Mar 01,2021 07:22

సూర్యుణ్ణి మూసేసి
చంద్రుణ్ణి వెలిగించగలమా?
వెలిగిస్తే జీవనం సాగుతుందా?
విశ్వంలో జీవం బతుకుతుందా?
ప్రశ్నకు పాతరేసిన పాలకులు
ప్రభుత్వ రంగాన్ని తవ్వి
ప్రయివేటుకు దోచి ఇస్తున్నారు
ఇస్తే ... పెరిగేది పేదా?
ఐశ్వర్యుల హౌదానా?
దానికీ ఓ కథ కమ్మగా అల్లి
జనం మెదళ్ళపై సమ్మగా కుమ్మేశారు
'ట్రికిల్‌ డౌన్‌ థియరీ' అని చెప్పేశారు

అంటే ... పాలకుల నజరానాగా
చౌకగా భూమి పలహారంగా పొంది
దాన్నే పదిరెట్ల విలువతో
బ్యాంకుల్లో తాకట్టు పెట్టేసి
సొంతం కష్టార్జితం అంటూ
ఘనంగా బాజాలు మోగించుకుంటూ
గంగాళం పెట్టుబడి కింద
శ్రమశక్తితో వంటకం చేస్తే
పొంగేంత సంపద పొర్లి
ఆ పొంగు మేడ గోడ దాటి
పాకల పునాదులు తాకితే
పొడిబారిన పేదోడి పేగు
తడిచి చల్లబడుతుందట
పెట్టుబడితో పుట్టి పెరిగిన పేదరికం
ఫటాఫట్మని పటాపంచలట
కెరటం లెగిస్తే పడవులు ఎగిరినట్టు
గుడిసెలు ఎగిసి
భవంతులై మెరుస్తాయట
సూర్యుణ్ణి మూసి
చంద్రుణ్ణి వెలిగించినట్టు
ప్రభుత్వ రంగాన్ని అమ్మి
ప్రయివేటుకు ఇచ్చినట్టు
నమ్మండి ... విశాఖ ఉక్కును
అమ్ముతూ ఉన్నా నమ్మండి
ఎక్కడైనా ఇలా జరిగిందా?
ఏ దేశమైనా మారిందా?
కాకి బంగారం
క్యారెట్ల కొలతలో నిగ్గు తేలిందా?
మారీచక మాయలేడి
బంగారు జింక అయ్యిందా?

- ఉన్నం వెంకటేశ్వర్లు
83328 07330