
వాషింగ్టన్ : 'ఇండియా.. ది మోడీ క్వశ్చన్' పేరిట బిబిసి రూపొందించిన డాక్యుమెంటరీపై అమెరికా స్పందించింది. మీరు చెప్తున్న డాక్యుమెంటరీ గురించి నాకు తెలియదు. రెండు శక్తిమంతమైన ప్రజాస్వామ్యాలుగా అమెరికా, భారత్‌కు వాటి భాగస్వామ్య విలువల గురించి తనకు బాగా తెలుసని అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి నెడ్ ప్రైస్ తెలిపారు.
భారత ప్రజాస్వామ్యం శక్తిమంతమైందని, ఈ రెండు దేశాలను కలిపి ఉంచే వాటిపై తమ దృష్టి ఉంటుందని, అలాగే ఈ బంధాన్ని బలోపేతం చేసే అంశాల గురించి తాము ఆలోచిస్తామని అన్నారు. ఇరు దేశాల మధ్య సన్నిహిత రాజకీయ సంబంధాలు, ఆర్థిక సంబంధాలు ఉన్నాయని, అమెరికా, భారత్ ప్రజల మధ్య విడదీయరాని బంధం ఉందని నెడ్ ప్రైస్ సోమవారం మీడియా సమావేశంలో తెలిపారు. గతవారం బ్రిటన్ ప్రధాని రిషిసునక్ కూడా ఈ డాక్యుమెంటరీపై స్పందించారు. బ్రిటీష్ పార్లమెంటులో ఎంపి ఇమ్రాన్ హుస్సెన్ ఈ డాక్యుమెంటరీ అంశాన్ని లేవనెత్తారు. ఈ డాక్యుమెంటరీపై బ్రిటన్ వైఖరిస్పష్టంగాఉందని, హింస అనేదిఎక్కడ జరిగినా వ్యతిరేకిస్తామని అయితే గౌరవనీయ వ్యక్తులపై వచ్చిన విమర్శలను తాను ఏకీభవించలేనని అన్నారు.
2002 గుజరాత్ అల్లర్లపై అధ్యయనం చేసిన బ్రిటన్‌కి చెందిన జాతీయప్రసార సంస్థ బిబిసి 'ఇండియా.. ది మోదీ క్వశ్చన్' పేరిట ఓ డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అయితే ఈ డాక్యుమెంటరీపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. యూట్యూబ్, ట్విటర్ల నుండి సంబందిత లింక్‌లను తొలగించాలని ఆదేశించింది. బిబిసి కథనం పూర్తిగా పక్షపాతంతో కూడుకున్నదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇది ఒక ప్రచార కార్యక్రమమని, వారు ఎంచుకున్న కోణాన్ని మాత్రమే ప్రచారంచేసేందుకు దీన్నిరూపొందించారని ' విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి పేర్కొన్నారు.