Feb 22,2021 09:41

భద్రాద్రి కొత్తగూడెం : మామూలుగా గడ్డిని జంతువులే తింటాయి. పండించిన ఆకుకూరలు మాత్రమే మనుషులు తింటారు. కానీ తెలంగాణలోని ఓ గ్రామస్తులు ఆహారంగా గడ్డిని తింటున్నారు. పేదరికంతో అలా తింటున్నారేమో అనుకుంటే పొరపాటే.. గడ్డిలో బలవర్ధకమైన పోషకాలు అందులో ఉంటాయని వారి నమ్మకం. అందుకే వారానికి మూడు, నాలుగు రోజులు ఆహారంలో గడ్డిని తీసుకుంటారు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. అశ్వాపురం మండలం, గొందిగూడెం పంచాయతీ పరిధిలోని గుండ్లమడుగులో నివసిస్తున్న 30 కుటుంబాలూ ఆహారంలో గడ్డిని ఉపయోగిస్తున్నారు. అన్నంలోకి గడ్డికూర ఉంటే ఆ రోజు కుటుంబసభ్యులంతా విందు భోజనంగా భావిస్తారు. పచ్చి గడ్డితో కూరలు చేసుకోవడంతోపాటు పప్పులో కూడా వేసుకుంటారు. పచ్చడి చేసుకుంటారు. ఇక, ఎండిన గడ్డిని పొడి చేసుకొని నీటిలో కలుపుకొని తాగుతారు. ఇలా ఎందుకు చేస్తున్నారా అని ఆరా తీస్తే.. ఆహారంలో గడ్డిని తీసుకోవడం వల్ల శరీరానికి బలవర్ధకమైన పోషకాలు లభిస్తాయని అంటున్నారు. ఈ విషయమై మణుగూరు మండల వైద్యాధికారి మౌనిక మాట్లాడుతూ.. గోదావరి తీరంలో పారే వాగుల ఒడ్డున ఈ గడ్డి ఎక్కువగా లభిస్తుందని, ఆకుకూరల మాదిరిగానే ఇందులో పోషక విలువలుంటాయని చెబుతున్నారు. జిల్లా ఉద్యాన అధికారి మరియన్న మాట్లాడుతూ.. గిరిజన ప్రాంతాల్లో ఈ గడ్డిని ఈనకూరగా పిలుస్తారని, ఇది లిలియేసి జాతికి చెందినదని తెలిపారు. ఈ గడ్డిలో బి12 విటమిన్‌తో పాటు ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయని, దీన్ని తినడం వల్ల ప్రయోజనాలే ఉంటాయని చెబుతున్నారు.