
- డిమాండ్లపై సానుకూల పరిశీలన
- కేసులు ఎత్తివేత, ఉద్యోగులపై చర్యలు రద్దు
- ప్రభుత్వ హామీతో సమ్మె విరమణ
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో విద్యుత్ శాఖ ఉద్యోగుల సమ్మెకు యోగి అదిత్యనాథ్ ప్రభుత్వం తలగ్గింది. ఉద్యోగుల డిమాండ్లను అమలు చేస్తామని హామీ ఇచ్చింది. ఆదివారం విద్యుత్ ఉద్యోగుల యూనియన్ ప్రతినిధులు, విద్యుత్ శాఖ మంత్రి ఎకె శర్మ మధ్య జరిగిన మూడో దశ చర్చల్లో ప్రభుత్వం ఈ హామీ ఇచ్చింది. దీంతో 72 గంటలకు పైగా కొనసాగిన సమ్మెను విరమిస్తునట్లు ఉద్యోగులు ప్రకటించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తామని, తొలగించిన సుమారు 3 వేల మంది ఉద్యోగులను మళ్లీ ఉద్యోగాల్లో చేర్చుకుంటామని, 22 మంది కార్మికులపై మోపిన అత్యంవసర సర్వీసుల నిర్వహణ చట్టం (ఎస్మా) కేసులను ఉపసంహరించుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు సమ్మెను విరమించాలనే నిర్ణయం తీసుకున్నట్లు విద్యుత్ కర్మాచారి సంయుక్త సంఘర్ష్ సమితి (వికెఎస్‌ఎస్‌ఎస్) కన్వీనర్ శేలేంద్ర దూబే ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తమ హామీలను నేరవేర్చడానికి కొంత సమయం ఇవ్వాలని కూడా ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా దెబ్బతిన్న చోట్ల పునరుద్ధరించేందుకు వీలుగా తక్షణమే విధుల్లోకి చేరాలని కూడా ఉద్యోగులు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
ఉత్తరప్రదేశ్ రాజ్య విద్యుత్ కర్మాచారీ సంయుక్త సంఘర్ష్ సమతి ఆధ్వర్యంలో రాష్ట్రంలోని సుమారు లక్ష మంది విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్లు గురువారం నుంచి సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. పాత పెన్షన్ స్కీం (ఒపిఎస్)ను పునరుద్దరించాలని, విద్యుత్ (సవరణ) బిల్లు 2022ను వెనక్కి తీసుకోవాలని, ఒప్పందాకాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని.. వంటి డిమాండ్లతో సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రంలో విద్యుత్ సరఫరా నిర్వహణ, మరమ్మత్తులు, ప్రజాసమస్యల ఫిర్యాదుల పరిష్కారంపై తీవ్రం ప్రభావం పడింది. సమ్మెను అణిచివేయడానికి యోగి ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నించింది. సమ్మె సమయంలో ప్రభుత్వ ఆస్థులకు నష్టం వాటిల్లితే జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఎ)ను ప్రయోగిస్తామని బెదిరించింది. అలాగే రాష్ట్రంలో ఎస్మా అమల్లోకి వచ్చిందని కూడా ప్రకటించింది. 22 మందిపై ఎస్మా కేసులను కూడా నమోదు చేసింది. అయినా ప్రభుత్వ బెదిరింపులకు ఉద్యోగులు భయపడలేదు. సమ్మెను కొనసాగించారు. ఈ సమ్మెకు విద్యుత్ ఉద్యోగులు, ఇంజనీర్ల జాతీయ సమన్వయ కమిటీ (ఎన్‌సిసిఒఇఇఇ) కూడా మద్దతు పలికింది. సమ్మె తీవ్రరూపం దాలుస్తుండటంతో యోగి ప్రభుత్వం దిగివచ్చింది.