Apr 07,2021 21:01

అమరావతి బ్యూరో : ఉత్తరాంధ్ర జిల్లాల్లోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని సిఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారు. వంశధార నదిపై చేపట్టనున్న నేరడి బ్యారేజీ నిర్మాణంపై ఒడిశాతో ఉన్న సమస్యను పరిష్కరించుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. తాడేపల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఆయన రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా వంశధార, నాగావళి, వంశధారలో ఫేజ్‌-2 పనుల వివరాలతో పాటు ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో చేపట్టిన ప్రాజెక్టుల వివరాలను అధికారులను సిఎం అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో సాగు, తాగునీటిని అందించే వంశధార, నాగావళి, వంశధార స్టేజ్‌-2, మహేంద్ర తనయ, మడ్డువలస ఫేజ్‌-2, తారకరామ సాగర్‌ ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలవరంలో కాఫర్‌ డ్యామ్‌లో ఖాళీలు పూర్తి, అప్రోచ్‌ ఛానల్‌, స్పిల్‌ ఛానల్‌, గేట్ల పూర్తి, మెయిన్‌ డ్యామ్‌ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. రానున్న 45 రోజులు అత్యంత కీలకమని, వర్షాలు వచ్చేలోగా పనులు అత్యంత వేగంగా, సమర్థవంతంగా జరగాలని ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టులో పునరావాస కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా ప్రభుత్వం నిర్ధేశించుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకులో టన్నెల్‌-2, వెలిగొండ హెడ్‌ రెగ్యులేటర్‌-1, వెలిగొండ హెడ్‌ రెగ్యులేటర్‌-2, రాయలసీమ కరువు నివారణ కింద చేపట్టనున్న ప్రాజెక్టులు, అలాగే పల్నాడు ప్రాంతంలో కరువు నివారణకు చేపట్టనున్న ప్రాజెక్టు పనులపై సమీక్షించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, నీటిపారుదల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌, ఇఎన్‌సి సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గన్నారు.