Jul 26,2021 19:02

ప్రపంచ గమనాన్ని, పాలకుల దురాగతాల్ని కళ్లకు కట్టినట్లు చూపించింది ఆ కెమెరా. సిరియా అంతర్యుద్ధం, రోహింగ్యా శరణార్థుల దీనగాథలు, మత ఘర్షణలు, ఉత్సవాలు, సంబరాలు .... ఇలా ఒకటేమిటి .. ప్రతి ఒక్క అంశం మన దృష్టికి తెచ్చింది. దేశంలో జరుగుతున్న మత ఘర్షణలు, పాలకుల దుశ్చర్యలకు బలౌతున్న సామాన్యులు, తప్పుల తడకల కోవిడ్‌ మృతుల లెక్కలను తోసిరాజంటూ మహమ్మారి కబంధహస్తాల్లో చిక్కుకున్న అశేష భారతావని చితిమంటల చిత్రాలు అందులో నుంచే చూశాం. కానీ ఇక ముందు అటువంటి దృశ్యాలు ఆశించలేం. ఆ కెమెరానే తన కన్నుగా చేసుకుని ప్రపంచ పోకడలను ఎలుగెత్తి చాటిన ధీరుడు, రాయిటర్స్‌ ఫొటో జర్నలిస్టు డానిష్‌ సిద్ధిఖీ తాలిబన్ల కాల్పుల్లో ఇటీవల అమరుడయ్యారు.
 

కుటుంబం
1983 మే 19న ఢిల్లీలో సిద్ధిఖీ జన్మించారు. జర్మన్‌ యువతి రైక్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు పిల్లలు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించే సిద్ధిఖీ పులిట్జర్‌ ప్రదానోత్సవంలో పిల్లలను గుర్తు చేసుకున్నారు. 'చాలా భావోద్వేగ వ్యక్తి. తెలివైన, చురుకైనవాడు నా కొడుకు' అంటూ కొడుకు మరణవార్త విన్న సిద్ధిఖీ తండ్రి విషాద వదనంతో చెప్పారు. తను చేస్తున్న పని ఎంతో ప్రమాదమైందని తెలిసినా అందుకు ఏమాత్రం భయపడేవాడు కాదని పేర్కొన్నాడు.

ప్రపంచంలో ఏ మూల ఏది జరిగినా సిద్ధిఖీ అక్కడ ప్రత్యక్షమవుతాడు. ఆసియా, మిడిల్‌ ఈస్ట్‌, యూరప్‌లోని అనేక ప్రాంతాలను కవర్‌ చేసిన నేర్పరి. ఆప్ఘనిస్తాన్‌, ఇరాక్‌ యుద్ధాలు, రోహింగ్యా శరణార్థుల సంక్షోభం, హాంకాంగ్‌ నిరసనలు, నేపాల్‌ భూకంపాలు, ఉత్తరకొరియా మాస్‌ గేమ్స్‌, ఇంగ్లాండ్‌ ముస్లిం మత మార్పిడిలపై ఫొటో సిరీస్‌ ఇలా చెప్పుకుంటూ పోతే రాయిటర్స్‌ జర్నలిస్టుగా గత పదేళ్లుగా ఆయన చిత్రీకరించిన ఫొటోలన్నీ సెన్షేషనలే. ఆయన తీసిన ఫొటోలే కాదు, రచనలు కూడా జాతీయ, అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.

నేషనల్‌ జియోగ్రాఫిక్‌ మ్యాగజైన్‌, న్యూయార్క్‌ టైమ్స్‌, దిగార్డియన్‌, ది వాషింగ్టన్‌ పోస్ట్‌, వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌, టైమ్‌ మ్యాగజైన్‌, ఫోర్బ్స్‌, న్యూస్‌వీక్‌, ఎన్‌పిఆర్‌, బిబిసి, సిఎన్‌ఎన్‌, అల్‌ జజీరా, సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌, ది స్ట్రెయిట్స్‌ టైమ్స్‌, బ్యాంకాక్‌ పోస్ట్‌, సిడ్నీ మార్నింగ్‌ హెరాల్డ్‌, ది లా టైమ్స్‌, బోస్టన్‌ గ్లోబ్‌, ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌, లే ఫిగరో, లే మోండే, డెర్‌ స్పీగెల్‌, స్టెర్న్‌, బెర్లినర్‌ జైటంగ్‌, ది ఇండిపెండెంట్‌, ది టెలిగ్రాఫ్‌, గల్ఫ్‌ న్యూస్‌, లిబరేషన్‌ వంటి దిగ్గజ మ్యాగజైన్లలో ఆయన రచనలు ప్రచురితమయ్యాయి.

నోట్ల రద్దు, వలస కార్మికుల కష్టాలు, పాలకుల నల్లచట్టాలకు బలౌతున్న రైతన్నల సుదీర్ఘ పోరాట దృశ్యాలు, కోవిడ్‌ సమయంలో దేశంలో నెలకొన్న అనిశ్చితి ... ఇలా ప్రజల సాదకబాధలను వెలుగు లోకి తేవాల్సిన ప్రధాన మీడియా స్రవంతి పాలకు లకు దాసోహమంటున్న వేళ ... ఆ నిజాలను నిర్భీతిగా వెలుగులోకి తెచ్చాడు. ఆక్సిజన్‌ కొరత, వైద్య సంరక్షణా లేమితో మరణిస్తున్న లెక్కకురాని కోవిడ్‌ మృతులు, కుప్పలుగా కాలుతున్న శవాలను ప్రపంచ మీడియా దృష్టికి తెచ్చాడు.

