ప్రజాశక్తి – విజయవాడ :అంబేద్కర్ స్మృతివనం వద్ద మెటల్‌తో ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహనరెడ్డి పేరును గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి ధ్వంసం చేశారు. విజయవాడ స్వరాజ్య మైదానంలో 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసిన స్మృతివనంలోకి ప్రవేశించిన దుండగులు లైట్లు ఆపేసి సిబ్బంది వద్ద ఫోన్లు లాక్కొని వాటిని పగుల కొట్టి, వారిని బయటకు పంపేశారు. అనంతరం ఈ స్మృతి భవనంలో శిలా ఫలకంపై ఉన్న జగన్ పేరును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైసిపి నేతలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. వైసిపి శాసన మండలి పక్ష నేత లేళ్ల అప్పిరెడ్డి, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, మాజీ మంత్రి మేరుగ నాగార్జున, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్మృతివనంలో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఘటనపై పోలీసులు స్పందించి నిందితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా అంబేద్కర్ స్మృతివనం, విగ్రహం వద్ద పట్టిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయాలని కోరారు. సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆదేశాల మేరకే రాష్ట్రంలో అరాచకపాలన సాగుతోందని విమర్శించారు. అంబేద్కర్ స్మృతిభవనంపై దాడిని ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాడి జరుగుతున్న సమయంలో పోలీసులు దగ్గర్లోనే ఉన్నా.. ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. తొలుత స్మృతివనం వద్దకు వైసిపి నేతలు వస్తున్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ప్రధాన గేటు వద్దే వారిని ఆపే ప్రయత్నం చేశారు. దీంతో కొద్దిసేపు అక్కడ పోలీసులకు, వైసిపి నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. ముఖ్యనేతలను లోపలకు వెళ్లేందుకు పోలీసులు అంగీకరించడంతో వివాదం సద్దుమణిగింది. నిరసన అనంతరం జిల్లా కలెక్టర్‌ను, ఎన్‌టిఆర్ జిల్లా పోలీసు కమిషనర్‌కు వైసిపి నేతలు వినతిపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసిపి తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్, పశ్చిమ నాయకులు పోతిన మహేష్ తదితరులు పాల్గోన్నారు.
వైసిపి నీచరాజకీయం : మంత్రి డోలా
రాజకీయ లబ్ధి కోసం వైసిపి నీచ రాజకీయం చేస్తోందని సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి విమర్శించారు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహానికి ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేరును ఆగంతకులు తొలగిస్తే వైసిపి నేతలు నానా యాగీ చేస్తున్నారని ఒక ప్రకటనలో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ప్రభుత్వానికి ఆపాదించటం సరికాదని, ఈ ఘటనతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధమూ లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎవరి పేరు తొలగించలేదని, అలాంటి పనులు చేయాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు. వైసిపి ప్రభుత్వంలో దళిత మంత్రులుగా పనిచేసిన మేరుగ నాగార్జున, ఆదిమూలపు సురేష్ దళితులకు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు.
అంబేద్కర్ స్మృతివనంలో జగన్ పేరు ధ్వంసం – వైసిపి శ్రేణుల నిరసన
