Oct 03,2022 19:17

సమావేశంలో మాట్లాడుతున్న సుభాష్‌ చంద్రబోస్‌

ప్రజాశక్తి - ఆదోని
రాజకీయంగా, సామాజికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వాల్మీకులను మానసికంగా దెబ్బ కొట్టేలా కించపరిస్తే ఉపేక్షించేది లేదని వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సుభాష్‌ చంద్రబోస్‌ హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని వాల్మీకి నగర్‌లోని మహర్షి వాల్మీకి ఆలయంలో వాల్మీకుల ఆత్మీయ కలయిక పట్టణ నాయకులు కిషోర్‌ అధ్యక్షతన నిర్వహించారు. వాల్మీకి కార్పొరేషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ మధుసూదన్‌, పోలీసు, హౌసింగ్‌ సొసైటీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ పొలకల్‌ రేణుక హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వేటగాడుగా, దారిదోపిడి దారుడిగా జీవితం ప్రారంభించిన వాల్మీకి మహర్షిగా మారి రామాయణనాన్ని రాశారని తెలిపారు. అలాంటి మహనీయుని గుణాలు అందిపుచ్చుకొని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వాల్మీకులు ఎదగాలని చెప్పారు. తమ ఐక్యతను గుర్తించిన రాజకీయ పార్టీలు ఇప్పుడిప్పుడే పదవుల కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇస్తున్నాయని తెలిపారు. గతంలో వాల్మీకులతో పోల్చుకుంటే ప్రస్తుతం జీవన శైలిలో మార్పు వచ్చిందన్నారు. స్థాయిని పెంచుకునే దిశగా ప్రతి ఒక్కరూ వ్యవహరించాలని కోరారు. ఇటీవల పట్టణంలో జనసేన నాయకులు మహేష్‌ యాదవ్‌ మాట్లాడిన పద్ధతి సరికాదన్నారు. వైసిపి పట్టణ అధ్యక్షులుగా ఉన్న దేవాను కించపరిచేలా దూషిస్తూ నాలుక చీల్చి వేస్తామని మీడియా పరంగా మాట్లాడడం తగదన్నారు. డాక్టర్‌ మధుసూదన్‌ మాట్లాడుతూ... ఈనెల 9న వాల్మీకి మహర్షి జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేందుకు ఆదేశాలు ఇచ్చిందన్నారు. బీసీలందరూ సమానం అన్న సంగతి తెలుసుకోవాలని, అప్పుడే ఐక్యతకు మారుపేరుగా ఉంటామని బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు తెలిపారు. వ్యక్తిగత దూషణలకు దిగి 139 బీసీ కులాల ఐక్యతను చెడగొట్టొద్దని హితవు పలికారు. కులసంఘాల నేతలు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని తెలిపారు. జనసేన, వైసిపి వ్యవహారాలు, ఆరోపణలు విమర్శల వరకే ఉండాలని చెప్పారు. విఆర్‌పిఎస్‌ నాయకులు రామాంజనేయులు, మల్లికార్జున, లింగప్ప, మాజీ జడ్‌పిటిసి రామ్‌ భీం నాయుడు, సింహం నాగేంద్ర, నారాయణ, సీనియర్‌ జర్నలిస్టు వెంకన్న, కౌన్సిలర్‌ సురేష్‌, నట్టేకల్‌ సర్పంచి రామాంజనేయులు, నాయకులు రామకృష్ణ, వికె.వెంకటేష్‌, జైపాల్‌, బిటి.లక్ష్మన్న, తిక్కన, చిన్న వీరప్ప, సుధాకర్‌, బాబు, బ్రహ్మ, లక్ష్మీనారాయణ ఉన్నారు.