May 03,2022 06:46

.ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చే వేతనం రూ. 245 అయినా దక్కేది రూ. 150కు మించడం లేదు. దీంతో ఉదయం ఉపాధి పనులకు వెళ్ళి మధ్యాహ్నం నుండి స్వంత పనులో, వ్యవసాయపు పనులో, మరే ఇతర కూలీ పనులకో వెళ్తున్నారు. రెండు పూటల పని వల్ల అవేవీ సాధ్యం కావు. అదనపు ఆదాయానికి గండి పడ్తుంది. దీంతో కూలీలే స్వచ్ఛందంగా ఉపాధి పనులకు వెళ్ళలేమంటున్నారు. పోనీ రెండు పూటలా పనులు చేస్తే కచ్చితంగా ప్రభుత్వం చెప్పినట్లు దక్కేది 257 రూపాయలే. ఈ పనులు మానుకుని వ్యవసాయ పనులకు వెళ్ళినా గతంలో మాదిరిగా కూలీ రేట్లు ఇచ్చే అవకాశముండదు

గ్రామీణ పేదలకు ఆసరాగా నిలుస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉసురు తీసేందుకు మోడీ ప్రభుత్వం పూనుకుంది. గ్రామీణ పాలక వర్గాలైన భూస్వాములు, సంపన్న వర్గాలకు ఈ పథకం మొదటి నుండి కంటగింపుగానే ఉంది. ఈ పథకం నిర్వీర్యం కావాలనో, రద్దు కావాలనో, వ్యవసాయానికి అనుసంధానం కావాలనో వారు కోరుకుంటున్నారు.
            ఉపాధి హామీలో రెండు పూటల పని పద్ధతిని ప్రవేశ పెడుతూ, ఇతర సౌకర్యాలన్నిటినీ కత్తిరిస్తూ మోడీ ప్రభుత్వం సర్క్యులర్‌ 17000 (32)ను జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని సాఫ్ట్‌వేర్‌ను రద్దు చేసి జాతీయ స్థాయి సాఫ్ట్‌వేర్‌కు అనుసంధానించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉపాధి కూలీలకు ఇస్తున్న మంచినీళ్ళు, పనిముట్లు, వేసవి అదనపు వేతనం, టెంట్లు, కిట్లు, మేట్లకు ఇచ్చే పారితోషికం వంటి రాయితీలన్నీ ఆగిపోయాయి. దీనికి తోడు పని ప్రదేశాల్లో రెండు పూటల ఫోటోలు తీసి పంపాలి. అప్పుడు మాత్రమే ఒక రోజు మస్టర్‌ పడ్తుంది. ఈ మేరకు సర్క్యులర్‌ నెం.333 జారీ చేసింది. ఇప్పుడిచ్చే వేతనం రూ. 245కు మరో రూ.12 మాత్రమే పెంచి మరో పూట పని పెంచింది. తాము పెంచిన వేతనాలకు తగ్గ పనుల ప్రణాళిక లేదనే సాకుతో పనులాపించారు. దీంతో మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో ముమ్మరంగా సాగాల్సిన ఉపాధి పనులు నేటికీ పలు గ్రామాల్లో ప్రారంభం కాలేదు. ఇక మిగిలింది. మే నెల మాత్రమే.
          45 డిగ్రీల సెల్సియస్‌ ఎండలో రెండు పూటలు పని చేయడం ఎంత దుర్లభమో ఈ సర్క్యులర్‌ జారీ చేసిన ప్రభుత్వానికి తెలీదనుకోలేం. ఉదయం 8 గంటలకే 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోతున్నాయి. ఇచ్చిన కొలతలు పూర్తి చేసేలా పని చేయాలనడం కాకుండా రెండు పూటల నిబంధన కూలీల ఆరోగ్యం, ఇతర అంశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. పని ప్రదేశం దగ్గరకు రెండుసార్లు రాకపోకలు చేయాలి. రోజుకు నాలుగు సార్లు నడిచిగానీ, వాహనాలపై గానీ వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్ల దూరమైనా ఇదే పరిస్థితి. ఆటోలపై వెళ్తే మాకు రోజుకి రూ. 60 అవుతుందని వాపోతున్నారు. వచ్చే కూలీ ఆటో కిరాయిలకు పోతే బతికేదెట్లా అని ప్రశ్నిస్తున్నారు. పని ప్రదేశాల్లో వడదెబ్బ తగిలినా, గాయాలైనా ప్రస్తుతం ఓపి చీటి ఆధారంగా వారం రోజుల్లోపు మస్టర్‌ వేస్తున్నారు. మరణిస్తే రూ.50 వేలు పరిహారమిస్తున్నారు. పని ప్రదేశం నుంచి బయటకొచ్చాక జరిగితే ఇవి అమలు కావడంలేదు. ఇక రెండు పూటల పని వల్ల ఎదురయ్యే ఇక్కట్లు వర్ణనాతీతం.
