
- మూల్యాంకనం కేంద్రాల వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ధర్నాలు
- ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మోకాళ్లపై నిలబడి నిరసన
ప్రజాశక్తి-యంత్రాంగం : రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ రద్దు చేయాలని, పిఆర్సి అమలు చేయాలని, పదో తరగతి మూల్యాంకనం పారితోషికాన్ని పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి మూల్యాంకనం కేంద్రాల వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు మంగళవారం ధర్నాలు చేశారు. పలు చోట్ల మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా కేంద్రంలోని సెయింట్ గ్జేవిఆర్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పదో తరగతి మూల్యాంకనం కేంద్రం వద్ద ఉపాధ్యాయులు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే సిపిఎస్ రద్దు చేసి మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఫ్యాప్టో ఉద్యమానికి పిడిఎఫ్ ఎమ్మెల్సీలుగా మద్దతిస్తామని, సమస్యలు పరిష్కారయ్యే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని తెలిపారు. ఎస్టియు రాష్ట్ర అధ్యక్షులు ఎల్.సాయిశ్రీనివాస్, ఎపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి సాల్మన్‌రాజు, బిటిఎ రాష్ట్ర అధ్యక్షులు మనోజ్‌కుమార్, యుటిఎఫ్ నాయకులు పాల్గొన్నారు. కష్ణా జిల్లా బందరులోని సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల వద్ద ఉపాధ్యాయులు మోకాళ్లపై నిల్చొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, ఫ్యాప్టో, యుటిఎఫ్ నేతలు పాల్గొన్నారు. కర్నూలులోని మూల్యాంకనం కేంద్రం వద్ద ధర్నాలో ఫ్యాప్టో రాష్ట్ర నేతలు కె.సురేష్ కుమార్, జి.హృదయరాజు, కె.ప్రకాష్‌రావు పాల్గొని మాట్లాడారు. గ్యారెంటీ పెన్షన్ స్కీం పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులను మరోసారి మోసం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందన్నారు. పాత పెన్షన్ స్కీమ్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడలో పదో తరగతి స్పాల్ వాల్యూషన్ కేంద్రం వద్ద ఉపాధ్యాయులు ధర్నా నిర్వహించారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాలకు చెందిన నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి చౌదరి రవీంద్ర, అనంతపురంలో యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కోటేశ్వరప్ప మాట్లాడుతూ స్పాట్ కేంద్రంలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కడప, చిత్తూరు, విశాఖ, విజయనగరంలోని మూల్యాంకన కేంద్రాల వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.