Jul 03,2022 23:45

భీమిలి బీచ్‌లో వ్యర్థాలను తొలగిస్తున్న కలెక్టర్‌ మల్లికార్జున తదితరులు

ప్రజాశక్తి- భీమునిపట్నం : ఆదివారం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు స్థానిక సాగర తీరాన చేపట్టిన బీచ్‌ క్లీనింగ్‌ ఉత్సాహంగా సాగింది. పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టిక్‌ను నిషేదించాలని, పర్యావరణాన్ని కాపాడాలన్న నినాదంతో ''సాగర తీర స్వచ్చత'' పేరిట చేపట్టిన కార్యక్రమం విజయ వంతమైంది. కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, జివిఎంసి కమిషనర్‌ డాక్టర్‌ జి లక్ష్మీ శ, జాయింట్‌ కలెక్టర్‌ విశ్వనాథన్‌, జెడ్సీ ఎస్‌.వెంకటరమణ, తహసీల్దార్‌ కెవి ఈశ్వరరావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ బి.మహాలక్ష్మినాయుడు, సిఐ కె.లక్ష్మణమూర్తి, ఎండిఒ పి.వెంకట రమణ తది తరులు పాల్గొన్నారు. కలెక్టర్‌ మల్లికార్జున పిలుపు మేరకు నిర్వహించిన బీచ్‌ క్లీనింగ్‌ కార్యక్రమంలో సిహెచ్‌సి, పిహెచ్‌సి వైద్య, ఆరోగ్య సిబ్బంది, వివిధ స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని బీచ్‌లోని వ్యర్ధాలను వెంట తీసుకొచ్చిన గోనె సంచుల్లో వేశారు. పర్యావరణాన్ని కాపాడతాం అంటూ కలెక్టర్‌, జివిఎంసి కమిషనర్‌, జాయింట్‌ కలెక్టర్‌ తదితరులు ప్రతిజ్ఞ చేశారు. వీరితో పాటు విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ప్లాస్టిక్‌ను నిషేధించాలి, పర్యావరణాన్ని కాపాడండి అంటూ స్థానిక పాత బస్టాండ్‌ నుంచి బీచ్‌లో ఉన్న ముఖ ద్వారం వరకు విద్యార్థులు తొలుత ర్యాలీ నిర్వహించారు.
త్వరలో మరిన్ని డస్ట్‌ బిన్లు: కలెక్టర్‌
బీచ్‌లో త్వరలో మరిన్ని డస్ట్‌బిన్లు ఏర్పాటుచేయనున్నట్లు కలెక్టర్‌ ఎ మల్లికార్జున తెలిపారు. ప్లాస్టిక్‌ వాడకం వల్ల కలిగే అనర్థాలపై బీచ్‌లోని చిరు వ్యాపారులు అవగాహన పెంచుకోవాలన్నారు. బీచ్‌ క్లీనింగ్‌ అనేది నిరంతర ప్రక్రియగా కొనసాగాలని సూచించారు.