Mar 27,2023 20:34

జెండాఊపి ప్రారంభిస్తున్నజెడ్‌పి చైర్మన్‌ ఆనం అరుణమ్మ

జెండాఊపి ప్రారంభిస్తున్నజెడ్‌పి చైర్మన్‌ ఆనం అరుణమ్మ
వైద్యరంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత
నెల్లూరు:సామాన్య , మద్యతరగతి ప్రజలందరికీ మెరుగైన వైద్యసేవలు సకాలంలో అందించడమే లక్ష్యంగా వైద్యరంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చూడుతోందని కలెక్టర్‌ కెవిఎన్‌ చక్రధర్‌ బాబు పేర్కొన్నారు. సోమవారం ఉదయం నగరంలోని జిల్లా పరిషత్‌ కార్యాలయ ఆవరణలో జిల్లాకు నూతనంగా మంజూరైన ఏడు 104 అంబులెన్స్‌ లను జడ్పీ చైర్పర్సన్‌ ఆనం అరుణమ్మతో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలకు అత్యవసర, నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు 104, 108 వాహనాలు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు 104, 108 సేవలు సకాలంలో అందుతున్నాయన్నారు. ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా వైద్యరంగంలో అనేక సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోందన్నారు. అందులో భాగంగానే గ్రామాల్లో విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ లు ఏర్పాటు చేసి, ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ ద్వారా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి వారి ఆరోగ్య స్థితిగతులను తెలుసుకొని వైద్య సేవలు అందజేసే ప్రయత్నాలను ప్రారంభించిందన్నారు
. ప్రాథమిక, కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేసి, బయోమెట్రిక్‌ అమలు చేయడంతో వైద్యులందరూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. జిల్లా పరిషత్‌ చైర్పర్సన్‌ ఆనం అరుణమ్మ మాట్లాడుతూ మారుమూల గ్రామాలకు సైతం మెరుగైన వైద్యశాల అందించేందుకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఎంతో కషి చేస్తున్నారని, జిల్లాలో 104 వాహనాలు 37 సేవలందిస్తుండగా, తాజాగా మరో ఏడు నూతన వాహనాలను జిల్లాకు కేటాయించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి పెంచలయ్య, జడ్పీ సీఈవో చిరంజీవి, 104, 108 అంబులెన్స్‌ ల జిల్లా మేనేజర్‌ పవన్‌, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.