Aug 04,2022 20:46

జులైలో 8 శాతం తగ్గిన రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ : 
 దేశ ఆర్థిక వ్యవస్థకు అద్దం పట్టే వాహన అమ్మకాలు డీలా పడ్డాయి.  ప్రస్తుత ఏడాది జులైలో వాహనాల రిజిస్ట్రేషన్‌ 8 శాతం పతనమై 14,36,927 యూనిట్లకు పరిమితమయ్యాయని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ (ఎఫ్‌ఎడిఎ) గురువారం వెల్లడించింది.  గతేడాది ఇదే నెలలో 15,59,106 యూనిట్లుగా నమోదయ్యాయి.  2019 జులై నాటి రిజిస్ట్రేషన్లతో పోల్చితే ఏకంగా 20 శాతం పడిపోయాయి.  ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన నెలలో ముఖ్యంగా ద్విచక్ర వాహన రిజస్ట్రేషన్లు ఏకంగా 11 శాతం క్షీణించి 10,09,574 యూనిట్లుగా నమోదయ్యాయి.  గ్రామీణ ప్రాంతాల్లో పేలవ డిమాండ్‌ చోటు చేసుకోవడమే ఇందుకు కారణం.  అధిక ద్రవ్యోల్బణం, హెచ్చు వాహన ధరలు, ప్రతికూల వాతావరణ తదితర అంశాలు పట్టణ ప్రాంతాల్లో డిమాండ్‌ను నిరుత్సాహపర్చాయి. ప్రయాణికుల వాహన అమ్మకాలు స్థూలంగా 5 శాతం తగ్గి 2,50,972 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి.  పండగ సీజన్‌ నేపథ్యంలో కొత్త మోడళ్లు రానున్న నేపథ్యంలో వచ్చే కొద్ది రోజుల్లో అమ్మకాలు పుంజుకునే అవకాశం ఉందని ఎఫ్‌ఎడిఎ అధ్యక్షుడు వింకేష్‌ గులాటీ పేర్కొన్నారు.  అనుహ్యాంగా తైవాన్‌ - చైనా మధ్య ఉద్రిక్తలు పెరిగితే చిఫ్‌ల కొరత ఏర్పాడి వాహన రంగంపై మరింత ప్రతికూల ప్రభావం పడొచ్చన్నారు. గడిచిన నెలలో ట్రాక్టర్‌ అమ్మకాలు ఏకంగా 28 శాతం పతనమై 82,419 యూనిట్లుగా చోటు చేసుకున్నాయి. త్రిచక్ర వాహన విక్రయాలు 80 శాతం పెరిగి 50,349 యూనిట్లుగా నమోదయ్యాయి.

ప్రస్తుత ఏడాది జులైలో ఈ పట్టణాల్లో నిరుద్యోగ శాతం 8.21 శాతానికి ఎగిసినట్లు సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సిఎంఐఇ) వెల్లడించింది. ఇంతక్రితం జూన్‌ మాసంలో ఇది 7.80 శాతంగా ఉందని పేర్కొంది. పరిశ్రమలు, సేవల రంగంలో ఉద్యోగాల కల్పన తగ్గడమే ఇందుకు ప్రధాన కారణమని సిఎంఐఇ రిపోర్ట్‌ విశ్లేషించింది. మరోవైపు ప్రస్తుత ఏడాది జులైలో సేవల (సర్వీసు) రంగం కార్యకలాపాలు మందగించి.. నాలుగు నెలల కనిష్టానికి తగ్గాయి. సంస్థల మధ్య తీవ్రమైన పోటీ, ద్రవ్యోల్బణం, ప్రతికూల వాతావరణం సేవలపై ప్రభావం చూపిందని ఎస్‌ అండ్‌ పి గ్లోబల్‌ ఇండియా సర్వీసెస్‌ పిఎంఐ బిజినెస్‌ యాక్టివిటీ సూచీ తెలిపింది. ఈ పరిణామాలు ఆర్థిక వ్యవస్థలోని మందగమనాన్ని స్పష్టం చేస్తున్నాయి.