Oct 17,2020 23:31

షార్జా : ఉత్కంఠ పోరులో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ ఘన విజయం సాధించింది. శిఖర్‌ ధావన్‌ అద్భుత సెంచరీకి తోడు చివరలో అక్షర్‌ పటేల్‌ మూడు సిక్స్‌లు బాది ఒక్క బంతి మిగిలి ఉండగానే 185 పరుగులు చేసి ఢిల్లీకి విజయాన్నందించారు. దీంతో ఈ లీగ్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ చెన్నై ఓటమిపాలైంది. శిఖర్‌ ధావన్‌ (100 నాటౌట్‌ : 58 బంతుల్లో 14 ఫోర్లు, సిక్స్‌), స్టోయినిస్‌ (24 : 14 బంతుల్లో ఫోర్‌, 2 సిక్స్‌లు), అక్షర్‌ పటేల్‌ (21 నాటౌట్‌ : 4 బంతుల్లో 3 సిక్స్‌లు) అద్భుత బ్యాటింగ్‌ చేశారు. చెన్నై బౌలర్లలో దీపక్‌ చాహర్‌ 2 వికెట్లు తీయగా, శామ్‌ కరన్‌, శార్దూల్‌ తాకూర్‌, డ్వేన్‌ బ్రావో తలా వికెట్‌ పడగొట్టారు.
 చెన్నై సూపర్‌ కింగ్స్‌180 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్‌ తొలి ఓవర్‌లోనే ఒక్క పరుగు కూడా తీయకుండా తొలి వికెట్‌ కోల్పోయింది. ఓపెనర్‌ పృథ్వీషా (0) దీపక్‌ చాహర్‌ వేసిన అద్బుత బంతులు ఎదుర్కొలేక వికెట్‌ సమర్పించుకున్నాడు. రెండో బంతికి కాట్‌ అండ్‌ బౌల్డ్‌గా వెనుదిరిగాడు. అంతే కాకుండా చాహర్‌ తొలి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా మెయిడిన్‌గా ముగించాడు. శామ్‌ కరన్‌ వేసిన రెండో ఓవర్‌లో శిఖర్‌ ధావన్‌ రెండు ఫోర్లు బాదాడు. చాహర్‌ వేసిన మూడో ఓవర్‌లో ధావన్‌ మరో ఫోర్‌ బాదడంతో మొత్తం పది పరుగులు వచ్చాయి. శార్దూల్‌ తాకూర్‌ వేసిన నాలుగో ఓవర్‌లో అజింక్య రహానే (8) ఫోర్‌ బాది చాహర్‌ వేసిన ఐదో ఓవర్‌ తొలి బంతికి కరన్‌ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఆ ఓవర్‌లో చాహర్‌ కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. తాకూర్‌ వేసిన ఆరో ఓవర్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ సిక్స్‌, ధావన్‌ ఫోర్‌ బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు రాబట్టారు. జడేజా వేసిన ఏడో ఓవర్‌లో ధావన్‌ రెండు ఫోర్లతో చెలరేగిపోడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. చాహర్‌ వేసిన ఎనిమిదో ఓవర్‌లో ఆరు పరుగులు ఇచ్చి కట్టడి చేశాడు. కరన్‌ శర్మ వేసిన తొమ్మిదో ఓవర్‌లో ధావన్‌ రెండు ఫోర్లు బాదాడు. డ్వేన్‌ బ్రావో వేసిన పదో ఓవర్‌లో శిఖర్‌ దావన్‌ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. కరన్‌ వేసిన 11వ ఓవర్‌లో ధావన్‌ రెండు ఫోర్లు బాదడంతో పాటు ఆ ఓవర్‌లో మొత్తం 12 పరుగులు రాబట్టారు. బ్రావో వేసిన 12వ ఓవర్‌లో తొలి బంతిని ఫోర్‌ బాదిన శ్రేయస్‌ అయ్యర్‌ 23 (23) భారీ షాట్‌ ఆడి బౌండరీ లైన్‌ వద్ద డుప్లెసిస్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు.  చెన్నై సూపర్‌ కింగ్స్‌కరన్‌ శర్మ వేసిన 13వ ఓవర్‌లో స్టోయినిస్‌ సిక్స్‌, ఫోర్‌ బాదడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. బ్రావో వేసిన 14వ ఓవర్‌లో ధావన్‌ ఫోర్‌ కొట్టడంతోపాటు మొత్తం తొమ్మిది పరుగులు వచ్చాయి. కరన్‌ శర్మ వేసిన 15వ ఓవర్‌లో ధానవ్‌ ఫోర్‌ బాదడంతో పాటు ఆ ఓవర్‌లో 11 పరుగులు రాబట్టారు.
శార్దూల్‌ తాకూర్‌ వేసిన 16వ ఓవర్‌లో సిక్స్‌ బాదిన స్టోయినిస్‌ 24 (14) ఆ తరువాతి బంతిని భారీ షాట్‌ ఆడబోయి రాయుడు చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఆ ఓవర్‌లో మొత్తం పది పరుగులు వచ్చాయి. శామ్‌ కరన్‌ వేసిన 17వ ఓవర్‌లో ధావన్‌ ఫోర్‌, సిక్స్‌ బాదడంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి. తాకూర్‌ వేసిన 18వ ఓవర్‌లో చివరి బంతికి ధావన్‌ ఫోర్‌ బాదడంతో ఆ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. చివరి 12 బంతులకు 21 పరుగులు కావాల్సి ఉండగా.. శామ్‌ కరన్‌ వేసిన 19వ ఓవర్‌ తొలి బంతికి క్యారీ (4) బౌండరీ లైన్‌ వద్ద డుప్లెసిస్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. చక్కటి బంతులు వేసి ఆ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి బంతికి సింగిల్‌ రన్‌ తీసి ధావన్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి ఆరు బంతులకు ఢిల్లీకి 17 పరుగులు కావాల్సి ఉండగా.. జడేజా వేసిన చివరి ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ మూడు సిక్స్‌లు బాది ఢిల్లీకి విజయాన్నందించాడు.