           పెరుగుతోన్న నిత్యావసర సరుకుల ధరలకు ఏ ఒక్క పనికో పరిమితమైతే కుటుంబాలు వెళ్ళదీయలేని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చే వేతనం రూ. 245 అయినా దక్కేది రూ. 150కు మించడం లేదు. దీంతో ఉదయం ఉపాధి పనులకు వెళ్ళి మధ్యాహ్నం నుండి స్వంత పనులో, వ్యవసాయపు పనులో, మరే ఇతర కూలీ పనులకో వెళ్తున్నారు. రెండు పూటల పని వల్ల అవేవీ సాధ్యం కావు. అదనపు ఆదాయానికి గండి పడ్తుంది. దీంతో కూలీలే స్వచ్ఛందంగా ఉపాధి పనులకు వెళ్ళలేమంటున్నారు. పోనీ రెండు పూటలా పనులు చేస్తే కచ్చితంగా ప్రభుత్వం చెప్పినట్లు దక్కేది 257 రూపాయలే. ఈ పనులు మానుకుని వ్యవసాయ పనులకు వెళ్ళినా గతంలో మాదిరిగా కూలీ రేట్లు ఇచ్చే అవకాశముండదు. గతంలో ప్రభుత్వ ఉపాధి పని ఓ పూట చేస్తే రూ. 245 ఇస్తానంది. బయట పనులకు రెండు పూటలకు రెట్టింపు కూలీ డిమాండ్‌ చేయగల్గేవారు. రూ. 400 వరకు దక్కేది. ఇప్పుడు వేతనాలపై బేరమాడలేరు. దాంతో ప్రస్తుతం ఇచ్చే కూలీ రేట్లు తగ్గే ప్రమాదముంది.
             తీవ్ర ఉష్ణోగ్రతల్లో పని చేయడం కష్టం కనుక వేసవి అదనపు భత్యం కోసం పోరాడగా రాష్ట్ర ప్రభుత్వం మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో 20 నుండి 30 శాతం వేసవి అదనపు వేతనాన్నిచ్చేది. మంచి నీళ్ళకు రూ. 5, పనిముట్లకు రూ. 10, ఎండకు టెంట్‌, గాయాలకు మెడికల్‌ కిట్లు ఇచ్చేది. 20 మంది కూలీలతో ఏర్పాటైన శ్రమశక్తి సంఘాలకు ఓ మేట్‌ ఉండేవారు. కూలీలను పనిలో తీసుకొచ్చినందుకు కూలీ ఒక్కరికి రూ.5 చొప్పున పారితోషికం ఇచ్చేవారు. వేసవి మజ్జిగకు నిధులిచ్చేవారు. ఇప్పుడవన్నీ రద్దయ్యాయి. వీటికి ఎంత పడుతున్నాయో చూసుకునేందుకు గతంలో పే స్లిప్పులు ఇచ్చేవారు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం తెల్ల కాగితాలు కూడా సరఫరా చేయనందున పే స్లిప్పులు ఇవ్వడం లేదు. దీంతో ఇవి అసలు పడుతున్నాయో లేదో కూలీలకు అర్థంకావడంలేదు.
             పైగా, శ్రమశక్తి సంఘాల ఏర్పాటు ప్రక్రియను మార్చేసింది. నేడున్న మేట్ల స్థానంలో 40 నుండి 60 కుటుంబాలకు ఒక సైట్‌ సూపర్‌ వైజర్‌ను ప్రభుత్వమే నియమించనుంది. పదవ తరగతి పైబడి చదివి, ఉపాధి కూలీ కాకున్నా ప్రభుత్వ కనుసన్నల్లో ఉండే వారిని నియమిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం 50 కుటుంబాలకో వాలంటీరను పెడ్తే ఉపాధిలో అంతకుమించి కుటుంబాలకు వీరిని నియమిస్తుంది. వీరు 60 కుటుంబాలు అంటే 150 మంది పైబడ్డ జనాభాకు పని చూపించి, చేయించి ప్రభుత్వానికి స్మార్ట్‌ఫోన్‌ ద్వారా పంపడం తీవ్ర ఇబ్బందులు, గందరగోళానికి దారితీయనుంది. గతంలో వికలాంగులకు ప్రత్యేక గ్రూపులు ఏర్పరిచి వారు చేయగల్గే పనులు చేయించేవారు. ఇప్పుడు అలాంటివేమీ లేవు. అందరితో పాటు చేయాల్సిందే. లేదంటే మానుకోవాల్సిందే.
          ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తున్నది. ఈ మౌనం తమను ఓట్లు వేసి గెలిపించిన ఉపాధి కూలీలను మోసగించినట్లవుతుంది. ఇన్ని ఇబ్బందులతో పని చేయలేమని కూలీలే స్వచ్ఛందంగా పథకం నుంచి వైదొలగుతారు. ప్రభుత్వానికి కావలిసిందిదే. అందుకే దేశ ఆర్థిక వ్యవస్థ పరిరక్షణకు, గ్రామీణ పేదల ఉపాధికి ఈ పథకాన్ని పరిరక్షించుకోవాల్సిన కర్తవ్యం అందరి పైనా ఉంది. ఈ చట్ట సాధనకు ముందు పోరాడినట్లే పథకం పరిరక్షణకు పోరాటాలే శరణ్యం.

ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చే వేతనం రూ. 245 అయినా దక్కేది రూ. 150కు మించడం లేదు. దీంతో ఉదయం ఉపాధి పనులకు వెళ్ళి మధ్యాహ్నం నుండి స్వంత పనులో, వ్యవసాయపు పనులో, మరే ఇతర కూలీ పనులకో వెళ్తున్నారు. రెండు పూటల పని వల్ల అవేవీ సాధ్యం కావు. అదనపు ఆదాయానికి గండి పడ్తుంది. దీంతో కూలీలే స్వచ్ఛందంగా ఉపాధి పనులకు వెళ్ళలేమంటున్నారు. పోనీ రెండు పూటలా పనులు చేస్తే కచ్చితంగా ప్రభుత్వం చెప్పినట్లు దక్కేది 257 రూపాయలే. ఈ పనులు మానుకుని వ్యవసాయ పనులకు వెళ్ళినా గతంలో మాదిరిగా కూలీ రేట్లు ఇచ్చే అవకాశముండదు


                                    బి. రవి :  వ్యాసకర్త : వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి.