పలాస ఎమ్మెల్యే శిరీషకు మెమోంటోను అందజేస్తున్న మంత్రి, కలెక్టర్
ఇన్‌ఛార్జి మంత్రి శ్రీనివాస్
ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్
రాష్ట్రంలో ప్రతి ఇంటి నుంచి ఒక మహిళా పారిశ్రామికవేత్త తయారు కావాలని, అదే వెలుగు 2.0 లక్ష్యమని జిల్లా ఇన్‌ఛార్జి, పరిశ్రమలు, సెర్ప్ శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన శనివారం నగరంలోని 80 అడుగుల రోడ్డులో ఉన్న ఓ ప్రయివేటు ఫంక్షన్ హాల్లో ఐసిడిఎస్ ఆధ్వర్యాన కార్యమ్రాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల భాగస్వామ్యం లేకుండా ప్రగతి సాధ్యం కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లప్పుడూ విశ్వసిస్తారని గుర్తుచేశారు. పురుషులతో సమానంగా మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మహిళలకు వంటింటికి పరిమితం కాకుండా పొదుపు అలవాటు చేసి డ్వాక్రా సంఘాలను స్థాపించిన ఘనత చంద్రబాబుదేనని గుర్తు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పనిచేసే చోట మహిళా ఉద్యోగులు వేధింపులకు గురైతే హెల్ప్‌లైన్ 181 నంబరుకు ఫోన్ చేయాలని సూచించారు. సఖీ కేంద్రం, వన్‌స్టాఫ్ సెంటర్ ఆధ్వర్యాన సమాజంలో మహిళలు, బాలికలు మానసిక, శారీరక హింసలకు గురవుతున్న వారికి అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష మాట్లాడారు. వితంతువులకు, పేద మహిళలకు, వృద్ధులకు, ఒంటరి మహిళలకు పింఛన్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ప్రతి ఇంటికీ గ్యాస్ సౌకర్యం కల్పించామన్నారు. ఇప్పుడు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచిత గ్యాస్ అందిస్తున్నామని తెలిపారు. ఉగాది నుంచి ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఎస్‌పి కె.వి.మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. ప్రతి పోలీస్‌స్టేషన్లలో మహిళల ఫిర్యాదులు స్వీకరించడానికి మహిళా సెల్‌ను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు. చట్టంపై అవగహన పెంచుకుని అవసరమైన వారు తక్షణ సాయం పొందాలన్నారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకు మంత్రి పురస్కారాలను అందజేశారు. అనంతరం పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషకు దుశ్శాలువ కప్పి సన్మానించి మెమోంటోను అందజేశారు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న 1674 స్వయం సహాయక సంఘాలకు రూ111.51 కోట్ల స్త్రీ నిధి రుణాలను లబ్ధిదారులకు అందజేశారు. వీటితో పాటు మెప్మా పరిదిలో 129 సంఘాలకు రూ.9.72 కోట్లు బ్యాంకు లింకేజీ రుణాలు పంపిణీ చేశారు. అలాగే వికలాంగులైన బాలికలకు లాప్‌టాప్‌లను అందజేశారు. జిల్లాలో బేసిక్ టైలరింగ్ శిక్షణకు రూ.8.5 కోట్లు చెక్కును వివిధ సంక్షేమ పథకాల చెక్కులను అందజేశారు. అనంతరం ఫంక్షన్ హాల్ ఆవరణలో ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రి పరిశీలించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు కూన రవికుమార్, బగ్గు రమణమూర్తి, గౌతు శిరీష, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి, శ్రీకాకుళం ఆర్‌డిఒ సాయి ప్రత్యూష, సిపిఒ ప్రసన్నలక్ష్మి, ఐసిడిఎస్ పీడీ శాంతిశ్రీ, వ్యవసాయశాఖ అధికారి కోరాడ త్రినాథస్వామి, డిఆర్‌డిఎ పీడీ కిరణ్ కుమార్, డిఎంహెచ్‌ఒ బాలమురళీకృష్ణ, బిసి కార్పొరేషన్ ఇడి గడ్డెమ్మ, వికలాంగుల శాఖ ఎడి కె.కవిత, బిసి సంక్షేమ శాఖ అధికారి ఇ.అనురాధ పాల్గొన్నారు.