నేడు పుస్తక మహోత్సవం ముగింపు

Jan 12,2025 09:00 #Vijayawada Book Festival

 ఆకట్టుకున్న స్టాళ్లు 

 తగ్గని ఆదరణ

ప్రజాశక్తి -విజయవాడ : నగరంలోని మున్సిపల్‌ స్టేడియంలో జరుగుతున్న 35వ విజయవాడ పుస్తకమహోత్సవం ఆదివారంతో ముగియనుంది. గత తొమ్మిది రోజులుగా మంచి ప్రజాదరణతో మహోత్సవం సాగింది. పలువురు యువ రచయితల రాసిన పుస్తకాలతోపాటు వర్తమాన అంశాలపై రాసిన పుస్తకాలు, పిల్లల పుస్తకాలు బాగా అమ్ముడయ్యాయని ప్రచురణకర్తలు చెబుతున్నారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ఆధ్వర్యాన ప్రతి ఏటా నగరంలో ఈ పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నారు. చాలాకాలం విజయవాడ స్వరాజ్య మైదానం, ఆ తర్వాత ప్రభుత్వ పాలిటెక్నికల్‌ కళాశాలలో నిర్వహించారు. ఈ ఏడాది ఇందిరాగాంధీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వ అనుమతించటంతో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఎక్కువమంది పాఠకులు, వీక్షకులు, సాహితీ అభిమానులు, అన్ని తరగతుల వారూ పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు.
ఈనెల రెండో తేదీన ప్రారంభమైన ఈ పుస్తక మహోత్సవం ఆదివారంతో ముగియనుంది. రాష్ట్రానికి చెందిన ప్రచురణ కర్తలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ ప్రచురణ సంస్థలు, ప్రఖ్యాత విశ్వ విద్యాలయాలు, విదేశీ ప్రచురణ సంస్థలు సైతం ఈ పుస్తక మహోత్సవంలో తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. సాహిత్య అకాడమీ, నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ తదితర ప్రభుత్వ విభాగాలకు చెందిన స్టాళ్లు పాఠకులను ఆకట్టుకుంటున్నాయి. 1989లో నగరానికి చెందిన ప్రచురణకర్తలు నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సహకారంతో తొలిసారిగా 89 స్టాళ్లతో తొలిసారిగా పుస్తక మహోత్సవం నిర్వహించారు. ఆ తరువాత అది 370 స్టాళ్ల వరకూ వెళ్లింది. 35వ పుస్తక మహోత్సవంలో మొత్తం 270 స్టాళ్లు ఏర్పాటు చేశారు. చిన్న పిల్లల పుస్తకాల నుంచి పెద్దల వరకూ అందరికీ ఉపయోగపడే అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పుస్తక మహోత్సవంపై ప్రజాశక్తి శనివారం పలువురిని పలకరించింది. రతన్‌టాటా ప్రతిభా వేదికపై విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంచే అనేక పోటీలు, అవగాహనా కార్యక్రమాలు నిర్వహించినట్లు జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు గువ్వ మహేష్‌ తెలిపారు. ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులతో సైన్స్‌ ప్రయోగాలు ఎలా చేయాలో పిల్లలకు అవగాహన కల్పించామని, మ్యాజిక్‌లోని లాజిక్‌ లాంటి కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వాన్ని, శాస్త్రీయ ఆలోచనలు పెంచేలా గాజు పెంకులపై నడిపించటం, మేకుల కుర్చీ, మేజిక్‌ కాయిన్‌ బాక్స్‌ లాంటి వినూత్న ప్రయోగాలతో పాటు టెలిస్కోప్‌తో ఖగోళంలో జరిగే అద్భుతాలను వీక్షించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సాహిత్య అకాడమీ బెంగళూరు రీజనల్‌ కార్యాలయం ప్రతినిధి శాశ్వత్‌ వాజ్‌పేయి మాట్లాడుతూ హైదరాబాద్‌తోపాటు విజయవాడలో కూడా పుస్తకాలకు మంచి ఆదరణ ఉందన్నారు. అజు పబ్లికేషన్స్‌కు చెందిన మల్లికార్జున్‌ మాట్లాడుతూ ‘అమ్మడైరీలో కొన్ని పేజీలు’ నవల ఇప్పటివరకూ లక్షకు పైగా కాపీలు అమ్ముడుపోయాయన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత వేంపల్లె షరీఫ్‌ మాట్లాడుతూ పుస్తక మహోత్సవంలో వివిధ సబ్జెక్టు అంశాలతోపాటుగా సాహిత్య పుస్తకాలను మంచి ఆదరణ లభిస్తోంది. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ అధ్యక్షులు కె.లక్ష్మయ్య మాట్లాడుతూ పుస్తక మహోత్సవానికి ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోందన్నారు. విజయవాడ బుక్‌ ఫెస్టివల్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి మనోహర్‌ నాయుడు మాట్లాడుతూ సెల్‌ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు వాడుతున్నా పుస్తకాల కొనుగోళ్లు తగ్గలేదన్నారు.

➡️