Mar 14,2021 17:16

అమరావతి : మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ వైసిపి ప్రభంజనం కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో కార్పొరేషన్లు సహా మున్సిపాలిటీలన్నింటిలోనూ క్లీన్‌స్వీప్‌ చేసింది. మొత్తం 12 కార్పొరేషన్లకు 11 కార్పొరేషన్లలో కౌంటింగ్‌ జరగగా 11 కార్పొరేషన్లలో విజయం సాధించింది. 75 మున్సిపాలిటీలకు గానూ 72 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. కౌంటింగ్‌ జరుగుతున్న మచిలీపట్నం కార్పొరేషన్లలోనూ వైసిపి ఆధిక్యంలో ఉంది. ఇక, రెండు మున్సిపాలిటీల్లో మాత్రమే టిడిపి విజయం సాధించింది. అనంతపురం జిల్లా తాడిపత్రి, కడప జిల్లాల్లోని మైదుకూరు మున్సిపాలిటీల్లో టిడిపి ఆధిక్యంలో నిలిచింది. టిడిపి సీనియర్‌ నేతలు అచ్చెన్నాయుడు, అశోక్‌ గజపతిరాజు, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప, బాలకృష్ణకు సైతం గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలకు ప్రజలు జైకొట్టడంతో ఎపిలో ఇంత వరకు ఎన్నడూ, ఏ పార్టీ పొందని అత్యధిక సీట్లు వైసిపి కైవసం చేసుకుంది.

రాష్ట్ర వ్యాప్తంగా 11 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ఇప్పటి వరకు వైసిపి 11 కార్పొరేషన్లను దక్కించుకుంది. కడప, చిత్తూరు, తిరుపతి, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, విశాఖ, విజయవాడ, విజయనగరం, అనంతపురం, కర్నూల్‌, విజయవాడ,  మచిలీపట్నం కార్పొరేషన్లు వైసిపి ఖాతాలో పడ్డాయి.  

ఉత్తరాధ్ర, కోస్తాలో వైసిపి క్లీన్‌స్వీప్‌..
రాష్ట్రవ్యాప్తంగా 75 మున్సిపాలిటీలకు వెలువడుతున్న ఫలితాల్లో వైసిపి దూసుకుపోతోంది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో అన్ని మున్సిపాలిటీల్లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేసింది.
- శ్రీకాకుళం జిల్లాలో 3 మున్సిపాలిటీలకు గానూ మూడూ గెలిచింది. ఇచ్ఛాపురం, పలాస, పాలకొండలో విజయం సాధించింది.
- విజయనగరం జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలనూ కైవసం చేసుకుంది. బొబ్బిలి, నెల్లిమర్ల, సాలూరు,
- విశాఖ కార్పొరేషన్‌ సహా.. యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీలను వైసిపి కైవసం చేసుకుంది.
- తూర్పు గోదావరి జిల్లాలో వైసిపి క్లీన్‌స్వీప్‌ చేసింది. పది మున్సిపాలిటీలకుగానూ పదింటిలోనూ విజయం సాధించింది. తుని, అమలాపురం, రామచంద్రాపురం, గొల్లప్రోలు, ముమ్మిడివరం, సామర్లకోట, ఏలేశ్వరం, మండపేట, పెద్దాపురం, పిఠాపురం మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగురవేసింది.
- పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలనూ వైసిపి కైవసం చేసుకుంది. నరసాపురం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీల్లో వైసిపి విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేసింది.
- కృష్ణా జిల్లాలో నందిగామ, తిరువూరు, నూజివీడు, ఉయ్యూరు, పెడనలో వైసిపి జయకేతనం ఎగురవేసింది.
- గుంటూరు జిల్లాలోనూ వైసిపి క్లీన్‌స్వీప్‌ చేసింది. కార్పొరేషన్‌ సహా ఏడు మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. రేపల్లె, తెనాలి, సత్తెనపల్లి, వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్లలో విజయం సాధించింది.
- నెల్లూరు జిల్లాలోనూ వైసిపి హవా కొనసాగుతోంది. నాలుగు మున్సిపాలిటీల్లోనూ.. సూళ్లూరుపేట, నాయుడు పేట, వెంటకగిరి, ఆత్మకూరులో గెలిచి క్లీన్‌స్వీప్‌ చేసింది.
- ప్రకాశం జిల్లాలో 6 మున్సిపాటీలనూ వైసిపి కైవసం చేసుకుంది. గిద్దలూరు, కనిగిరి, చీమకుర్తి, మార్కాపురం, అద్దంకి, చీరాలలో విజయం సాధించింది.
- కర్నూలు జిల్లాలో కార్పొరేషన్‌ సహా 9 మున్సిపాలిటీల్లో వైసిపి విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేసింది. గూడూరు, ఎమ్మిగనూరు, ఆదోని, డోన్‌, నంద్యాల, ఆళ్లగడ్డ, ఆత్మకూరు, నందికొట్కూరులో విజయం సాధించి క్లీన్‌స్వీప్‌ చేసింది.
- చంద్రబాబు సొంత జిల్లాలో వైసిపి క్లీన్‌స్వీప్‌ చేసింది. చిత్తూరు, తిరుపతి కార్పొరేషన్లు సహా.. మదనపల్లి, పలమనేరు, పుత్తూరు, పుంగనూరు, నగరి మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది.
- కడప జిల్లాలో మైదుకూరు మున్సిపాలిటీ మినహా మిగిలిన మున్సిపాలిటీలన్నీ వైసిపి కైవసం చేసుకంది. 7 మున్సిపాలిటీలకు గానూ 6 స్థానాలు.. ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, బద్వేల్‌, రాయచోటి, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో వైసిపి గెలవగా.. మైదుకూరు మున్సిపాలిటీలో టిడిపి గెలిచింది.
- అనంతపురం జిల్లాలో ధర్మరం, రాయదుర్గం, గుత్తి, కళ్యాణదుర్గం, కదిరి, మడకశిర, పుట్టపర్తిలో వైసిపి విజయం సాధించగా.. తాడిపత్రి మున్సిపాలిటీలో టిడిపి విజయం సాధించింది.