Jan 09,2022 12:44

'తాతయ్యా కాసేపు యిది పట్టుకోండి' అంటూ ఆరేళ్ల మనవరాలు చేతిలో ఏదో పెట్టడంతో యాదాలాపంగా అందుకున్నాడు అనంతయ్య.
అదొక చిన్న చాక్లెట్‌ బార్‌. రంగురంగుల రేపర్‌లోంచి ఊరిస్తున్నట్లుగా కనిపిస్తోంది.
బూట్లు వేసుకుని వచ్చిన మనవరాలు అనంతయ్య చేతిలోంచి చాక్లెట్‌ తీసుకుంది. అది ఇండియాలో దొరికే చాక్లెట్‌ కాదు.
'ఎక్కడిదమ్మా ఈ చాక్లెట్‌ నీకు?' అడిగేడు అనంతయ్య కుతూహలంగా.
'మొన్న అత్త వచ్చినప్పుడు ఇచ్చింది బాక్స్‌ నిండా' అని చెప్పి బేగ్‌ వీపుకి తగిలించుకుని, స్కూల్‌కి బయలుదేరి వెళ్ళిపోయింది మనవరాలు అప్పుడే వచ్చిన ఆటో ఎక్కి.
అత్త అంటే అనంతయ్య కూతురు గౌరి. పెళ్ళై పోయి భర్త ఉద్యోగరీత్యా గత నాలుగేళ్లుగా స్విట్జర్లాండ్‌లో ఉంటోంది.
ఏడాదికోసారి అమ్మా-నాన్నల్ని, అత్తా-మావల్ని చూడడానికి కుటుంబ సమేతంగా వచ్చి ఓ యిరవై రోజులుండి వెళ్లి పోతుంటారు వాళ్ళు.
నెల రోజుల క్రితం భర్త, తొమ్మిదేళ్ల కొడుకుతో సహా ఇండియా వచ్చి మూడు వారాలు కులాసాగా గడిపి వెళ్ళిపోయింది గౌరి. అప్పుడు తెచ్చి యిచ్చినట్లుంది ముద్దుల కోడలికి ఈ చాక్లెట్లు అనుకున్నాడు అనంతయ్య.
స్విట్జర్లాండ్‌ చాక్లెట్లకు ప్రసిద్ధి అని తెలుసు అనంతయ్యకు. ఆ చాక్లెట్లు అనేక మధురమైన రుచుల్లో ఎంతో బావుంటాయని కూతురు వాళ్లమ్మతో చెబుతుండగా విన్నాడు తను.
అనంతయ్యకు ఆ చాక్లెట్‌ మీద మనసయ్యింది. ఒక చాక్లెట్‌ అయినా తినాలన్న తపన కలుగుతోంది.
కుర్చీలోంచి లేచి వెళ్లి తిను బండారాల డబ్బాలు ఉంచే అలమర వద్దకు వెళ్లి తలుపు తెరిచి చూశాడు. చిన్న చిన్న ప్లాస్టిక్‌ డబ్బాల్లోంచి ఏవేవో చిరుతిళ్ళు కనిపించాయి గానీ చాక్లెట్ల జాడ లేదు ఆ అలమరలో.
ఉసూరుమంటూ వచ్చి పడక్కుర్చీలో కూలబడి పేపర్‌ అందుకున్నాడు. కానీ పేపర్‌ మీద దృష్టి, మనసూ రెండూ నిలవడం లేదు. మనసంతా చాక్లెట్‌ చుట్టూనే తిరుగుతోంది.
మరునాడు ఉదయం స్కూల్‌ కి తయారవుతున్న మనవరాలి దగ్గరకు వెళ్లాడు అనంతయ్య.
'తల్లీ నిన్న నువ్వు స్కూల్‌కి చాక్లెట్‌ తీసుకు వెళ్లావు కదా. అలాంటి చాక్లెట్‌ ఇంకోటుందా నీ దగ్గర' ఆశగా అడిగాడు.
'ఓ ఉంది. అమ్మ రోజూ స్కూల్‌కి వెళ్లేటప్పుడు ఇస్తుంది కదా స్కూల్లో తినడానికి' అంటూ బ్యాగ్‌లోంచి చాక్లెట్‌ బార్‌ తీసి చూపించింది.
అనంతయ్య కళ్లు మెరిశాయి. ఆకర్షణీయంగా రంగురంగుల రేపర్లో నుంచి మెరుస్తూ నోరూరించేలా కనిపిస్తున్న మృదువైన ఆ చాక్లెట్‌ని చూసి.
'నాకో చిన్న ముక్క యిస్తావా తల్లీ?' నెమ్మదిగా అడిగేడు యింకెవరికీ వినబడకూడదన్నట్టు.
'అబ్బా! యిది నేను స్కూల్లో తినడానికి మా అమ్మ యిచ్చింది. నేనివ్వను' అంటూ ఆ చాక్లెట్‌ తిరిగి బ్యాగ్‌లో పెట్టేసుకుని ఆటో ఎక్కి స్కూల్‌కి వెళ్ళిపోయింది మనవరాలు.
