Jan 14,2021 01:31

ఆశాజ్యోతి మృతదేహం

ప్రజాశక్తి-చిలకలూరిపేట: భర్త పెట్టిన హింసలు, దెబ్బతిన్న కాపురం, పైగా కోర్టు కేసుల ఒత్తిడితో మానసికంగా కుంగిపోయిన మహిళ ఉరివేసుకున్న సంఘటన పట్టణంలో బుధవారం వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని బ్యాంకు కాలనీలో నివాసం ఉండే నూకతోటి ఆశాజ్యోతి(32)కి నాలుగేళ్ల కిందట వివాహమైంది. అయితే కొన్ని రోజుల్లోనే భర్త పెట్టే హింసను తట్టుకోలేక ఆశాజ్యోతి పుట్టింటికి వచ్చేసింది. వివాదాలు విడాకుల వరకూ వెళ్లడంతో అప్పటి నుంచి కోర్టులో కేసు నడుస్తోంది. ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురైన ఆశాజ్యోతి మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరు లేని సమయంలో చీరతో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లోకి వెళ్లిన ఆశాజ్యోతి ఎంతకూ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబీకులు, బంధువులు తలుపులు పగలగొట్టి చూసేసరికి ఆమె మృతి చెంది ఉంది. ఘటనా స్థలిని పరిశీలించిన ఎస్‌ఐ నరసదాసు కేసు నమోదు చేశారు.