Jan 17,2022 22:18

నందవరంలో వినతిపత్రం అందిస్తున్న వ్యకాస నాయకులు

ప్రజాశక్తి - నందవరం: ఉపాధి పనులు కల్పించాలని, వలసలు నివారించి, 200 రోజులు పని దినాలు కల్పించాలని వ్యకాస మండల ఉపాధ్యక్షులు రాజు కోరారు. సోమవారం మండలంలోని కనకవీడు, గురజాల, నందవరం, రాయచోటి, నాగలదిన్నె గ్రామాల్లో వ్యకాస ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఆయా గ్రామాల సచివాలయాల దగ్గర వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఖరీఫ్‌ సీజన్‌ వర్షాల్లేక, రబీలో అధిక వర్షాలతో పంటలు నాశనయ్యాయని తెలిపారు. గ్రామాల్లో వ్యవసాయ పనుల్లేక కుటుంబ పోషణకు గ్రామాల్లోని చాలామంది పేదలు, సన్న, చిన్న కారు రైతులు సుదూర ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారని చెప్పారు. గ్రామాల్లో ఉపాధి పనులు చేపట్టి వలసలు అరికట్టాలని కోరారు. పనులు అడిగిన వారందరికీ ఉపాధి పనులు కల్పించాలని, 200 రోజులు పని కల్పించి రూ.600 వేతనం ఇవ్వాలని తెలిపారు. ఉపాధి హామీ పనులు కల్పించకుంటే నిరుద్యోగ భృతి చెల్లించాలని, రూ.245 రోజూ వేతనం వేస్తేనే ఒకరోజు పని పూర్తయినట్లు భావించాలని చెప్పారు. వలసలు వెళ్లిన కుటుంబాల పిల్లలకు సీజనల్‌ హాస్టళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఆయా గ్రామాల నాయకులు, కూలీలు నాగప్ప, దుబ్బన్న, జక్కయ్య, పరంజ్యోతి, శాంతి, ఆనంద్‌, తిమ్మప్ప పాల్గొన్నారు. పెద్దకడబూరు గ్రామ సచివాలయం ఎదుట వ్యకాస ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మండలంలోని చిన్నతుంబలం, కల్లుకుంట, పెద్దకడబూరు సచివాలయాల్లో వినతిపత్రాలు అందజేశారు. వ్యకాస డివిజన్‌ కార్యదర్శి తిక్కన్న, నాయకులు పరమేష్‌, చిన్న తుంబలం హనుమంతు, దేవదాసు, అబ్రహాం, ఆశీర్వాదం పాల్గొన్నారు. ఎమ్మిగనూరు మండలంలోని సోగనూర్‌, బనవాసి, కోటేకల్‌, మల్కాపురం, కందనాతి, కలుగొట్ల గ్రామాల్లో వ్యకాస ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. వ్యకాస జిల్లా ఉపాధ్యక్షులు తిమ్మన్న, ఆయా గ్రామాల నాయకులు, కూలీలు ఫక్కీరప్ప, దేవేంద్ర, ఆనంద్‌, విన్సెంట్‌, తిమ్మప్ప, ఏసేపు, బాలస్వామి, బజారి, మారన్న పాల్గొన్నారు.