
ప్రజాశక్తి-బొబ్బిలి : మున్సిపాలిటీలో టిడిపి కౌన్సిలర్లు ఉన్న వార్డుపై వివక్షత చూపడం అన్యాయమని ఆ పార్టీ కౌన్సిలర్లు రాంబార్కి శరత్, గెంబలి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌన్సిల్ హాల్లో బుధవారం చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ, అత్యవసర సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తున్నామని చెపుతున్న వైసిపి నాయకులు మున్సిపాలిటీలో టిడిపి వార్డులపై వివక్షత చూపడం అన్యాయమన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించకపోతే పట్టాలు రద్దు చేస్తామని బెదిరించడం దుర్మార్గమన్నారు. జగనన్న కాలనీలో మౌలిక సౌకర్యాలు లేకపోతే ఇల్లు ఎలా కడతారని ప్రశ్నించారు. దాడితల్లి కాలనీలో విద్యుత్ వైర్లు ఏర్పాటు చేయాలని కౌన్సిలర్ కాకల గోవిందమ్మ కోరారు. వైసిపి కౌన్సిలర్ ఇంటి గోవిందరావు మాట్లాడుతూ అభివృద్ధి పనులకు సింగిల్ టెండర్లు వస్తున్నాయని, లోకల్ కాంట్రాక్టర్లు ఎందుకు టెండర్లు వేయడం లేదని ప్రశ్నించగా కాంట్రాక్టర్లు టెండర్లు వేసి పనులు చేసేందుకు ముందుకు వస్తున్నారని డిఇ రవికుమార్ చెప్పారు. అభివృద్ధి పనులు పర్యవేక్షణకు బందాలను ఏర్పాటు చేయాలని వైసీపీ కౌన్సిలర్ చోడిగంజి రమేష్ నాయుడు కోరారు. టిడ్కో ఇల్లు రద్దు చేసిన లబ్ధిదారులకు డిడిలు వెనక్కి ఇవ్వాలని కౌన్సిలర్ వాడపల్లి వనజకుమారి కోరగా సమస్య ఎమ్మెల్యే దృష్టిలో ఉందని త్వరలో పరిష్కారం చేస్తామని మున్సిపల్ కమిషనర్ ఎస్.శ్రీనివాసరావు అన్నారు. మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణ మాట్లాడుతూ అన్ని వార్డులనూ అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపల్ స్టాండింగ్ కమిటీ న్యాయవాదిగా డి.అప్పలరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మున్సిపల్ వైస్చైర్మన్లు చెలికాని మురళి, జ్.రమాదేవి, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.