Feb 27,2021 06:45

''కథలు రాయటం ఎంత సులువో, అంత కష్టం కూడా. గాలిలో తేలిపోయే కథలు రాయడానికి పెద్ద శ్రమ వుండదు. ఊహల్లో అల్లుకున్న ఇతివృత్తాలతో కథలు రాయటమంటే మరీ సులభం. ఎటొచ్చీ జీవితం పట్ల పరిశీలన వుండీ, జీవితం నుండే ప్రేరణ పొందీ, జీవిత వాస్తవికతను పాఠకులకు అందించగలందుకు రాయటం మాత్రం కష్టమైన పనే అని నేను ఒప్పుకుంటాను''
 

(సింగమనేని: కథ రాయడం గురించి-1992)
ప్రసిద్ధ అభ్యుదయ కథా రచయిత, అభ్యుదయ సాహిత్య విమర్శకుడు, మార్క్సిస్టు చింతనాపరుడు సింగమనేని నారాయణ (25.2.21) కన్నుమూశారు. దాదాపు మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడ్డారు. సింగమనేని నారాయణ తెలుగులో అభ్యుదయ సాహిత్యం మొదలైన దశాబ్దానికి, ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడిన ఏడాదిలో 26-06-1943న జన్మించారు. విప్లవ సాహిత్యం పురుడు పోసుకుంటున్న నేపథ్యంలో రచనా రంగంలోకి ప్రవేశించారు. ఇటీవల గురజాడ అపార్టుమెంట్స్‌ కథతో కలం మూసిపెట్టారు. కలం మూసిపెట్టిన మూడు నెలలకు కన్నుమూశారు.


సింగమనేనిది వ్యవసాయ కుటుంబం. అనంతపురం జిల్లా లోని బండమీదపల్లిలో ఆయన జన్మించారు. 78 ఏళ్లు బతికారు. తిరుపతిలో విద్వాన్‌ కోర్సు చదువుతున్న సమయంలోనే 'మహాప్రస్థానం' చదివి అభ్యుదయ భావజాలం వంటపట్టించుకున్న సింగమనేని జీవితమంతా మార్క్సిస్టు భావజాలాన్ని అర్ధం చేసుకున్నారు. సాహిత్యాన్ని సృష్టించారు. సాహిత్య ప్రసంగాలు చేశారు. విమర్శలు రాశారు.


సింగమనేని వ్యవసాయ నేపథ్యం గలవారు. ఆయన చేసిన వృత్తి ఉపాధ్యాయ వృత్తి. ఆయన భావజాలం మార్క్సిజం. సింగమనేని ప్రధానంగా కథా రచయిత. సాహిత్య ప్రచారకుడు, సాహిత్య విమర్శకుడు. మొదట కాల్పనిక దృష్టితో రెండు మూడు నవలలు రాశారు. జీవిత వాస్తవాలు అర్ధం కావడంతో వాస్తవికవాదం కరదీపికగా, దాదాపు 60 కథలు రాశారు. తాను కథలు రాయడమేగాక, అనేకమంది కథా రచయితలుగా తయారవడానికి దోహదపడ్డారు. సింగమనేని గొప్ప సాహిత్య పాఠకుడు. తెలుగులోకి వచ్చిన మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలు, కథలు, నవలలు విరివిగా చదివి జీర్ణించుకున్నారు. తెలుగు కథా నవలా సాహిత్యం గురజాడ నుండి నేటి దాకా పుష్కలంగా అధ్యయనం చేశారు. యువ రచయితలు మంచి కథలు రాస్తే చదివి వాళ్ళకు కార్డు ద్వారానో, ఫోన్‌ లోనో తన అభిప్రాయం చెప్పారు. ఆ రకంగా ఆయన కథా రచయితలకు అభిమాన మార్గదర్శి అయ్యారు.


