
ప్రజాశక్తి-ఆదోనిరూరల్ : మండలంలో అన్ని గ్రామాలలో తక్షణమే ఉపాధి కల్పించే వలసలు నివారణ చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కే.లింగన్న డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం కరువు అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగిందని, ప్రస్తుతం పని చేయడానికి రైతులకు కూలీలకు పనులు లేవని, దీని వల్ల వేరే ప్రాంతాలకు వలస వెళ్లడం జరిగింది అని, అక్కడ కూడా పనులు దొరకక సొంత గ్రామాలకు తిరిగి వస్తున్నారని, కావున ప్రభుత్వం వెంటనే ఉపాధి పనులు కల్పించి ప్రజలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత మూడు నెలలుగా ఉపాధిహామీలో సాఫ్ట్వేర్ మార్పు పేరుతో పనులు కల్పించడం లేదన్నారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొలతలతో సంబంధం లేకుండా ఉపాధి హామీ పనులు కల్పించి 600 రూపాయల వేతనం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం గణేకల్లు గ్రామ సచివాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కె వెంకటేష్ అధ్యక్షతన ధర్నా నిర్వహించారు. బసరకోడు గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు ఉచ్చిరప్ప అధ్యక్షతన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మండల కార్యదర్శి తాహేర్ వలి, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గోవిందు, నర్సిరెడ్డి, అనీఫ్ ఆంజనేయ, హుస్సేనీ, డివైఎఫ్ఐ గ్రామ నాయకులు ఈరన్న, దేవరాజ్, మహిళా సంఘం నాయకురాలు ఫాతిమా, రైతు సంఘం నాయకులు హనుమంత్ రెడ్డి, కూలీలు గోవింద్ రెడ్డి, సోమయ్య, కొండయ్య, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.