‌ తప్పుపట్టినట్లు తెలిపారు. ఇది దౌత్యపరమైన ఒప్పందాలను ‘ఖచ్చితంగా ఉల్లంగించడం’గా జైస్వాల్‌ అభివర్ణించారు.
నిజానికి, భారత్‌ను అప్రదిష్టపాలు చేసేందుకు, ఇతర దేశాలలో పలుచన చేసేందుకు ఉద్దేశించిన వ్యూహంలో భాగంగానే కెనడా ఇలాంటి నిరాధారమైన ఆరోపణలను అంతర్జాతీయ మీడియాకు లీక్‌ చేస్తోందని జైస్వాల్‌ మండిపడ్డారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన చర్యలు ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని చెప్పారు.

➡️