May 14,2022 07:48

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి -డీగో మారడోనా ప్రాంగణం (కొల్‌కతా) నుంచి భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్‌ఐ) పదకొండవ ఆలిండియా మహాసభలు అత్యంత ఉత్సాహ పూరితమైన వాతావరణంలో శుక్రవారం నాడిక్కడ ప్రారంభమయ్యాయి. దేశ నలు మూలల నుంచి 528 మంది యువజన సమాఖ్య ప్రతినిధులు ఈ మమహాసభలో పాల్గొన్నారు. వీరిలో 20 శాతం మంది మహిళా ప్రతినిధులు. కాగా ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి ఇద్దరు మహిళలతో సహా 15 మంది డెలిగేట్లతో కూడిన బృందం పాల్గొంది. మహాసభ ప్రాంగణానికి ప్రపంచ ఫుట్‌బాల్‌ దిగ్గజం డీగో మారడోనా పేరును, ప్రతినిధుల సభ హాలుకు షహీద్‌ మంచ్‌ అని నామకరణం చేశారు. ప్రతినిధులు, కార్యకర్తల సమక్షంలో డివైఎఫ్‌ఐ పతాకాన్ని డివైఎఫ్‌ఐ అధ్యక్షుడు, కేరళ టూరిజం శాఖ మంత్రి మహ్మద్‌ రియాజ్‌ ఆవిష్కరించారు. ప్రముఖ జర్నలిస్టు శశికుమార్‌ మహాసభలో ప్రారంభోపన్యాసం చేశారు. తొలుత ఆహ్వాన సంఘం అధ్యక్షులు, బెంగాల్‌ సినీ నటుడు సతీష్‌ స్వాగతోపన్యాసం చేశారు.మూడు రోజుల పాటు జరిగే మహాసభలో తొలి రోజున నిరుద్యోగం, సామ్రాజ్యవాదం, జమ్ము కాశ్మీర్‌ పునర్నిర్మాణం, పాలస్తీనాకు సంఘీభావం పై నాలుగు తీర్మానాలను ప్రతిపాదించారు. గత మూడేళ్లలో డివైఎఫ్‌ఐ కార్యకలాపాలను సమీక్షిస్తూ, రానున్న మూదేళ్లలో అనుసరించాల్సిన విధానానికి సంబంధించిన కార్యదర్శి నివేదికను డివైఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి అభరు ముఖర్జీ ప్రవేశపెట్టారు. దీనిపై చర్చ శనివారం జరుగుతుంది. మహాసభకు అధ్యక్షవర్గంగా ఎంఎ రహీం, మీనాక్షి ముఖర్జీ, బాల, సంజరు పాశ్వాన్‌ వ్యవహరిస్తున్నారు. డివైఎఫ్‌ఐ మహాసభలు జయప్రదం కావాలని ఆకాంక్షిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి మయూక్‌ బిశ్వాస్‌, ఐద్వా ప్రధాన కార్యదర్శి మరియం థావలే, సిఐటియు ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ సౌహార్థ సందేశమిచ్చారు. మహాసభకు అతిధులుగా డివైఎఫ్‌ఐ వ్యవస్థాపక కార్యదర్శి హన్నన్‌ మొల్లా, మాజీ కార్యదర్శి సలీం, మాజీ అధ్యక్షుడు ఎంఎ బేబి, తపన్‌ సిన్హ తదితరులు హాజరయ్యారు.