Jun 10,2021 15:37

న్యూఢిల్లీ : యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా రూటు మార్చుకున్నారు. వైద్యులు దేవుని దూతలంటూ వ్యాఖ్యానించారు. అల్లోపతివైద్యం స్టుపిడ్‌ సైన్స్‌ అంటూ, కరోనా వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, టీకాలు తీసుకున్న తరువాత కూడా వేలాది మంది వైద్యులు మరణించారంటూ ఇటీవల రామ్‌దేవ్‌ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అల్లోపతిని, వైద్యులను కించపరిచేలా రామ్‌దేవ్‌ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ మండిపడింది. రాందేవ్‌కు లీగల్‌ నోటీసు లిచ్చింది. అలాగే కేంద్ర ఆరోగ్యమంత్రికి, ప్రధానికి లేఖ రాసింది. ఢిల్లీ మెడికల్‌ అసోసియేషన్‌ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు రాందేవ్‌పై చర్యలు తీసుకోవాల్సిందిగా బుధవారం ఐఎంఎ, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసిఎంఆర్‌) కు లేఖ కూడా రాసింది. ఈ పరిణామాలతో రాందేవ్‌ తన రూటు మార్చుకున్నారు. వైద్యులను తాను కించపరచలేదని, తన పోరాటం మాదక ద్రవ్యాల మాఫియాకు వ్యతిరేకంగానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని, తాను కూడా త్వరలో వ్యాక్సిన్‌ తీసుకుంటానని ప్రకటించారు. అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం అయిన జూన్‌ 21 నుండి అందరికీ ఉచిత వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ప్రధాని ప్రకటించారని.. ఈ వార్త సంతోషదాయకమని ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు.

శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి విధానం ఉత్తమమైందని, తాను భారతీయ వైద్యవ్యవస్థని ద్వేషించడం లేదని అన్నారు. కానీ అవసరమైన మందులు, చికిత్సల పేరుతో ప్రజలను దోపీడీ చేయకూడదని ఆయన హితవు పలికారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న జనరిక్‌ మెడిసిన్‌ తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని అన్నారు. అయితే ప్రాణాంతక వ్యాధులు, దీర్ఘకాలిక రుగ్మతలను పురాతన పద్ధతుల ద్వారా నయం చేయవచ్చని ఆయుర్వేదంలో ఉందన్నారు. ఆయుర్వేదాన్ని ప్రజలంతా ఆచరించాలని, వ్యాధుల నివారణలో యోగా రక్షణ కవచంలా ఉంటుందనీ, ముఖ్యంగా కరోనా నుండి యోగా రక్షిస్తుందని రాందేవ్‌ పేర్కొన్నారు.