Nov 30,2022 23:28
ఉప్పుటూరు-పర్చూరు వద్ద వాగుకు పడిన గండి

ప్రజాశక్తి-పర్చూరు: నెల రోజుల క్రితం కురిసిన వరుస వర్షాలకు పర్చూరు వాగు తీవ్రంగా ప్రవహించటంతో పర్చూరు పరిసరాల్లో అనేక చోట్ల గండ్లుపడ్డాయి. వరద నీరు పొలాలను ముంచెత్తటంతో పాటు వీరన్నపాలెం, కొమర్నేనివారిపాలెం, పోతుకట్ల తదితర గ్రామాలను చుట్టుముట్టింది. అప్పట్లో పైర్లు వేయకపోవటంతో రైతులకు పెద్దనష్టం జరగలేదు. రెండు వారాలుగా రబీలో పైర్ల సాగు ఊపందుకుంది. దాదాపు 75 శాతం భూముల్లో మొక్కజొన్న, మిరప, పొగాకు, తదితర పైర్లు వేశారు. గండ్లు పడి దాదాపు నెలరోజులు గడుస్తున్నప్పటికీ మరమ్మతులు చేసేందుకు డ్రైనేజీ శాఖ అధికారులు చర్యలు తీసుకోలేదు. అల్పపీడన ప్రభావాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తుండటంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ప్రస్తుతం వాగు ఉధృతంగా ప్రవహిస్తే గండ్లు పడిన ప్రాంతాల నుంచి వరదనీరు పొలాలను ముంచెత్తే ప్రమాదం పొంచి ఉంది. ఉప్పుటూరు కాలనీ వద్ద గండి పడినా పూడ్చకపోవటంతో వాగు నీటి ప్రవాహం పెరిగితే కాలనీవాసులు తీవ్ర ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. పర్చూరు, ఉప్పుటూరు, నాగులపాలెం పొలిమేర్లలోని పుట్ట దగ్గరలో పడిన గండి వద్ద మలుపు ఉన్నందున మరోసారి వాగు పొంగితే కట్టలు తెగటంతోపాటు దగ్గరలో ఉన్న పొలాలు కోతకు గురయ్యే ప్రమాదం ఉంది. పర్చూరు-కారంచేడుల మధ్య మరో నాలుగు చోట్ల గండ్లు పడ్డాయి. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు లేవని రైతులు వాపోతున్నారు. మిరప మొక్కలు నాటేందుకు ఎకరాకు రూ.30 వేలు, కౌలు రూ.20 నుంచి రూ.25 వేలు పొగాకు వేసేందుకు రూ.30 నుంచి రూ.35 వేలు పెట్టుబడి పెట్టారు. ఎరువులు, దుక్కులు దున్నటం తదితర ఖర్చులు వీటికి అదనం. ప్రస్తుతం వాగు పొంగితే కోలుకోలేకుండా నష్టపోతామని ఆందోళనకు గురవుతున్నారు. ఇదే జరిగితే వేల ఎకరాల్లో పైర్లు దెబ్బతినటమే కాకుండా గ్రామాలు వరద ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. ఏపుగా పెరిగిన అడవి తుమ్మ చెట్లు నీటి పారుదలకు ఆటంకం కలిగిస్తుండటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. తక్షణమే అధికారులు స్పందించి గండ్లు పూడ్చి అడవితుమ్మ చెట్లను తొలగించాలని రైతులు వేడుకుంటున్నారు.