Oct 13,2021 15:59

కొల్లం : రెండో పెళ్లికి అడ్డుగా ఉన్నదని కట్టుకున్న భార్యని పాముకాటుతో చంపించిన భర్తకు కేరళలోని ఓ సెషన్స్‌ కోర్టు రెండు జీవిత ఖైదుల శిక్ష విధించింది. ఈ కేసులో భర్త సూరజ్‌ని దోషిగా న్యాయస్థానం తేల్చింది. ఈ మేరకు శిక్షను ఖరారు చేసి తీర్చునిచ్చింది. ఈ సందర్భంగా సెషన్స్‌కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మనోజ్‌ మాట్లాడుతూ.. 'ఈ కేసు అత్యంత అరుదైన కేసు. ఈ నేరం చేసినందుకు దోషికి మరణశిక్ష విధించాలి. అయితే అతని వయసును (28)ని దృష్టిలో ఉంచుకొని జీవిత ఖైదు శిక్ష విధిస్తున్నాం' అని ఆయన అన్నారు. సూరజ్‌ నేరం చేసి సాక్ష్యాలను నాశనం చేసినందుకు మరో ఐదేళ్లు, గతంలో తన భార్యపై హత్యాయత్నం చేసినందుకు 10 ఏళ్లు జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఈ 17 ఏళ్లు జైలు శిక్ష పూర్తయిన తర్వాతే రెండు జీవిత ఖైదుల శిక్ష మొదలవుతుందని కోర్టు వెల్లడించింది. ఈ శిక్షలతోపాటు అతనికి రూ. 5.85 లక్షల జరిమాను కూడా విధించింది.
కేసు వివరాల్లోకి వెళితే..
కేరళలోని కొల్లం జిల్లా అంచల్‌ ప్రాంతానికి చెందిన ఉత్రాకు అదే ప్రాంతానికి చెందిన సూరజ్‌ కుమార్‌తో 2018లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. సూరజ్‌ ఉత్రాతో కొన్నేళ్లు బాగానే ఉన్నా.. తర్వాత మరో అమ్మాయిని వివాహం చేసుకోవాలనుకున్నాడు. దీనికి తన భార్య అడ్డుగా ఉందని.. పథకం ప్రకారం హత్య చేసేందుకు కుట్రపన్నాడు. తన చేతికి మట్టి అంటకుండా పథకం ప్రకారం పాములపట్టేవాడి చేత ఓ నాగుపాముని తీసుకొచ్చి ఉత్రా నిద్రిస్తున్న సమయంలో ఆమెపైకి వదిలాడు. పాము రెండుసార్లు కాటువేయడంతో ఆమె నిద్రలోనే మరణించింది. ఈ హత్యను అతను ప్రమాదంగా చిత్రీకరించాడు. అయితే ఉత్రా గతంలోనూ పాము కాటుకి గురికావడంతో ఆమె మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. అల్లుడిపై అనుమానమొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సూరజ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగులోకొచ్చింది.