రాయలసీమవాసిగా సింగమనేని రాయలసీమ సామాజిక జీవితంలో నిర్వహించిన పాత్ర చరిత్రాత్మకమైనది. రాయలసీమ కరువు నేపథ్యంలో ఆయన రాయలసీమ సాగునీటిని గురించి, పరిశ్రమల గురించి జరిగిన ఉద్యమాలలో ప్రధాన పాత్ర పోషించారు. 2000-2004 మధ్య రాయలసీమను ప్రత్యేకంగా అనంతపురం జిల్లాకు దుర్భరమైన కరువు చుట్టుముట్టి, రాళ్ళతో పోరాటం చేసే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గ్రామాలు వలసలు వెళ్ళిపోయాయి. ఆ సమయంలో అనంతపురం జిల్లా రచయితలు, కళాకారులు, మేధావులు, కొన్ని ప్రజాసంఘాలు కలిసి రైతు ఆత్మహత్య వ్యతిరేక యాత్రలు, కరువు అధ్యయన యాత్రలు, గంజి కేంద్రాలు నిర్వహించాయి. వాటిలో సింగమనేని క్రీయాశీలక పాత్ర నిర్వహించారు. రాయలసీమ నీటి అవసరాలు, వాటిని సాధించడానికి మార్గాల గురించి సింగమనేనికి శాస్త్రీయమైన అవగాహన ఉండేది. కోస్తా ప్రాంతానికి వెళ్ళి కూడా తన ప్రాంత సమస్యలను, వాటి పరిష్కారంలో కోస్తా ప్రాంతవాసుల సహకారం గురించి మాట్లాడడానికి ఆయన వెనకాడలేదు. ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమాలు మొదలు కాకముందే సింగమనేని 'సీమ కథలు' సంకలనాన్ని సంపాదకులుగా ప్రచురించారు.


1956 'పెన్నేటి పాట'లో రాళ్ళపల్లి రాసిన ముందుమాటలో ప్రాంతీయ అస్తిత్వ స్పృహ తొంగి చూసింది. 1985 తర్వాత రాయలసీమ వెనుకబాటుతనం నిర్మూలనోద్యమంతో స్పృహ విస్తరించింది. ఈ విస్తరణకు సింగమనేని తనదైన దోహదం చేశారు. ప్రాంతీయ అసమాభివృద్ధి నిర్మూలన ఆయన ధ్యేయం. రాయలసీమ నీటి అవసరాల గురించి అర్ధరాత్రి నిద్ర లేపి అడిగినా టిఎంసి లతో సహా చెప్పగల జాగృతి, చైతన్యం గల సింగమనేని మరణం రాయలసీమకు పెద్ద నష్టం.


సింగమనేని కథానికలను నాలుగు పార్శ్యాల నుండి పరిశీలించవచ్చు. వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిన కథకుడుగా రాయలసీమ వ్యవసాయ, సంక్షోభం మీద సింగమనేని 'జూదం, అడుసు, ఊబి, ఉచ్చు, విముక్తి, యక్ష ప్రశ్నలు...' వంటి బలమైన విలువైన కథలు రాశారు. ఉపాధ్యాయుడిగా, ఉపాధ్యాయ ఉద్యమాలు, విద్యా రంగం పట్ల గౌరవం గలవారిగా ఆ రంగంలోని అనారోగ్యకరమైన ధోరణులను విమర్శిస్తూ 'విష్‌, చీర, బుడగలు, కంచె, పరీక్షిత్తు' వంటి అధిక్షేప కథలు రాశారు. మధ్యతరగతి వ్యక్తిగా హింస, ప్రమాద వీణ వంటి కథలు రాశారు. స్త్రీ పక్షపాతిగా పురుషాధిపత్యాన్ని నిరసిస్తూ 'నిషిద్ధం, నీకూ నాకూ మధ్య నిశీధి, దృశ్యమూ-అదృశ్యమూ...' వంటి విలువైన కథలు రాశారు.


సింగమనేని రూపొందించిన నారాయణప్ప, వెంకటప్ప, నారప్ప వంటి పాత్రలు రాయలసీమ రైతువే. వాణిజ్య పంటల మాయాజలంలో చిక్కుకొని నష్టపోయిన రైతులే. భూ విముక్తి ఉద్యమాలు రాయలసీమ నేపథ్యంలో రావడం పట్ల విమర్శనాత్మకంగా సింగమనేని రాసిన కథ 'విముక్తి'. ఈ కథ అప్పట్లో వివాదాస్పదం అయింది. సింగమనేని కథలలో ఆణిముత్యమూ, ఆయన ముద్ర ఉన్న కథ 'అడుసు'. ఎనిమిదేళ్ళు శ్రమించి పండించిన పంటను అమ్ముకునేటప్పుడు రైతును... ఏమీ శ్రమించకుండానే దళారులు ఎలా మోసం చేస్తారో...దానిపైన రైతు ప్రతిస్పందన ఏమిటో 'అడుసు' కథలో చిత్రించారు. నారాయణప్ప రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వని దుర్మార్గం మీద నిరసనగా ఎనిమిదేళ్ళు బిడ్డలు లాగా సాకిన చీనీ చెట్లను గొడ్డళ్ళతో నరికేయడం ఒళ్ళు జలదరించే ముగింపు. ఆ ముగింపు సెన్షేషనల్‌ ముగింపు కాదు. రాయలసీమలో రైతులు చాలా మంది ఆ పని చేశారు. ఢిల్లీలో పాలకులు చేసిన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ మూడు నెలలుగా రైతులు ఉద్యమిస్తున్న నేపథ్యంలో 'అడుసు' కథ నాయక స్థానంలో నిలుస్తుంది. భార్య అనారోగ్యం కన్నా పొలంలో నీళ్ళు పట్టడమే ప్రధానమనుకొనే నారప్ప కనిపిస్తాడు సింగమనేని కథలో.