జడేజా, రాయుడు ఇన్నింగ్‌ వృథా!
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఓపెనర్‌ శామ్‌ కరన్‌ (0) తుషార్‌ దేశ్‌పాండే వేసిన తొలి ఓవర్‌లో ఎన్రిచ్‌ నోర్జే చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. ఆ ఓవర్‌లో కేవలం రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. కగిసో రబడ అద్భుత బంతులు సంధించడంతో రెండో ఓవర్‌ మెయిడెన్‌గా నమోదైంది. దేశ్‌పాండే వేసిన మూడో ఓవర్‌లో షేన్‌ వాట్సన్‌ రెండు ఫోర్లు బాడదంతో ఆ ఓవర్‌లో మొత్తం పది పరుగులు వచ్చాయి.  చెన్నై సూపర్‌ కింగ్స్‌నాలుగో ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ కట్టుదిట్టమైన బంతులేసి కేవలం మూడు పరుగులే ఇచ్చాడు. నోర్జే వేసిన ఐదో ఓవర్‌లో డుప్లెసిస్‌ రెండు ఫోర్లు, సిక్స్‌తో చెలరేగిపోవడంతో ఆ ఓవర్‌లో 14 పరుగులు వచ్చాయి. రబడ వేసిన ఆరో ఓవర్‌లో డుప్లెసిస్‌, వాట్సన్‌ చెరో బౌండరీ బాది పది పరుగులు తీశారు. కట్టుదిట్టమైన బంతులు వేసిన అక్షర్‌ పటేల్‌ ఏడో ఓవర్‌లో నాలుగు, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఎనిమిదో ఓవర్‌లో నాలుగు పరుగులే ఇచ్చారు. అక్షర్‌ వేసిన తొమ్మిదో ఓవర్‌లో వాట్సన్‌ ఫోర్‌ కొట్టడంతో పాటు తొమ్మిది పరుగులు రాబట్టారు. అశ్విన్‌ వేసిన పదో ఓవర్‌లో డుప్లెసిస్‌ ఒకటి, వాట్సన్‌ రెండు ఫోర్లు బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 15 పరుగులు వచ్చాయి. దేశ్‌పాండే వేసిన 11వ ఓవర్‌లో తొలి బంతిని డుప్లెసిస్‌ సిక్స్‌, ఫోర్‌, డబుల్‌ తీయడంతో ఆ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. నోర్జే వేసిన 12వ ఓవర్‌లో డుప్లెసిస్‌ సింగిల్‌ తీయడంతో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే ఓవర్‌లో నాలుగో బంతికి షేన్‌ వాట్సన్‌ 36 (28) పరుగులు వద్ద క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. ఆ ఓవర్‌లో రెండు పరుగులు మాత్రమే వచ్చాయి. అక్షర్‌ వేసిన 13వ ఓవర్లో ఏడు పరుగులు రాగా, అశ్విన్‌ వేసిన 14వ ఓవర్‌లో రాయుడు సిక్స్‌, రెండు డబుల్స్‌ తీయడంతో మొత్తం 11 పరుగులు వచ్చాయి. రబడ వేసిన 15వ ఓవర్‌లో తొలి బంతిని ఫోర్‌ బాదిన డుప్లెసిస్‌ 58 (47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) పరుగుల వద్ద ధావన్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు.
చెలరేగిపోయిన రాయుడు, జడేజా! చివరి 30 బంతుల్లో 67 పరుగులు!
స్టోయినీస్‌ వేసిన 16వ ఓవర్‌లో రాయుడు భారీ సిక్స్‌ బాదడంతో పాటు ఆ ఓవర్‌లో పది పరుగులు రాబట్టారు. నోర్జే వేసిన 17వ ఓవర్‌లో తొలి బంతిని రాయుడు సిక్స్‌ బాదగా.. మూడో బంతికి భారీ షాట్‌ ఆడబోయి ఎంఎస్‌ ధోనీ (3) క్యారీ చేతికి చిక్కి ఔటయ్యాడు. చివరి బంతికి రాయుడు ఫోర్‌ కొట్టడంతో మొత్తం 12 పరుగులు వచ్చాయి.  చెన్నై సూపర్‌ కింగ్స్‌దేశ్‌పాండే వేసిన 18వ ఓవర్‌లో రవీంద్ర జడేజా భారీ సిక్స్‌ బాదడంతో బంతి స్టేడియం బయట పడింది. చివరి బంతికి డబుల్‌ తీయడంతో మొత్తం 13 పరుగులు వచ్చాయి. రబడ వేసిన 19వ ఓవర్‌లో రాయుడు, జడేజా చెరో సిక్స్‌ బాదడంతో ఆ ఓవర్‌లో మొత్తం 16 పరుగులు రాబట్టారు. నోర్జే వేసిన చివరి ఓవర్‌లో జడేజా రెండు సిక్స్‌లతో చెలరేగిపోయాడు. ఆ ఓవర్‌లోనూ మొత్తం 16 పరుగులు వచ్చాయి. దీంతో నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి చెన్నై 179 పరుగులు చేసింది.