
ప్రముఖ సోషల్ మీడియా సంస్థ వాట్సాప్‌ను ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా.. తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను అందిస్తూ ముందుకు దూసుకెళ్తోంది. ఇప్పటికే వ్యూ వన్స్, మీడియా అప్లోడ్ క్వాలిటీ, మల్టీ డివైజ్ సపోర్ట్, రీడ్ లేటర్ వంటి ఫీచర్స్‌ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిలో కొన్ని ఫీచర్స్ బీటా వినియోగదారుల కోసం ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని ఫీచర్స్ పరీక్షల దశలో ఉన్నాయి. అవి కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. తాజాగా మొబైల్, డెస్క్‌టాప్ వెర్షన్స్‌లో మరికొన్ని కొత్త ఫీచర్స్‌ని తీసుకువచ్చేందుకు సిద్ధమైంది.
వాయిస్ మెసేజ్‌లో కొత్త ఫీచర్..
వాట్సాప్ తీసుకురాన్ను కొత్త ఫీచర్లలో వాయిస్ మెసేజ్ ఒకటి. ఈ ఫీచర్ ఇది వరకే వాట్సాప్‌లో ఉంది. అయితే, ఇప్పటి వరకు మనం పంపే వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేసిన వెంటనే పంపేవాళ్లం. త్వరలో రానున్న ఫీచర్ సాయంతో వాయిస్ మెసేజ్‌లను రికార్డ్ చేసి, యూజర్ విన్న తర్వాత అవతలి వారికి పంపొచ్చు. దీని వల్ల మనం రికార్డు చేసిన మెసేజ్‌లో ఏమైనా మార్పులు ఉంటే.. ఆ ఆడియో మెసేజ్‌ని డిలీట్ చేసి కొత్త మెసేజ్‌ను రికార్డ్ చేసి పంపే సదుపాయం ఉంటుంది.
రివ్యూ బ్యాన్/రిక్వెస్ట్ ఏ రివ్యూ ఫీచర్..
మరొకటి 'రివ్యూ బ్యాన్/రిక్వెస్ట్ ఏ రివ్యూ' అనే కొత్త పీచర్. సాధారణంగా వాట్సాప్ ద్వారా ఎవరైనా తప్పుడు లేదా చట్ట వ్యతిరేకమైన సమాచారం వ్యాపింపజేస్తున్నట్లు గుర్తిస్తే వాట్సాప్ ఆటోమేటెడ్ సిస్టంలు సదరు ఖాతాలను బ్లాక్ చేస్తాయి. కొన్నిసార్లు వాట్సాప్ ఆటోమేటెడ్ సిస్టం పనితీరు కారణంగా తప్పుడు సమాచార వ్యాప్తితో సంబంధంలేని వ్యక్తుల ఖాతాలకు కూడా నిషేధానికి గురవుతున్నాయి. దీంతో వినియోగదారులు వాట్సాప్ ఆటోమెటేడ్ సిస్టం పనితీరుపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సాప్ 'రివ్యూ బ్యాన్స్/రిక్వెస్ట్ ఏ రివ్యూ' పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది. ఒకవేళ మీ ఖాతాను వాట్సాప్ ఆటోమెటేడ్ సిస్టం బ్లాక్ చేస్తే మీరు రివ్యూకి వెళ్లొచ్చు. అలా మీరు రివ్యూ కోరిన వెంటనే మీకు ఇన్-యాప్ నోటిఫికేషన్ వస్తుంది. తర్వాత 24 గంటల్లో మీ ఖాతాను రివ్యూ చేసి సమస్యను పరిష్కరిస్తారు. ఒకవేళ మీ ఖాతాను పొరపాటున బ్యాన్ చేస్తే ఖాతాలోని ఛాట్ హిస్టరీ తొలగించకుండా తిరిగి యాక్టివేట్ చేస్తారు.
గ్రూప్ కాలింగ్ కొత్త యుఐ..
వాయిస్ లేదా వీడియో కాల్స్‌లో వాట్సాప్ కొన్ని ముఖ్యమైన మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా గ్రూప్ కాలింగ్‌కు కొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌తోపాటు గ్రూప్ కాల్ ప్రారంభమయిన తర్వాత కాల్ మధ్యలో జాయిన్ అయ్యేలా కొత్త ఫీచర్‌ను తీసుకొస్తుంది.