
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ సోమవారం విజయవాడలో మహాధర్నాకు అంగన్‌వాడీలు సిద్ధమవుతున్న నేపథ్యంలో దీనిని భగం చేసేందుకు పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు చేయడాన్ని, నోటీసులు ఇవ్వడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిఓ నెంబరు 1కి వ్యతిరేకంగా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన పౌరహక్కుల సంఘాల నాయకులు ముప్పాళ్ల సుబ్బారావుతో సహా కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచారని తెలిపారు. మంగళగిరి, తాడేపల్లిలో సిపిఎం నాయకులనూ అరెస్టు చేశారని పేర్కొన్నారు. న్యాయమైన కోర్కెలను రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి విజయవాడ బయలుదేరుతున్న కాటికాపర్లు, శ్మశానకార్మికులనూ అరెస్టు చేస్తున్నారని పేర్కొన్నారు. కెవిపిఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఒ.నల్లప్పను నిరోధించారని వివరించారు. ముఖ్యమంత్రి తిరువూరు పర్యటన సందర్భంగా ఎన్‌టిఆర్ జిల్లాల్లో అనేక మందిని అక్రమంగా అరెస్టు చేశారని, చనిపోయిన వారి బంధువులను పలకరించడానికి వెళ్తున్న వారినీ అరెస్టు చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఇప్పటికైనా అప్రజాస్వామిక చర్యలకు స్వస్తి చెప్పి ప్రజల వాక్కును వినాలని కోరారు. శాసనమండలి ఎన్నికల ఫలితాల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి మార్చుకోకుండా నిరంకుశ పద్ధతులతో ప్రజాగళాన్ని అణచివేయాలనుకోవడం అవివేకమని పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని తక్షణం విడుదల చేయాలని, నోటీసులను ఉపసంహరించుకోవాలని శ్రీనివాసరావు డిమాండు చేశారు.
- ప్రజాతంత్ర వాదులు ఖండించాలి : సిపిఐ
చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని అరెస్టులతో ఆపాలనే ప్రభుత్వ చర్యలను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఖండించారు. ప్రజాతంత్ర వాదులందరూ ఖండించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలకు పాల్పడటం సరికాదని పేర్కొన్నారు. శాంతియుత ఉద్యమంపై పోలీసులతో ఉక్కుపాదం మోపడం తగదని, జిఓ నెంబరు 1ని తక్షణమే రద్దు చేయాలని కోరారు.