నిరాశ పడ్డాడు అనంతయ్య.
అలమరలో కాకుండా యింకెక్కడ పెట్టారు వీళ్లు ఆ చాక్లెట్ల డబ్బా అని ఆలోచిస్తూ - యింకేదో వెతుకుతున్న వాడిలా అన్ని అలమరలూ తెరిచి గాలించడం మొదలుపెట్టాడు అనంతయ్య.
ఊహు! ఎక్కడా ఆ చాక్లెట్ల డబ్బా కనిపించ లేదు.
ఇక ఉండబట్టలేక పోయాడు అనంతయ్య.
నెమ్మదిగా వంటగదిలోకి నడిచాడు. వంటగదిలో భార్య రమణి టిఫిన్లు తయారు చేసే హడావిడిలో ఉంది.
'రమణీ'.. 'రమణీ' అని పిలిచాడు అనంతయ్య భార్యని.
'ఊ..' అంది రమణి పని చేసుకుంటూనే.
'మరి - మొన్న మన గౌరి వచ్చినప్పుడు స్విట్జర్లాండ్‌ నుంచి పాపకి చాక్లెట్లు తీసుకు వచ్చిందట కదా. ఒక చాక్లెట్‌ ఉంటే యిస్తావేంటి. తినాలని నాలుక పీకేస్తోంది' సందేహిస్తూనే అడిగాడు అనంతయ్య.
ఒక్క క్షణం తను చేస్తున్న పని ఆపి విస్తుపోతూ చూసింది రమణి భర్త వైపు.
'చాల్లెండి సంబడం. చాక్లెట్‌ కావాలట చాక్లెట్‌. తమరేం చిన్న పిల్లాడిని అనుకుంటున్నారా చాక్లెట్లు తినడానికి? తమరు రిటైరై నాలుగేళ్ళయింది. గుర్తుంచుకోండి. ముసలాడికి.. ఏదో అంటారు లెండి. అలా ఉంది మీ వ్యవహారం' ఈసడించి పారేసి తన పనిలో మునిగిపోయింది రమణి.
నిట్టూర్చి వెనక్కి తిరిగి మళ్ళీ పడక్కుర్చీలో కూలబడిపోయి పేపరందుకున్నాడు అనంతయ్య. మనసు పేపర్‌లోని వార్తల మీద లగం కాకపోయినా కష్టపడి ఎలాగో పేపర్‌ చదవడం పూర్తి అయిందనిపించాడు.
మరునాడు ఉదయం - మనవరాలు స్కూల్‌కి వెళ్లిపోయిన తరువాత నెమ్మదిగా కొడుకు గదిలోకి వెళ్లాడు అనంతయ్య.
'నాన్నా రాజూ' నెమ్మదిగా పిలిచాడు కొడుకుని.
డ్రెస్సింగ్‌ టేబుల్‌ ముందు నిలబడి తల దువ్వు కుంటున్నాడు రాజు.
'ఏంటి నాన్న గారూ. మందులేమైనా కావాలా?' అని అడిగేడు అద్దం మీద నుండి తల తిప్పకుండానే.
'అది కాదురా బాబూ. మొన్న చెల్లి వచ్చినప్పుడు నీ కూతురికి స్విట్జర్లాండ్‌ నుంచి చాక్లెట్ల డబ్బా తీసుకువచ్చి యిచ్చిందట కదా! అందులోంచి ఒక్క చాక్లెట్‌ యిస్తావా తినాలనిపిస్తోంది' అడిగాడు తటపటాయిస్తూనే అనంతయ్య.
తల దువ్వుకోవడం ఆపి తండ్రి వైపు చూసి 'నాన్న గారూ! మీకు షుగర్‌ వ్యాధి ఉందన్న సంగతి మరచిపోయారా? షుగరు వ్యాధి పెట్టుకుని చాక్లెట్‌ తినడం ఎంత ప్రమాదమో మీకు తెలియదా?' అంటూ తన పని ముగించుకుని గదిలోంచి బయటకు వెళ్ళిపోయాడు కొడుకు రాజు.
మరో దీర్ఘమైన నిట్టూర్పు విడిచి తనూ ఆ గదిలోంచి బయటకు వచ్చేసి తను రోజులో ఎక్కువ సేపు గడిపే పడక్కుర్చీలో వాలిపోయాడు అనంతయ్య.
మనసులో కోరిక కలగనే కలగ కూడదు. ఒకసారి కలిగిందా - అది తీర్చుకునే వరకూ మనసు అస్థిమితమవుతుంది. వాంఛ తీరిన తరువాతే అది తృప్తి పడుతుంది.
ఆ సాయంత్రం - కొడుకు యింకా ఆఫీస్‌ నుంచి రాలేదు. భార్య వంటగదిలో రాత్రి వంటకు ఏర్పాట్లు చేసుకుంటోంది. మనవరాలు హాల్లో కూర్చుని హోమ్‌ వర్కు చేసుకుంటోంది.
కోడలు తమ గదిలో కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటోంది. ఆ గది గుమ్మం ముందు నిలబడి చిన్నగా దగ్గాడు అనంతయ్య.
