కష్టపడినవారికి కేటాయించాలని కోరుతున్న కార్యకర్తలు
ఏదో పదవి వస్తే చాలన్నట్లు సీనియర్ నాయకులు
అందరికీ న్యాయం చేయడం కత్తిమీద సామే
ప్రజాశక్తి – చింతలపూడి
మండలంలో నామినేటెడ్ పదవుల భర్తీ ఎప్పుడని కూటమి నాయకులు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. పార్టీ కోసం కష్టపడినవారికి కేటాయించాలని కార్యకర్తలు కోరుతున్నారు. గ్రూపులు, కుల, మత బేధాలు లేకుండా నామినేటెడ్ పదవులు ఇవ్వాలంటున్నారు. నామినేటెడ్, మండలం, పట్టణ పదవులతో పాటు సొసైటీ ఛైర్మన్, ఎఎంసి ఛైర్మన్, బోర్డు సభ్యుల పదవులు త్వరగా పూర్తి చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు. మూడు పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో నేతలు నామినేటెడ్ పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఒక ఫార్ములా ప్రకారం పదవులను ఖరారు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది.అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో పదవుల భర్తీ ఆలస్యం అవుతుండటంతో పార్టీలోని నేతలు పూర్తి నిరాశ, నిసృహలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందే నామినేటెడ్ పోస్టుల భర్తీని పూర్తి చేయాలని నేతలు కోరుతున్నారు. తాజా పరిస్థితుల నేపథ్యంలో నాయకత్వం ఏం చేయబోతుందనేది ఆసక్తికరంగా మారింది. పార్టీ పెద్దలు తీసుకున్న నిర్ణయం వల్ల కష్టపడిన వారికి, కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఆ నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతారా లేదా అసంతృప్తి వ్యక్తం చేస్తారా అని చూడాలి. పార్టీ పరంగా భర్తీ ప్రక్రియ ఆలస్యమవుతున్నప్పటికీ పదవులు ఆశిస్తున్న నేతలు మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ఎవరికి వారుగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మండలం పదవులు, ఇతర నామినేడ్ పదవులకు పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఆశల పల్లకిలో ఉన్న నేతల్లో ఎంత మందిని అదృష్టం వరిస్తుందో చూడాలి.గత 30 నుంచి 40 సంవత్సరాలుగా టిడిపి కోసం పనిచేసిన సీనియర్ నాయకులు, కార్యకర్తలు చాలామంది ఏదో పదవి వస్తే చాలు అనే ఆశతో ఉన్నారు. కాని ఇప్పుడున్న పరిస్థితుల్లో టిడిపి సీనియర్ కార్యకర్తలకు, నాయకులందరికీ న్యాయం చేయడం కత్తి మీద సాములగా పరిస్థితి తయారైంది. ప్రస్తుతం ఉన్న మండల, పట్టణ, నామినేటెడ్ పదవులు కూడా జనసేన, బిజెపిలకు కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. జనసేన పార్టీకి వారు ఆశించిన పదవులు రాకపోతే వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. నాయకులు సూచనలతో పాటు, కార్యకర్తల సూచనలు కూడా తీసుకొని, పదవులు భర్తీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారు.
