చెత్త బుట్టలు వినియోగించండి 

Jan 22,2025 12:55 #Tirupati district

నగర శుభ్రతకు సహకరించండి 
కమిషనర్ ఎన్.మౌర్య
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని దుకాణ, వాణిజ్య సముదాయాల్లోను, గృహాల లోని వారందరూ తప్పకుండా చెత్త బుట్టలను వినియోగించాలని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. నగరంలోని రాయల్ నగర్, మారుతి నగర్, రైతు బజారు, ఎమ్మార్ పల్లి కూడలి, వెస్ట్ చర్చి తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం కమిషనర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాల వద్ద చెత్త రోడ్లపైనే వేస్తుండడం చూసి మందలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తాము తనిఖీ చేసిన పలు ప్రాంతాల్లోని దుకాణదారులు చెత్త బుట్టలు వినియోగించకుండా, చెత్తను కవర్లలో వేసి కాలువల్లో పడేస్తున్నారని అన్నారు. ఇలా చేయడం వలన కాలువల్లో చెత్త పేరుకుపోయి మురుగు నీరు రోడ్లపైకి వచ్చి అపరిశుభ్రంగా తయారవుతుందని అన్నారు. ప్రజలు, దుకాణదారులు చెత్త బుట్టలు వినియోగించి మీ వద్దకు వచ్చే మా సిబ్బందికి చెత్త అందించి నగరం శుభ్రంగా ఉండేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు. నగరంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పరిశుభ్రతకు సహకరించాలని అన్నారు. కాలువల్లో చెత్త తొలగించి అక్కడే వేస్తున్నారని పిర్యాదులు వస్తున్నాయని, ఆ చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. రైతు బజారు వద్ద పరిశుభ్రంగా ఉంచాలని, రోడ్డుపైన వ్యాపారాలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. రాయల్ నగర్ లోని తుడా పార్కును పరిశీలించి శుభ్రంగా ఉంచాలని, ఆట పరికరాలు మరమ్మత్తులు చేయించాలని తుడ అధికారులను ఆదేశించారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, తుడ ఈఈ రవీంద్ర, డి.ఈ.లు, ఏసిపి బాలాజి, సర్వేయర్ కోటేశ్వర రావు, శ్రీనాథ్ రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.

➡️