ఉమ్మడి కుటుంబంతో ఒక్కడు మాత్రం చదువుకొని పైకి వస్తే, ఆ ఒక్కడి అవస్థలు ఎలా వుంటాయో 'హింస' కథ చదివితే తెలుస్తుంది. విద్యా వ్యవస్థలో పరీక్షలలో కాపీలు జరగడానికి ఒకవైపు అధికారులు, ఇంకోవైపు తల్లిదండ్రులు ఎలా ఒత్తిడి చేస్తారో 'కంచె, పరీక్షిత్తు' కథలలో చిత్రించిన సింగమనేని, సమాజానికి విద్యా బుద్ధులు నేర్పి సామాజిక రుగ్మతల నిర్మూలనకు మార్గదర్శకంగా ఉండవలసిన విద్యా వ్యవస్థలో అస్పృశ్యత ఎలా నాట్యం చేస్తున్నదో 'మకర ముఖం' కథలో ఆవిష్కరించారు. బూర్జువా జీవన విధానంలో ఇటీవల మధ్య తరగతి కుటుంబాలలో బలిసిపోతున్న వస్తు వ్యామోహం మీద విమర్శనాత్మకంగా సింగమనేని 'అవాస్తువికత' అనే కథ రాశారు. ప్రపంచీకరణ తొలి దశలో సింగమనేని రాసిన ఈ కథలో అప్పటికన్నా ఇప్పటికే ప్రాసంగికత ఎక్కువగా ఉంది.


మార్క్సిస్టు కథకుడుగా సింగమనేని ఆర్థిక, ప్రాంతీయ వ్యత్యాసాలను సహించనట్లే, సాంఘిక వివక్ష దోపిడీలను కూడా సహించలేదు. 'మకర ముఖం' కథలో దళిత అధ్యాపకుని అవమానాలను చిత్రించిన సింగమనేని, 'ఉచ్చు' కథలో అప్పుల మిషతో సంపన్న ఆధిపత్య కుల రైతులు... దళితులను హింసిస్తూ వాళ్ళకున్న చిన్నచిన్న ఆస్తులను ఎలా స్వాధీనం చేసుకుంటారో చిత్రించారు. స్త్రీల పక్షం వహించి ఆయన రాసిన కథలు...పురుషాధిపత్యం మీద ఆయన చేసిన నిరసనకు ప్రతిరూపాలు.


సులభంగా ఎక్కువగా సంపాదించాలనే తత్వం మీద అధిక్షేపంగా ''దృశ్యమూ అదృశ్యమూ'' కథ రాశారు. స్త్రీ పురుషుల మధ్య సహజమైన ప్రేమ ఎలా ఉండాలో 'నీకూ నాకూ మధ్య నిశీధి'లో చిత్రించారు. అబ్బాయిలోని స్వార్ధాన్ని గుర్తించి అతనితో పెళ్ళిని తిరస్కరించిన అమ్మాయి కథ ''నిషిద్ధం''. అబ్బాయిని పెళ్ళి చూపులు చూడటానికి తానే బయలుదేరి వెళ్ళిన సాహస స్త్రీ కథ ''వాసంత తుషారం''.


సింగమనేని కథా సాహిత్యం లక్ష్యం తలకిందులుగా ఉన్న సామాజిక వ్యవస్ధను నిటారుగా నిలబెట్టడమే. విమర్శనాత్మక వాస్తవికతను అభివ్యక్త సాధనంగా చేసుకొని వర్తమాన సామాజిక వాస్తవికతను వస్తువుగా చేసుకొని, రేపటి సమాజం మరింత అందంగా, ప్రజాస్వామికంగా ఉండేట్టు చేయడమే ప్రజా కథకులు చేసే పని. సింగమనేని ఆ పనే చేశారు. వాస్తవిక కథా నిర్మాణదక్షుడు సింగమనేని.
                      * రాచపాళెం చంద్రశేఖర రెడ్డి (వ్యాసకర్త ప్రజాశక్తి బుకహేౌస్‌ గౌరవ సంపాదకులు)