Mar 27,2023 21:42

ధర్నాలో మాట్లాడుతున్న సిఐటియు నాయకులు తమ్మినేని సూర్యనారాయణ

ప్రజాశక్తి - శృంగవరపుకోట : గ్రామీణ ఉపాధి హామీ ద్వారా నిర్వహిస్తున్న చెరువు పనులను ఒక్క పూటే నిర్వహించాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు తమ్మినేని సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. సోమవారం ఎంపిడిఒ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ కమ్యూనిస్టుల త్యాగాలతో వచ్చిన ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ చట్టానికి నేడు కేంద్రంలో ఉన్న బిజెపి, రాష్ట్రంలో ఉన్న వైసిపి ప్రభుత్వాలు తూట్లు పొడుస్తూ నిర్వీర్యం చేయాలని చూస్తున్నాయన్నారు. వీరికి పేదలు గౌరవంగా బతకడం అంటే ఇష్టం ఉండదని అందుకే ఈ శక్తులు బడ్జెట్‌ కేటాయింపుల్లో నిధులు క్రమేపి తగ్గించుకుంటూ వస్తున్నాయని అన్నారు. ఎంతో కొంత కేటాయించిన బడ్జెట్‌ను కూడా రాష్ట్ర ప్రభుత్వం వేరే విధులకు దారి మళ్లిస్తోందని ఆయన మండిపడ్డారు. ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌ను తీసుకొచ్చి ఉపాధి కూలీల గ్రూపు సంఖ్యను పెంచారన్నారు. రెండు పూటల పని పెట్టి ఉపాధి పనులకు కార్మికులను దూరం చేస్తున్నారన్నారు. కార్మికుల వలసలను నిర్మూలించి గ్రామాల్లోనే కార్మికులకు ఉపాధి హామీ పని దొరికేలా 200 రోజులు పని దినాలు కల్పిస్తూ పాత పద్ధతి లోనే వేసవి అలవెన్స్‌లతో పాటు ఇతర అలవెన్సులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మేట్ల అందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్న రూ.7,500 రూపాయలు వేతనాన్ని అమలు చేయాలన్నారు. పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఆలోచన విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉపాధి కూలీలను ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటం చేపడుతామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కె సురేష్‌, సిఐటియు జిల్లా కార్యదర్శి మద్దిల రమణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు గాడి అప్పారావు, సిఐటియు ఎస్‌ కోట మండల కమిటీ నాయకులు చెలికాని ముత్యాలు, ఉపాధి హామీ పథకం కూలీలు పాల్గొన్నారు.