ప్రజాశక్తి -పాడేరు: ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బుధవారం నిర్వహించిన యువత పోరు కార్యక్రమంలో భాగంగా అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ఐటిడిఏ మీదుగా జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. పాడేరు అరకు నియోజవర్గాల్లోని వివిధ మండలాల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్ పర్సన్ జల్లిపల్లి సుభద్ర, పాడేరు అరకు ఎమ్మెల్యేలు మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగం మత్స్య లింగం, మాజీ ఎమ్మెల్యేలు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, శెట్టి ఫాల్గుణ మాట్లాడుతూ, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ప్రభుత్వ విధానాలతో యువత భవిష్యత్తు అంధకారంలో ఉందన్నారు. రాష్ట్రంలో 11 లక్షల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ అంధక దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారని, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నాయన్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అల్లూరి జిల్లా నాయకులు బత్థిరి రవిప్రసాద్, చండా సుబ్రహ్మణ్యం, సామ్యూల్ వివిధ మండలాల ఎంపీపీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