వాస్తవ ప్రపంచం చూపించిన కెమెరా

సిద్ధిఖీ... జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీలో మాస్‌ కమ్యూనికేషన్స్‌ చేసి జర్నలిస్టుగా బాధ్యతలు చేపట్టి దేశంలో ప్రముఖ పత్రికకు, మీడియా చానెల్‌కు కరస్పాండెంట్‌గా పనిచేశారు. ఆ తరువాత 2010 నుంచి లండన్‌ ప్రముఖ వార్తా సంస్థ 'రాయిటర్స్‌'లో చీఫ్‌ ఫొటో జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. రాయిటర్స్‌ ప్రతినిధిగా గతేడాది ఢిల్లీ అల్లర్లను షూట్‌ చేసే క్రమంలో ముస్లిం వ్యక్తిని కొంతమంది హిందూ మూకలు దాడిచేయడం కెమెరాలో బంధించారు. ఆ ఫొటో అంతర్జాతీయ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ సందర్భంలో ముస్లిం అయిన సిద్ధిఖీపై కూడా ఆ మూక దాడికి ప్రయత్నించడం దాన్ని తప్పించుకుంటూనే ఆ దృశ్యాలను చిత్రీకరించారు ఆయన. ఈ సందర్భంగా ఆనాటి సంఘటన గుర్తుచేసుకుంటూ 'తన చిత్రాల్లో సత్యాన్ని చూపించేవాడు. అందుకోసం ఎంతటి కష్టమైనా భరించేవాడు. ఇప్పుడు కూడా తాలిబన్ల కాల్పుల్లో మరణించే ముందు వరకూ పనిలో భాగమవ్వడం అతనికే సాధ్యమైంది' అంటారు కో జర్నలిస్టు. 'నేను తీసిన ఫొటో సాధారణ వ్యక్తుల జీవన దృశ్యాలను ప్రతిబింబించాలి. ఆ దృశ్యం చూసిన ప్రతి ఒక్కరూ తనను తాను అక్కడ ఊహించుకోవాలి' అంటారు ఒక సందర్భంలో సిద్ధిఖీ.

వాస్తవ ప్రపంచం చూపించిన కెమెరాజర్నలిస్టులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్‌ బహుమతి 2018 రోహింగ్యా శరణార్థుల ఫొటోకు గాను అతన్ని వరించింది. వ్యయప్రయాసలకోర్చి బంగ్లాదేశ్‌ సరిహద్దుకు చేరుకున్న ఓ మహిళ ఇసుకలో కూలబడి నేలను తాకుతూ ఉంటుంది. ఆమె వెనక కొంతమంది పడవ నుంచి దిగుతూ, ఒకరికొకరు చేయి సాయం తీసుకుంటూ ఉంటారు. ఈ ఫొటోకే ఆయనకు బహుమతి లభించింది. 'ఆ దృశ్యం కెమెరాకు చిక్కాలంటే చాలా కష్టపడాల్సి వచ్చింది. శరణార్థుల పడవ తీరానికి చేరుకుంటుందన్న సమాచారం రాగానే బయలుదేరినా ఆ ప్రాంతానికి చేరుకోవడానికి 4 గంటల సమయం పట్టింది. అదీ పొలాల గుండా, బురదలో నడుస్తూ సరిహద్దుకు వెళ్లాం' అంటూ ఆ సందర్భంలో ప్రముఖ మ్యాగజైన్‌ ఫొర్బ్స్‌కు చెప్పారు సిద్ధిఖీ.

వాస్తవ ప్రపంచం చూపించిన కెమెరా

 

 

వాస్తవ ప్రపంచం చూపించిన కెమెరాతీరని విషాదం
2021 జులై 16న ఆయన మరణించారని ప్రకటించగానే ప్రపంచమీడియా ప్రముఖులు షాక్‌కు గురయ్యారు. సోషల్‌ మీడియా వేదికగా నివాళులర్పించారు. కుటుంబసభ్యులు, బంధువులే కాక, స్నేహితులు, జామియా విద్యార్థులు, ప్రొఫెసర్లు, జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రముఖులు వందలకొద్దీ ఆయన అంతిమయాత్రలో పాల్గన్నారు. 'ఆ మార్గంలో ఈ చెట్టుకిందే మేము టీ తాగేవాళ్లం' అంటూ ఓ స్నేహితుడు, 'సీనియర్‌గా ఆయన మాకు ఎంతో స్ఫూర్తినిచ్చారు' అంటూ యువ జర్నలిస్టులు, విద్యార్థులు ఇలా ఆ బృందంలో ఎవరిని కదిలించినా ప్రతిఒక్కరూ భావోద్వేగ వదనాలతో ఆయనను స్మరించుకున్నారు.

వాస్తవ ప్రపంచం చూపించిన కెమెరా