Jun 21,2021 20:10

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
ఉపాధి కూలీలకు కులాల వారీగా వేతనాలిచ్చే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని వ్యవసాయ కార్మిక, గిరిజన సంఘాలు సంయుక్తంగా ఖండించాయి. దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా మండల కేంద్రంలోని ఎంపిడిఒ కార్యాలయం వద్ద వ్యవసాయ కార్మిక, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఎ.రవి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పేదలందరికీ తిండి పెడుతున్న ఉపాధి హామీ పథకాన్ని కులాల వారీగా వేతనాలు ఇవ్వాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించడం బాధాకరమన్నారు. ఇప్పటి వరకూ ఐక్యంగా పనిచేసిన ఉపాధి కూలీలు నేడు కులాల పేరుతో వేతనాలు వేయడం సిగ్గుచేటన్నారు. తక్షణం ఈ నిర్ణయం రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇవ్వాలన్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న కూలీలకు ఐదు రోజులు సెలవుతో కూడి వేతనాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీలకు ఆరు వారాలకుపైగా బకాయిలు వేతనాలు జిల్లావ్యాప్తంగా 84 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయన్నారు. ఉపాధి హామీ పథకాన్ని 200 రోజులు పని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా రోజుకు రూ.600 కనీస వేతనం ఇవ్వాలన్నారు. ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. అనంతరం ఎంపిడిఒ ఎం.రాజుకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో వ్య.కా.స జిల్లా నాయకులు కారం భాస్కర్‌, తుమ్మల సత్యనారాయణ, ఉడతా వెంకటేష్‌, గిరిజన సంఘం జిల్లా నాయకులు బుల్లెమ్మ, సిఐటియు మండల కార్యదర్శి ఎం.నాగమణి, కుమారి పాల్గొన్నారు.
ఉపాధి హామీ చట్టంలో కుల విభజన సరికాదని కెవిపిఎస్‌ అప్‌ల్యాండ్‌ జిల్లా కార్యదర్శి అందుగుల ఫ్రాన్సిస్‌ అన్నారు. ఈ మేరకు దళిత కూలీలతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఫ్రాన్సిస్‌ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీలో కుల విభజన చేస్తూ తీసుకొచ్చిన జిఒను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్‌ జిల్లా అధ్యక్షులు కొక్కెరపాటి రవీంద్ర, బి.డేవిడ్‌ రాజ్‌, జి.ఏలియా, మేరీ జోసెఫ్‌ రాజ్‌, బి.విజయ రాజు, బేబీ, ఇందిరా, మంగ పాల్గొన్నారు.
ఏలూరు కల్చరల్‌:ఉపాధి పనుల్లో వేతనాలు దళితులకు వేరుగా, ఇతర కులస్తులకు వేరుగా ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఎపి వ్యవసాయ కార్మిక సంఘం, కెవిపిఎస్‌, డిహెచ్‌పిఎస్‌ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఉపాధి హామీ జిల్లా అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పిల్లి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఉపాధి పనిచేసే కూలీలకు దళితులకు వేరుగా, ఇతరులకు వేరుగా కూలి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో మెమో విడుదల చేసిందని విమర్శించారు. దీని ప్రకారం ఏప్రిల్‌ నుండి ఇచ్చే కూలి దళితులకు ముందుగా ఇచ్చి తర్వాత ఇతర కులస్తులకు 15 రోజుల తర్వాత ఇవ్వడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బుద్ధిపూర్వకంగానే కులాల చిచ్చు పెట్టడానికి ఈ మెమో తీసుకొచ్చిందన్నారు. ఈ మెమో వల్ల దళితులకు గిరిజనులకు అన్యాయం జరుగుతుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు పెంటయ్య, డిహెచ్‌పిఎస్‌ నాయకులు ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
తాడేపల్లిగూడెం రూరల్‌: ఉపాధి కూలీలకు రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వ్య.కా.స, రైతు, కౌలురైతు, సిఐటియు ప్రజాసంఘాల పిలుపులో భాగంగా వెంకటరామన్నగూడెంలో ఉపాధి కూలీలు పని ప్రదేశంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కండెల్లి సోమరాజు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మరుకుర్తి రత్నకుమారి, జి.భాగ్యలక్ష్మి, దాడిశెట్టి సత్యవతి, లావణ్య, బండారు చెన్నయ్య, బలరామకృష్ణమూర్తి, మర్రి కృష్ణారావు, బట్ట నారాయణమూర్తి పాల్గొన్నారు.