పుస్తకంలోంచి తలెత్తి చూసిన కోడలు 'ఏంటి మావయ్యా! చెప్పండి' అంది చదువుతున్న పుస్తకం మధ్యలో వేలుపెట్టి మూసి.
'మరేం లేదమ్మా! మొన్న మీ ఆడపడుచు నీ కూతురికి స్విట్జర్లాండ్‌ నుంచి చాక్లెట్లు తెచ్చి యిచ్చిందట కదా. ఒక్క చాక్లెట్‌ యిస్తావేంటి. తినాలని మనసు లాగేస్తోంది' అడిగాడు సిగ్గువిడిచి బిడియపడుతూనే.
ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయింది కోడలు.
'ఆ చాక్లెట్లు యింకెక్కడ ఉన్నాయి మావయ్య గారూ! అన్నీ అయిపోయాయి కదా' అంది యింకొక్క మాటకు కూడా ఆస్కారం లేదన్నట్లుగా పుస్తకంలో మునిగిపోయి.
యింక నిట్టూర్చడం కూడా దండగ అనుకున్నాడో ఏమో -నిరాశగా వెనుదిరిగాడు అనంతయ్య.
మరునాడు ఉదయం స్కూల్‌కి వెళుతున్న మనవరాలి చేతిలోని చాక్లెట్‌ చూసి విరక్తిగా నవ్వుకున్నాడు అనంతయ్య.
కోడలు ఆ చాక్లెట్ల డబ్బా తమ గదిలోని బీరువాలో దాచుకున్నట్లు అర్థమయ్యింది ఆయనకు. ఆ చాక్లెట్లు మనదేశంలో ఎక్కడా దొరకవేమో కొనుక్కుని తిందామంటే. మరెలా తన కోరిక తీర్చుకోవడం? ఏం పాలు పోవడం లేదు అనంతయ్యకు. చటుక్కున ఓ ఆలోచన తట్టడంతో - నెమ్మదిగా తన గదిలోకి నడిచాడు. డ్రాయరు సొరుగు తెరిచి ఎయిర్‌ మెయిల్‌ కవరు ఒకటి బయటకు తీశాడు.
'ఫోనులో మాట్లాడడమే కాదు. అప్పుడప్పుడూ బోలెడు విశేషాలతో ఉత్తరాలు కూడా రాస్తుండండి నాన్నగారూ' అంటూ కొన్ని ఎయిర్‌ మెయిల్‌ కవర్లు యిచ్చి వెళ్లింది కూతురు. మొదటిసారి స్విట్జర్లాండ్‌ వెళుతున్నప్పుడే. అలా కొన్ని విశేషాలతో ఉత్తరాలు రాశాడు కూడా అనంతయ్య కూతురికి.
కూతురికి ఉత్తరం రాయడం మొదలు పెట్టాడు అనంతయ్య.
ప్రియమైన గౌరికి,
మీ నాన్న ఆశీస్సులతో రాయునది. నీవు, అల్లుడు, మనవడు కులాసాగా ఉన్నట్లు తలుస్తున్నాను. ఇక్కడి క్షేమ సమాచారాలు ఫోన్‌ ద్వారా మీ అమ్మ నుండి నీకు తెలుస్తూనే ఉన్నాయి కదా. నీకు ముఖ్యముగా రాయునది ఏమనగా ఈ సారి నువ్వు ఇండియా వస్తున్నప్పుడు నా కోసం కొన్ని స్విట్జర్లాండ్‌ చాక్లెట్లు తీసుకునిరా తల్లీ. నాన్నగారూ మీకు షుగర్‌ ఉంది కదా అనకు. మరేం పరవాలేదు. ఎప్పుడైనా ఓ చిన్న ముక్క స్వీట్‌ తిన్నా పరవాలేదని డాక్టర్లు కూడా చెబుతున్నారు కదా. అలా ఎప్పుడైనా ఓ చిన్న ముక్క నోట్లో పడేసుకుంటాను. మరిచి పోకుండా తీసుకువస్తావు కదూ! ఎదురుచూస్తుంటాను. అన్నట్టు నువ్వు నా కోసం తీసుకు రాబోయే చాక్లెట్లు నా చేతికి మాత్రమే యివ్వాలి. ఇంకెవరి చేతికీ యివ్వకూడదు గుర్తుంచుకో. మనవడికి ముద్దులు. అల్లుడికీ, నీకూ ఆశీస్సులు.
ప్రేమతో మీ నాన్న
కవర్‌ మీద అడ్రస్‌ రాసి గమ్‌తో కవర్‌ అంటించాడు. నాలుగు వీధుల అవతల ఉన్న పోస్ట్‌ ఆఫీస్‌కి నడిచి వెళ్లి ఉత్తరం పోస్ట్‌ బాక్స్‌లో వేసి వచ్చాడు. పై ఏడాది ఇండియా రాబోయే కూతురి కోసం ఎదురు చూస్తూ పడక కుర్చీలో వాలి విశ్రాంతిగా కళ్లు మూసుకున్నాడు అనంతయ్య.

కోనే నాగ వెంకట ఆంజనేయులు
92906 60220