Oct 17,2021 09:08

అనగనగా ఒక అడవి
అడవిలోన ఒక చెరువు
చెరువుచేరె ఒక మొసలి
జంతువులను తినసాగె

జంతువులూ దిగులుపడె
మకరాన్ని చంపుటకు
వాటిశక్తి చాలదూ
కోతి ఒక యుక్తి చెప్పె

గజరాజూ దాహమని
చెరువులోన దిగబోయె
ఆగమని అరిచె కోతి
గజరాజూ ఆగెనూ

గజరాజా చెరువులో
మొసలి ఒకటి చేరెనూ
నీరుతాగ వచ్చినా
మనవారిని తిన్నదీ

విషపుమొక్క రసమునూ
చెరువులోన కలిపెదము
ఉత్తరాన చెరువులో
నీరుమనము తాగుదము

ఆమాటకు మకరమూ
భయముతోడ వణికెనూ
అవి రెండూ వెళ్లగానె
మొసలి బయట కొచ్చెనూ

విషంతెచ్చి కలిపినా
చావు తనకు తప్పదని
ఈ చెరువూ వద్దనీ
పదేపదే తలిచెనూ
ఉత్తరాన చెరువుకై
వెదుకుతూ వెళ్లెనూ
చెరువేమో కానరాక
అడవి వదిలి వెళ్లెనూ

యుక్తితోడ వానరము
మకరమునూ తరిమెనని
జంతువులూ పొగిడాయి
గెంతులేస్తు మురిశాయి.
 

- డి.కె.చదువులబాబు
94407 03716