
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీ జిల్లా కలెక్టర్ తనను మానసికంగా హింసిస్తున్నాడని పేర్కొంటూ బ్లాక్ డెవలప్‌మెంట్ అధికారి అమిత్ త్రిపాఠి..తన విధులను రాజీనామా చేశారు. కలెక్టర్‌తో పాటు మరో అధికారి తనను వేధిస్తున్నారని పేర్కొన్నారు. త్రిపాఠి రాజీనామాను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం.. ఈ విషయంపై విచారణకు ఆదేశించింది. నివేదిక సమర్పించాలని గ్రామీణాభివృద్ధి కమిషనర్‌కు కోరింది. కాగా, ఈ ఆరోపణలను బారాబంకి జిల్లా మేజిస్ట్రేట్ డాక్టర్ ఆదర్శ్ సింగ్, చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ (సిడిఒ) ఏక్తా సింగ్ కొట్టిపారేశారు.
తన రాజీనామా లేఖలో జులై 1న రామ్‌నగర్ నుండి పురేదలై డెవలప్‌మెంట్ బ్లాక్‌కు బదిలీ అయ్యాయని, డ్యూటీలో చేరానని తెలిపారు. అయితే బారాబంకీ ఎంపి ఉపేంద్ర రావత్... రామ్‌నగర్‌కు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకోవడంతో తన బదిలీ రద్దు అయ్యిందని పేర్కొన్నారు. తన బదిలీ రద్దు చేయాలని తనను ఎవరూ కోరలేదని, అయితే ఆ రద్దు తాను కోరానని భావించి సీనియర్లు తనపై విరుచుకుపడ్డారని తెలిపారు. ఈ విషయంపై మేజిస్ట్రేట్ తనను ఇంటికి పిలిచి.. చీవాట్లు పెట్టారని పేర్కొన్నారు. మరో ఇద్దరు అధికారులు వచ్చి... తనను దూషించారని చెప్పారు. ఈ రాజీనామా లేఖను అదనపు చీఫ్ సెక్రటరీ మనోజ్‌కుమార్ సింగ్‌కు పంపారు. ఈ విషయంపై విచారణకు ఆదేశించారు.