సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రజాశక్తి – టెక్కలి
గ్రామాల వారీగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా తక్షణమే పరిష్కరించాలనే దిశగా అధికారులు పనిచేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. టెక్కలి, పలాస రెవెన్యూ డివిజన్లకు చెందిన అధికారులతో గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే, పిజిఆర్‌ఎస్, పౌర సేవల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. మ్యుటేషన్, ఆస్తుల తగాదాల పరిష్కారానికి రూపొందించిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను పూర్తిగా వినియోగించాలన్నారు. రీ సర్వేలో ఎదురవుతున్న అభ్యంతరాలను వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పిజిఆర్‌ఎస్ దరఖాస్తులను ఎస్‌ఎల్‌ఎ గడువు దాటిపోకుండా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటివరకు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులు ఎన్ని వాటిని ఏమేరకు పరిష్కరించారో నివేదికలు సిద్ధం చేయాలన్నారు. ప్రభుత్వ భూములు ఆన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో ఉన్న భూ వివరాలపై సర్వే నిర్వహించి ఆక్రమణలు ఉంటే తొలగించాలని కోరారు. రెవెన్యూ పరిధిలోని మ్యుటేషన్లు, నీటితీరువా శిస్తు వసూళ్లు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై మండలాల వారీగా సమీక్షించి సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశం చేశారు. జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్‌ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, ఆర్‌డిఒ ఎం.కృష్ణమూర్తి, ఆర్‌డిఒ ఎం.కృష్ణమూర్తి, తహశీల్దార్లు ఆర్.అప్పలరాజు, సోమేశ్వరరావు, రవికుమార్, ఆర్‌ఐలు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.గిరిజన గ్రామం సందర్శనమండలంలోని ముఖలింగాపురాన్ని కలెక్టర్ సందర్శించారు. సరైన రోడ్డు లేకపోవడంతో 250 మీటర్లు కాలినడకన నడిచి గ్రామానికి వెళ్లారు. గ్రామంలోని భౌగోళిక పరిస్థితులను పరిశీలించారు. గ్రామస్తులతో మాట్లాడి గిరిజనుల జీవన స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తాగు, సాగునీటి సౌకర్యం కల్పించాలని గిరిజనులు కలెక్టర్‌కు విన్నవించారు. ఈ ప్రాంత రైతులకు అవసరమైన సాగునీరు కల్పన కల్పించే క్రమంలో గ్రామానికి సరిహద్దులో ఉన్న దుర్గమ్మ చెరువు నుంచి రిజర్వాయరు నిర్మాణం చేపట్టాలని గిరిజనులు కోరారు. రహదారి సౌకర్యాలు కల్పించాలన్నారు. కొండల ప్రాంతంలో కొద్దిసేపు పర్యటిస్తూ… ఆ ప్రాంత స్థితిగతులపై ఆరా తీశారు. మండలంలోని శివారు గిరిజన గ్రామం కావడంతో కలెక్టర్ పర్యటన చర్చనీయాసమైంది. ఈయనతో పాటు ఆర్‌డిఒ ఎం.కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు.