Oct 03,2022 02:34
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

ప్రజాశక్తి-మార్టూరు రూరల్‌: గ్రామ స్వరాజ్యంతోనే గాంధీజీ కలలు నెరవేరతాయని, ఆ కలలను నిజం చేసేందుకు భారత రాజ్యాంగం పంచాయతీ వ్యవస్థను రూపొందిస్తే వైసీపీ ప్రభుత్వం ఈ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ పంచాయతీల నిధులను అడ్డగోలుగా దోచుకుంటుందని తెలుగుదేశం పార్టీ బాపట్ల పార్లమెంట్‌ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు విమర్శించారు. ఆదివారం మహాత్మాగాంధీ 153వ జయంతి, లాల్‌ బహదూర్‌ శాస్త్రి 118వ జయంతిని పురస్కరించుకొని ఆ మహనీయులకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆదివారం ఏలూరి ఒక ప్రకటన విడుదల చేశారు. వైసీపీ మూడున్నరేళ్ళ పాలనలో స్థానిక సంస్థలు నిర్వీర్యం అయ్యాయన్నారు. పంచాయతీలు నిధులు లేక వెలవెలబోతున్నాయని, కనీసం విద్యుత్‌ బిల్లులు, బ్లీచింగ్‌ చల్లేందుకు నిధులు లేకపోవడం దారుణమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి పంచాయతీలకు వచ్చే నిధులన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని ఆరోపించారు. గత మూడేళ్లలో కోట్లాది రూపాయల కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిందన్నారు. ప్రతి రూపాయి ప్రభుత్వం వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సర్పంచులు వైసిపి పాలనలో ఉత్సవ విగ్రహాలుగా మారారన్నారు. ఒక మంచి లక్ష్యంతో, ఎన్నో ఆశలు, ఆ కాంక్షలతో రాజకీయాల్లోకి వచ్చి సర్పంచ్‌ లుగా ఎన్నికైన యువతకు వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో నిరాశ కలిగిందన్నారు. గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. నేడు ఆ పరిస్థితి లేదన్నారు. పంచాయతీ అధికారాలను దుర్వినియోగం చేస్తున్న వైసీపీ పాలకులపై సర్పంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రభుత్వ తీరు మారడం లేదన్నారు. వైసిపి సర్పంచులే ప్రభుత్వాన్ని నిలదీస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయన్నారు.