
ప్రజాశక్తి- ఆమదాలవలస: మున్సిపాలిటీ ఏర్పడి సుమారు 30 ఏళ్లు గడిచిపోయింది. ఇప్పటి వరకు ఐదు పాలకవర్గాలు పదవీ కాలాన్ని పూర్తి చేసుకున్నారు. కానీ, వార్డుల్లో రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. పేరుకే మున్సిపాలిటీ, కానీ, వార్డుల్లో రోడ్ల పరిస్థితి చూస్తే పరమ అధ్వానంగా ఉన్నాయనే చెప్పాలి. శివారు వార్డుల్లోని రోడ్లు, డ్రెయినేజీల గురించి అసలు ఏమీ చెప్పనక్కర్లేదని పాలకులు, అధికారులు తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పాలకవర్గాలు ఏర్పడినప్పుడల్లా మొట్టమొదటిగా చెప్పే మాట ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ కర్తవ్యమని అంటారు. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి నీటి మీద రాతలే అని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. చాలా వార్డ్లుఓ్ల గతంలో వేసిన సిసి రోడ్లు సైతం శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకటో వార్డు పరిధిలోని తిమ్మాపురం, పార్వతీశంపేట, హుదూద్ కాలనీల్లో డ్రెయినేజీ, సిసి రోడ్లు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. బి.ఆర్ నగర్‌లో కొన్నేళ్లుగా డ్రెయినేజీ, సిసి రోడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు. పలుమారులు పాలకుల, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్యకు మోక్షం లభించడం లేదని అక్కడి ప్రజలు వాపోతున్నారు. 2008లో అప్పటి ఎమ్మెల్యే బొడ్డేపల్లి సత్యవతి హయాంలో సొట్టవానిపేట శివారున ఇందిరమ్మ ఇళ్లు పంపిణీలో భాగంగా పేదలకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలు పంపిణీ చేసింది. కానీ, అక్కడ రోడ్లు డ్రెయినేజీ వ్యవస్థ లేక ప్రజలు నరకాన్ని చవిచూస్తున్నారు. మున్సిపాలిటీకి పన్నుల రూపేనా లక్షల రూపాయలు ప్రజలు చెల్లిస్తున్నా... మౌలిక సదుపాయాలు కల్పించడం లో అధికారులు పాలకులు విఫలమవుతున్నారని పలువురు బహిరంగంగా విమర్శిస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులు కొన్ని వార్డుల్లో వెచ్చించి సిసి రోడ్లు, డ్రెయినేజీలకు శంకుస్థాపన చేసినా పనులు ముందుకు కదలని పరిస్థితి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు ప్రత్యేక దృష్టిసారించి మౌలిక సదుపాయాల కల్పించాలని వార్డుల్లోని ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు.