Jul 03,2022 22:24

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
కేంద్ర ప్రభుత్వం రేషన్‌ డిపోల ద్వారా పంపిణీ చేయాల్సిన ఉచిత బియ్యం పంపిణీ ప్రహసనంలా మారింది. కరోనా ప్రభావంతో దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా మొదటి, రెండు దశల్లో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ప్రధాన మంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేపట్టింది. తెల్ల రేషనకార్డులోని ప్రతి సభ్యుడికి నెలకు 5 కిలోల వంతున ఉచిత బియ్యం అందజేస్తామని తెలిపింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు నెలకు రూ.8వేలు చొప్పున ఇవ్వాలని కోరినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పదించలేదు. బియ్యం మాత్రమే పంపిణీ చేసి చేతులు దులుపుకున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఉచిత బియ్యం పంపిణీ చేపట్టలేదు. జిల్లాల విభజన నేపథ్యంలో సాధారణ కోటా పంపిణీ ఆలస్యమవడంతో మే నెలలో రెండు నెలల కోటా ఒకేసారి ఇస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. జూలై నెల ప్రారంభమైనా ఉచిత బియ్యం పంపిణీపై ప్రభుత్వం నోరు మెదపడంలేదు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్ధి లేమి
ప్రధాన మంత్రి గరీబ్‌ యోజన ద్వారా కేంద్రం అందించే రేషనుకు మార్చి నెల వరకు రాష్ట్ర ప్రభుత్వం అందించింది. తర్వాత ఉచిత బియ్యం పంపిణీకి మంగళం పాడేసింది. ఏప్రిల్‌లో సరఫరాతో పాటు బియ్యం నిల్వలు లేవని, సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ చెబుతూ వచ్చింది. తర్వాత కేంద్రం నుంచి బియ్యం కోటా తక్కువగా వస్తోందంటూ కాలయాపన చేయడానికి ప్రయత్నించింది. రాష్ట్రంలో ఉన్న రేషనకార్డుదారులందరికీ ఉచిత బియ్యం ఇవ్వకుండా 60 శాతం మంది కార్డుదారులకు సరిపడా బియ్యాన్ని మాత్రమే కేంద్రం తన కోటాగా విడుదల చేస్తోందని రాష్ట్ర మంత్రులు, అధికార పార్టీ ఎంఎల్‌ఎలు చెబుతున్నారు. రెండేళ్లుగా ఇదే కోటా ఇస్తుండగా.. కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేసి, ఇప్పుడు కొత్తగా సాకులు చెబుతున్నారని బిజెపి నాయకులు అంటున్నారు. మార్చి వరకు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకొచ్చిందని ఇటు నాయకులు, అటు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చిత్తశుద్దిలేమి ఈ దుస్థితికి కారణమంటున్నారు. వంటనూనెలు, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్న విషయం విధితమే. కనీసం బియ్యమైనా పంపిణీ చేస్తారని పేదలు ఎదురు చూస్తున్నారు.
16 లక్షల మంది లబ్ధిదారుల ఎదురుచూపులు
తూర్పుగోదావరి జిల్లాలో 5.61 లక్షల మంది, కాకినాడలో 6.43 లక్షల మంది, కోనసీమలో 5.61 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. మొత్తం మీద 16 లక్షల మంది లబ్ధిదారులు ఉచిత రేషన్‌ బియ్యం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రతినెలా ఉచిత బియ్యం 17లోపు రేషన్‌ దుకాణాలకు చేరితే 18 నుంచి డీలర్లు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల రాష్ట్ర ప్రభుత్వం ఎండియు వాహనాల ద్వారా బియ్యం పంపిణీ ప్రారంభించింది. అయితే డిపోల్లో పంపిణీపై తేదీని ప్రకటించలేదు. మరో వైపు గోదాముల నుంచి దుకాణాలకు ఎప్పుడు సరఫరా చేస్తారో.. డీలర్లు ఎప్పుడు పంపిణీ చేస్తారో స్పష్టతలేదు. అసలు ఈ నెలలో అయినా బియ్యం పంపిణీ చేస్తారా లేదా ? అనే సందేహం వెంటాడుతోంది. ఉచిత బియ్యం పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఆదేశాలు రాలేదని సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపమే ఈ దుస్థితికి కారణమని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ నెలైనా ఇస్తారా..?
రెండు నెలలుగా ఉచిత బియ్యాన్ని నిలిపివేశారు. ఈనెలైనా ఇస్తారో లేదో తెలీదు. పనులు లేక తినేందుకు తిండి లేక పస్తులుండే పరిస్థితి ఏర్పడింది. గతంతో పోల్చుకుంటే వ్యవసాయ పనులు చాలా వరకూ తగ్గిపో యాయి. పూర్వం మాతో పాటు శ్రీకాకుళం విజయనగరం జిల్లాల నుండి ఉపాధి కొరకు వలస కూలీలకు పనులు దొరికేవి. ఇప్పుడు ఉపాధి కోసం హైదరాబాద్‌, విశాఖపట్నం వంటి పట్టణాలకు మేము వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ సమయంలో రేషన నిలిపేయడం తగదు.
-కొవ్వలి విజయలక్షి, నల్లజర్ల
బియ్యం కోసం ఎదురుచూస్తున్నాం...
కరోనా కాలంలో ఉపాధి లేక చాలా ఇబ్బంది పడ్డాము. ఈ సమయంలో ఉచిత రేషన్‌తో కొంత ఊరట లభించింది. రెండు నెలలుగా ఉచిత బియ్యం నిలిపేశారు. కూలి పని లేక కుటుంబ పోషణ కష్టంగా మారింది. ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీని కొనసాగించాలి. మూడు నెలల సంబంధించిన బియ్యం పంపిణీ చేసేలా చర్యలు చేపట్టాలి.
- ఉండ్రాజవరపు కుమారి, నల్లజర్ల
ఎలాంటి ఆదేశాలు రాలేదు...
ఉచిత బియ్యం పంపిణీకి సంబంధించిన ఇప్పటి వరకూ ఎలాట్‌మెంట్‌ రాలేదు. రెండు నెలలుగా సాంకేతిక కారణాల రీత్యా పంపిణీ చేయలేదు. ఇది మూడో నెల. పంపిణీ తేదీ గురించి చెప్పలేము. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది. ఆ తర్వాత తెలియజేస్తాము.
- ప్రసాదరావు, జిల్లా సివిల్‌ సప్లయీస్‌, అధికారి