Jun 24,2022 01:37

దర్శి ప్లీనరీ సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి

ప్రజాశక్తి-ఒంగోలుబ్యూరో : పాలకపక్షం సంస్థాగత వ్యవహారాలపై దృష్టిసారించింది. వచ్చేనెలలో జరిగే రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలనే ఎజండాతో ఇపుడు నియోజకవర్గస్థాయి ప్లీనరీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అన్ని నియోజక వర్గాల్లో ఈనెల 28లోపు ప్లీనరీ సమావేశాలు నిర్వహించేలా షెడ్యూల్‌ ఖరారు చేశారు. టిడిపి రాష్ట్ర మహానాడు ఊహించని విధంగా విజయవంతం కావడంతో ఇపుడు పాలకపక్షం కూడా అందుకు పోటీగా నిర్వహించాలని భావిస్తోంది. ఇందుకోసం దిగువ స్థాయి నుంచే కదలిక వచ్చేలా పార్టీ ఆలోచన చేసింది. అందులో భాగంగానే క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జులు నేరుగా కలిసి మాట్లాడేలా ప్లీనరీ సమావేశాలు పెడుతున్నారు. గురువారం కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లో సమావేశాలు నిర్వహించారు. జడ్‌పి చైర్‌పర్సన్‌ను బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. కనిగిరిలో స్థానిక ఎమ్మెల్యే, వైసిపి జిల్లా అధ్యక్షుడు బుర్రా మధుసూధన్‌యాదవ్‌ నేతృత్వంలో ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఇందులో నడిచిన ఎజండా ఏమీ ప్రత్యేకంగా లేదు. పాదయాత్రలో జగన్‌ ఇచ్చిన హామీలను సిఎం అయ్యాక 90శాతం నెరవేర్చారని చెప్పారు.తిరిగి అధికారంలోకి రావాలన్నదే ధ్యేయంగా నేతలు ప్రసంగాలు సాగాయి. సంక్షేమ పథకాలను గడపగడపకూ తీసుకుపోవాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. వచ్చే నెలలో జరిగే రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు తరలి రావాలని పిలుపునిచ్చారు.ఇంతకు మించి అక్కడ ఎజండా అంటూ ఏమీలేదు. నిరుత్సాహంగా ఉన్న క్యాడర్‌ను కదలించే యత్నం జరిగింది. ప్రభుత్వంపై ప్రజలకన్నా ఇపుడు పార్టీ క్యాడర్‌లోనే అసంతృప్తి ఉంది. మూడేళ్లు దాటినా ఏ పనులు లేవనే అసంతృప్తితో ఉన్నారు. చేసిన పనులకు బిల్లులు రాలేదు. సచివాలయాలు, రైతుభరోసా కేంద్రాలు కట్టిన కాంట్రాక్టర్లు దివాళా తీశారు. అభివృద్ధి ప్రశ్నార్ధకంగా మారిన ఈ తరుణంలో ఇపుడు ప్లీనరీ సమావేశాల్లో నేతలు ఎంత ఏకరువుపెట్టినా క్యాడర్‌లో అసంతృప్తి వీడే పరిస్థితి లేదంటున్నారు. మరోవైపు పార్టీలో ఇటీవల కాలంలో అసమ్మతులు పెరిగాయి. గడపగడపకూ కార్యక్రమంలో అనేక నియోజకవర్గాల్లో బహిరగంగానే ఆరోపణలు చేసుకున్నారు. జిల్లా కేంద్రానికి పంచాయితీలు వచ్చాయి. నాగులుప్పలపాడు వైసిపి నేతలు ప్రత్యక్షంగా ఎమ్మెల్యే సుధాకర్‌బాబుపై తిరుగుబాటు చేపట్టారు. అనేక చోట్ల ఇదే తీరు ఉంది. కొన్నిచోట్ల బహిర్గతం కావడం లేదు. ఇదిలా ఉండగా దర్శి నియోజకవర్గ ప్లీనరీ గురువారం సాయంత్రం నిర్వహించారు. ఈ సమావేశానికి స్థానిక జడ్‌పిటిసిగా ఉన్న జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మను ఆహ్వానించలేదని చెబుతున్నారు. దీంతో ఆమె కనిగిరి సమావేశానికి మాత్రమే హాజరై ఇంటికి చేరారు. ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ వైఖరిపై స్థానికంగా ఉన్న బూచేపల్లి వర్గీయులు గరంగరంగా ఉన్నారు. బూచేపల్లి ముద్ర పడిన కొందరు సర్పంచులను కూడా ఆహ్వానించ లేదంటున్నారు.ఇలా నియోజకవర్గాల్లో పార్టీలో ఉన్న వర్గాలు కూడా ఇపుడు తెరపైకివచ్చాయి. చీరాల నియోజవర్గంలో ఇన్‌ఛార్జిగా కరణం వెంకటేశ్‌కు పూర్తి స్థాయిలో స్పష్టత ఇచ్చారు. ఆయన ఈనెల 25 ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించేందుకు నేతలతో మంతనాలు సాగిస్తున్నారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌, ఎమ్మెల్సీ పోతుల సునీత భవితవ్యం ఏమిటనేదీ ప్రశ్నార్ధకంగా ఉంది. అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఇన్‌ఛార్జిలుగా ఉన్నవారే ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నారు. గిద్దలూరు లోనూ పరిస్థితి అదుపులో లేదు. ద్వితీయశ్రేణి నేతలు ఎమ్మెల్యే అన్నా రాంబాబుపె ౖరాజకీయపెత్తనం విషయంలో అసంతృప్తిగానే ఉన్నారు. కొండపి నియోజకవర్గంలోనూ రెండు వర్గాలున్నాయి. ఇక్కడ నేతల మధ్య సమన్వయం ఇంకా కుదరలేదు. తనిఖీలు,పరామర్శలు ఇద్దరూ చేస్తున్నారు. ఇక జిల్లా వైసిపి బాస్‌ మాజీ మంత్రి బాలినేని ఇంకా గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పట్టణంలో మొదలు పెట్టలేదు. ప్లీనరీ సమావేశం నిర్వహించాల్సి ఉంది. ఏదేమైనా ఇపుడు రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు భారీగా తరలింపు లక్ష్యంగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నారు.