పెనుమంట్ర : ఉపాధి హామీ చట్టంలో కులాల ఆధారంగా వేతనాలు ఇచ్చే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ ప్రభుత్వం డిమాండ్‌ చేశారు. గతంలో ఇస్తున్న మాదిరిగానే ఉపాధి కూలీలకు వేతనాలివ్వాలని కోరుతూ దేశవ్యాప్తంగా ప్రజా సంఘాల పిలుపులో భాగంగా ఎంపిడిఒ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ఎంపిడిఒ ఆర్‌.విజయరాజుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకులు కోసంపూడి సుబ్బరాజు, బల్ల చిన్న వీరభద్రరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో చల్లబోయిన శ్రీను, జోగి పాటేశ్వరరావు, మంగం సూర్యనారాయణ పాల్గొన్నారు.
గణపవరం: ఉపాధి హామీ కూలీలందరికీ ఒకేసారి వేతనాలు అందించాలని కోరుతూ మండల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎంపిడిఒ జి.జ్యోతిర్మయికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మెమో వల్ల ఉపాధి కూలీల్లో కుల ఘర్షణలు తలెత్తే అవకాసం ఉందన్నారు. వెంటనే మెమోను రద్దు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పి.నరసింహమూర్తి, నరాలశెట్టి రామకృష్ణ, చిన్నచిన్న నాగేశ్వరరావు, దండు రామలింగరాజు, రవణమ్మ పాల్గొన్నారు.
యలమంచిలి: ఉపాధి హామీ కార్మికులను షెడ్యూల్డ్‌ కులాలు షెడ్యూల్డ్‌ తెగలు ఇతరులు గా విభజించాలని కేంద్ర ప్రభుత్వం యోచించడం తగదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు బాతిరెడ్డి జార్జి అన్నారు. ఈ మేరకు కేంద్రం తీసుకొచ్చిన జిఒను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం, రైతు, కౌలు రైతు, కెవిపిఎస్‌, ఐద్వా ఆధ్వర్యంలో ఎంపిడిఒ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం మండల విస్తరణాధికారి కెఎం.వైభావటికి వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాసవరపు సుబ్బారావు, కానేటి బాలరాజు, కొప్పిశెట్టి సత్యనారాయణ, యడ్ల మోహనరావు, ఐద్వా మండల అధ్యక్షురాలు బాతిరెడ్డి సుగుణ పాల్గొన్నారు.
పాలకోడేరు : ఉపాధి హామీ కూలీలందరికీ తక్షణం కోవిడ్‌ వ్యాక్సిన్‌ అందించాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి అశ్రియ్య డిమాండ్‌ చేశారు. ప్రజా సంఘాల పిలుపులో భాగంగా పాలకోడేరు ఇన్‌ఛార్జి తహశీల్దార్‌ రాజ్‌ కిశోర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధి పనుల్లో వేతనాల వ్యత్యాసంపై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. వినతిపత్రం అందించిన వారిలో దున్న మరియమ్మ, గుత్తుల రాములు ఉన్నారు.
వీరవాసరం : ఉపాధి హామీ కూలీల బకాయి వేతనాలు వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక, కౌలు రైతు, రైతు సంఘాలు డిమాండ్‌ చేశాయి. ఈ మేరకు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఎంపిడిఒకు వినతిపత్రం అందజేశాయి. కూలీలకు గతంలో వలే కూలి సొమ్ముల చెల్లించాలని కోరాయి. ఈ కార్యక్రమంలో పోతుల మృత్యంజయ, బాలం విజయకుమార్‌, బొర్రా ఆలమహారాజు, రెడ్డి రామారావు పాల్గొన్నారు.